v.Vijaya sai reddy
-
మధ్యతరగతిపై పన్నుల భారాన్ని తగ్గించాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప.. వాళ్లకు ఒనగూరుతోంది ఏంటని? వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ఓవైపు ఆదాయపన్ను, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒనగురుతున్నది ఏంటి?. కేవలం రోడ్లు భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలి’’ అని ప్రసంగించారు.‘‘పెన్షన్‌పై ఎలాంటి పన్నులు వేయవద్దు. లక్ష రూపాయల వరకు పెన్షన్లు టాక్స్ ఫ్రీ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. సీనియర్ సిటిజన్లో కోసం ఐటీ ఫైలింగ్ కోసం ప్రత్యేక సహాయ యంత్రంగా ఏర్పాటు చేయాలి. పీపీఎఫ్ వడ్డీరేట్లు, ఎఫ్డీ రేట్లకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలి పొదుపును ప్రోత్సహించాలి. సరైన సమయంలో ఆదాయ పన్ను ఫైల్ చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని కేంద్రాన్ని కోరారాయన. వీటితో పాటు.. తక్కువ వడ్డీకే వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలని, అలాగే.. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని తగ్గించాలి అని ఆయన వైఎస్సార్సీపీ తరఫున కేంద్రాన్ని కోరారు. -
విజయసాయి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు(జులై 1). ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయసాయిరెడ్డి రెండోసారి ఎన్నికై రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం సభలో చట్టాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు.. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి విశేష సేవలందించారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, టీటీడీ మెంబర్ గా, పబ్లిక్ సర్వీస్ బ్యాంకు డైరెక్టర్ గానూ గతంలో ఆయన పని చేశారు. ఆయన సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ రాజ్యసభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అని చైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. అలాగే.. రాజ్యసభలో కొందరు సభ్యులు ఆయనకు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. -
పొగమంచు ఎఫెక్ట్‌తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
అమెరికాలోనే యూదు వ్యతిరేకత ఎక్కువ!
భారతదేశంలో కులవిద్వేషాలు, మత ఘర్షణలు తరచు జరుగుతాయని, వివిధ సామాజిక వర్గాల మధ్య సామరస్యం తక్కువని పాశ్చాత్య దేశాల మేధావులు, పాత్రికేయులు ఎప్పటి నుంచో వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో అప్పుడప్పుడు మతవిద్వేషాలు, కొన్ని ప్రాంతాల్లో కులాల మధ్య కుమ్ములాటలు నిజమే!. కాని ఐరోపా దేశాలు ఇందుకు మినహాయింపు కాదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. గతంలో అంటే 2001 సెప్టెంబర్ 11న అల్ కాయిదా అనే ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ న్యూయార్క్ నగరంలోని ట్విన్ టవర్స్ పై వైమానిక దాడి చేసి, వాటిని కూల్చేసింది. ఇంకా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటాగాన్ భవనాలపై కూడా అదే సమయంలో దాడికి ప్రయత్నించింది. అమెరికా డొమెస్టిక్ విమానాలను దారి మళ్లించి, వాటితో వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఢీకొట్టిన అల్ కాయిదా యువకులు ఎక్కువ మంది అరబ్బులు కావడంతో అమెరికాలో అరబ్బులపైన, అరబ్బుల మాదిరిగా కనిపించే ఇరానియన్లు, సిక్కులు సహా ఉత్తరాది భారతీయులపైనా జనం కొందరు దాడులు చేసి గాయపరిచారు. గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో కూడా ఇండియాతో పోల్చితే జాతి విద్వేషాల ఫలితంగా చెలరేగే హింస ఎక్కువే. ఇటీవల పాలస్తీనా స్వయం ప్రతిపత్తి, గాజాలోని పాలస్తీనా అరబ్బుల దుర్భర జీవన పరిస్థితులు అనే అంశాల కారణంగా గాజా స్ట్రిప్‌లోని హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్ల వర్షం కురిపించింది. తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) గాజా స్ట్రిప్ పై ప్రతీకార దాడులు జరపడంతో మొత్తం మీద దాదాపు నాలుగు వేల మందకి పైగా మరణించారు. యూదులు నివసించే ప్రాంతాలపై హమాస్ దాడులు, వందకు పైగా ఇజ్రాయెలీ యూదులను కిడ్నాప్ చేసి గాజా ప్రాంతంలోకి తీసుకుపోవడం వంటి ఘటనల గురించి తెలిశాక ఐరోపా దేశాలు, అమెరికాలోని స్థానిక యూదులపై దాడులు పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో కన్నా అమెరికాలోనే యూదులు ఎక్కువ, యూదు వ్యతిరేకతా ఎక్కువే! ఇజ్రాయెల్ లోని 71 లక్షల మందితో సహా ప్రపంచవ్యాప్తంగా కోటీ 40 లక్షల మంది యూదులున్నారు. ఒక్క అమెరికాలోనే ఇజ్రాయెల్ కన్నా ఎక్కువగా అంటే 76 లక్షల మంది యూదులున్నారు. జుడాయిజం అనే మతం, యూదు జాతి సమ్మిళితమై ఉండే ఈ యూదులు ఎక్కడున్నా మిగిలిన వారితో పోల్చితే సంపన్నులు. వారిలో అపర కుబేరులు, మేధావులు, శాస్త్రవేత్తలు ఎక్కువ. ఈ కారణంగా సహజంగానే పాశ్చాత్య ప్రపంచంలో యూదులపై దాడులు తరచు జరుగుతూనే ఉంటాయి. దీన్నే ఇంగ్లిష్ లో యాంటీ సెమిటిజం అంటారు. దాదాపు వందేళ్ల క్రితమే జర్మనీలోని స్థానిక జర్మన్లలో అక్కడ తరతరాలుగా జీవిస్తున్న యూదులపై అసూయాద్వేషాలుండేవి. దీన్ని ఆసరా చేసుకుని నియంత అడాల్ఫ్ హిట్లర్ లక్షలాది మంది జ్యూస్ ను అక్కడ ఊచకోతకోయించాడు. వారి కోసం ప్రస్తుత ఇజ్రాయెల్–పాలస్తీనా ప్రాంతంలో ప్రత్యేక దేశం 1948 మేలో ఏర్పాటు చేశారు, తర్వాత యూదు వ్యతిరేకత తగ్గింది గాని, ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో చారిత్రకంగా పరిస్థితుల కారణంగా ముస్లింలంటే కాస్త వ్యతిరేకత, అనుమానాలు ఉన్నట్టే–అమెరికా, ఐరోపా దేశాల్లో కూడా యూదు వ్యతిరేకతతో ఈ జాతివారిపై దాడులు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోగాని, కొన్ని దేశాల్లోగాని కొన్ని మతాలు లేదా జాతుల ప్రజల మధ్య విద్వేషాలు పూర్తిగా సమసిపోవడానికి సమయం పడుతుంది. ఈలోగా హింసాత్మక దాడులు జరగకుండా, ప్రభుత్వాలు, పౌర సమాజంలోని సంస్థలు తగిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. ఈ నెల ఆరంభంలో యూదుల సంగీతోత్సవం సుక్కూత్ ముగిసిన శనివారం ఇజ్రాయెల్ ప్రాంతాలపై హమాస్ దాడి చేసింది. ఈ దాడుల తర్వాత ఐరోపా ఖండంలో యూదులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో యూదు జాతివారిపై దాడులు ఎక్కువయ్యాయని వార్తలొస్తున్నాయి. అదీగాక గత పాతికేళ్లుగా పశ్చిమాసియా దేశాల రాజకీయ సంక్షోభం ఫలితంగా ఈ పారిశ్రామిక ఐరోపా దేశాల్లోకి ముస్లిం అరబ్బులు పెద్ద సంఖ్యలో వచ్చి స్థిరపడడం పెరుగుతోంది. క్రైస్తవ సమాజంలో యూదులపై తరతరాలుగా ఉన్న అనుమానాలు, వలసవచ్చి స్థిరపడిన ముస్లిం అరబ్బుల్లో ఉన్న యూదు విద్వేషాల కారణంగా ఇప్పుడు ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చగల్, జర్మనీ, ఫ్రాన్స్‌లో యూదులపై దాడులు ఎక్కువయ్యాయి. వెంటనే ఈ దాడులు నిలిపివేయడానికి అక్కడి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచీకరణ ఫలితంగా అన్ని జాతులు, మతాలు, దేశాల ప్రజలు అన్ని దేశాలకు ఉపాధి కోసం వెళ్ళి స్థిరపడుతున్న కారణంగా హమాస్ దాడి వంటి సంఘటనలు జరిగినప్పుడు పైన చెప్పిన విద్వేషాలు తాజాగా రగులుకోవడం సర్వసాధారణమైపోయింది. వాటిని నియంత్రించడమే తక్షణ కర్తవ్యంగా అందరూ భావించాలి. :::విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ -
ఒబామా హెచ్చరిక హేతబద్ధంగా లేదు!
మానవ ప్రగతి విషయంలో, అక్కడక్కడా అలజడి, తాత్కాలిక అశాంతితో నిత్యం వార్తల్లో నిలిచే దక్షిణాసియాలో చాలా వరకు ప్రశాంతత నెలకొని ఉన్న దేశం ఇండియా. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా, 32,87,263 చ.కి.మీ సువిశాల భారతంలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాల జనాభా 20 శాతం వరకూ ఉంది. అయినా, దాదాపు 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మత ఘర్షణలు మన పొరుగు దేశాల స్థాయిలో ఎన్నడూ జరగలేదు. ఒకవేళ జరిగినా కొద్ది రోజుల్లోనే మామూలు పరిస్థితులు నెలకొనే ఆనవాయితీ ఉంది. మతపరమైన అణచివేత కారణంగా సరిహద్దు దేశాల నుంచి మైనారిటీలు ఇండియాకు శరణార్ధులుగా తరలివస్తున్నారేగాని, ఈ కారణంతో దేశం నుంచి మైనారిటీలు ఎవరూ విదేశాలకు వలసపోయే పరిస్థితులు లేనేలేవు. ఎక్కడైనా మతఘర్షణలు కాస్త తీవ్రస్థాయిలో పెరిగితే వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయుధ బలగాల వల్ల కాకపోతే– సైన్యాన్ని రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం ఎన్నో దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని మతాల ప్రజల మధ్య కొట్లాటలు జరిగితే ఇతర మతాల వారిని మరో మతం వారు తమ ఇంట్లో పెట్టుకుని కాపాడం కూడా భారత సాంప్రదాయంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అల్పసంఖ్యాక మతాలకు చెందిన ప్రజలు ఎలాంటి అశాంతి, అభద్రతాభావం లేకుండా దశాబ్దాల తరబడి జీవిస్తున్నారు. మత సామరస్యానికి సంబంధించి ఇంత చక్కటి, ఆదర్శప్రాయమైన నేపథ్యం, చరిత్ర ఉన్న భారత్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు, అక్కడి మైనారిటీ ఆఫ్రికన్–అమెరికన్ (నల్లజాతి) వర్గానికి చెందిన తొలి నేతగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా నిన్న ఇండియాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మైనారిటీల హక్కులకు రక్షణ కరువైతే ఇండియా ముక్కచెక్కలవుతుందన్న ఒబామా అల్పసంఖ్యాక మతాల ప్రజలు, మైనారిటీ జాతుల హక్కులు పరిరక్షించకపోతే భారతదేశం ముక్కచెక్కలవుతుందని మాజీ అధ్యక్షుడు ఒబామా గురువారం వ్యాఖ్యానించారు. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ప్రఖ్యాత జర్నలిస్టు క్రిస్టీన్ అమన్ పూర్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, భారత సమాజంలో బలహీనవర్గాల స్థితిగతులపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం సబబుగా కనిపించడం లేదని భారత మేధావులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇండియాలో మతపరమైన, జాతిపరమైన మైనారిటీల హక్కులు పరిరక్షించలేకపోతే, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేశం ముక్కచెక్కలవడం మొదలవుతుంది,’ అని ఒబామా ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన అమెరికా అధినేతగా గుర్తింపు పొందిన ఒబామా ఇలా మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ దేశంలోనైనా బడుగువర్గాలను, మైనారిటీలను కాపాడాలని, వారి హక్కులను పరిరక్షించాలని కోరడంలో తప్పులేదు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధికెక్కిన అమెరికాలో (నల్లజాతీయులను బానిసలుగా చూడడం) బానిసత్వం రద్దు సమస్యపై అక్కడి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కొద్ది కాలం అంతర్యుద్ధం జరిగింది కాని ఈ విశాల దేశం రెండుగా చీలిపోలేదు. కొన్ని ఏళ్ల అంతర్గత కల్లోలం తర్వాత అమెరికా మరింత బలోపేతం అయింది. కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యంగా అవతరించింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇండియాలో మతపరమైన మైనారిటీలకు లేదా జాతిపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు గాని తాత్కాలిక ఇబ్బందులు వచ్చినప్పుడు దేశం చిన్నాభిన్నమౌతుందని భయపడాల్సిన అవసరం లేదని మన చరిత్ర నిరూపించింది. భారత చరిత్రను క్షణ్ణంగా పరిశీలిస్తే–ఒబామా గారి హెచ్చరిక హేతుబద్ధంగా కనిపించదు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
geetanjali iyer: ప్రముఖ యాంకర్ కన్నుమూత
గీతాంజలి అయ్యర్(70).. దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్. సుమారు 30 ఏళ్ల పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్ పని చేసిన ఆమె ఇక లేరు. బుధవారం వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆమె మృతిని కుటుంబ సభ్యులు ప్రకటించారు.గత కొంతకాలంగా పార్కిన్సన్స్తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1971లో దూరదర్శన్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా చేరిన ఆమె.. ఆంగ్లంలో వార్తలు చదివిన తొలి ప్రజెంటర్ కూడా. నేషనల్ బులిటెన్‌తో దేశవ్యాప్తంగా ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాదు.. నాలుగు సార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగంలో సేవలకుగానూ గీతాంజలి.. 1989లో అవుట్‌స్టాండింగ్ విమెన్ అవార్డుగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో కలిసి పనిచేశారు. గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సైతం ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. గీతాంజలి అయ్యర్.. కోల్‌కతా లోరెటో కాలేజీలో ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డిప్లోమా సైతం పూర్తి చేశారు. దూరదర్శన్ కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ అనే సీరియల్లోనూ చివరిసారిగా నటించారు. గీతాంజలికి ఇద్దరు పిల్లలు. కూతురు పల్లవి కూడా అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ కూడా. My heartfelt condolences to the family of Geetanjali AyyarJi. Saddened to know that one of the best Doordarshan news presenters of yesteryears Geetanjali Ji passed away. She was a role model for news presenters .. May her soul rest in Peace pic.twitter.com/46ZKScrZ5R — Vijayasai Reddy V (@VSReddy_MP) June 8, 2023 Gitanjali Aiyar, India’s one of the best tv newsreaders, warm and elegant person and woman of immense substance passed away today. Deepest condolences to her family. 🙏 pic.twitter.com/4q1C6vFHbh — Sheela Bhatt शीला भट्ट (@sheela2010) June 7, 2023 -
కంటోన్మెంట్ ప్రజలకు నిజంగా శుభవార్తే!
దేశంలోని సైనిక కంటోన్మెంట్లను రద్దు చేసి, వాటిలోని పౌర నివాస ప్రాంతాలను పక్కనున్న నగర పాలక సంస్థల్లో విలీనం చేయాలని, ఇక నుంచి కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు నిజంగా శుభవార్త. సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలోని కొన్ని చోట్ల సైనిక దళాలు వాడుకునే రోడ్లపై పౌరులు తిరగకుండా ఆంక్షలు విధించినప్పుడు గత కొన్నేళ్లుగా నగరంలో అలజడి చెలరేగడం తెలుగు ప్రజానీకానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా దేశంలోని ఈ కంటోన్మెంట్లలో సైన్యానికి అవసరం లేని, ప్రస్తుతం ఉపయోగంలో లేని లక్షలాది ఎకరాల ఖాళీ భూములను ఆయా నగరాలు, పట్టణాలు లేదా రాష్ట్రాలకు అప్పగిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, ఆగ్రా వంటి 62 కంటోన్మెంటు నగరాల్లో ఖాళీ జాగాల కొరతతో జనసాంద్రత పెరిగిపోతోంది. చాలీచాలని పౌర సదుపాయాలతో జనం ఈ పట్టణాలు, నగరాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక, ఎన్నికైన పౌర ప్రజానీకం ప్రతినిధులు, మిలిటరీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పాలనసాగే ఈ మిలిటరీ కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని ప్రాంతాల్లో మరో సమస్య ఉంది. అదేమంటే, సాధారణ ప్రజలకు ప్రభుత్వాలు అందించించే పథకాలు, సదుపాయాలు ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అందడం లేదు. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ల బోర్డుల రద్దుతో ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు ఆయా రాష్ట్రాల ప్రజలకు సర్కార్ల నుంచి అందే అన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత విలువైన, అవసరమైన ఖాళీ స్థలాలు వేలాది ఎకరాల మేర అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అతి పెద్ద భూస్వామి రక్షణ శాఖ. దేశంలో ఈ శాఖకు 17.99 లక్షల ఎకరాల భూమి ఉండగా, మొత్తం 62 మిలిటరీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని ఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం లెక్కలు వెల్లడిస్తున్నాయి. కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములు చాలా వరకూ ఇక ముందు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. నాడు బ్రిటీష్ పాలన కోసం కంటోన్మెంట్ల ఏర్పాటు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని తన అధీనంలోని ప్రాంతాల ప్రజలను నియంత్రణలో ఉంచుకోవడానికి, విదేశీ దండయాత్రలను తిప్పికొట్టడానికి ఇంగ్లిష్ ఆఫీసర్లు, భారత సిపాయిలతో కూడిన కంపెనీ సైనిక దళాల మజిలీ కోసం ప్రధాన నగరాలు, పట్టణాల వెలుపల ఈ కంటోన్మెంట్లను ఏర్పాటు చేసింది. నాటి కలకత్తా సమీపంలోని బ్యారక్ పూర్ వద్ద తొలి సైనిక కంటోన్మెంటును 1765 జులై 10న ఈ కంపెనీ స్థాపించింది. బ్రిటిష్ సైనికులు స్థానిక జనంతో కలిసిపోకుండా, తమ సైనిక సంస్కృతిని కాపాడుకోవడం కోసం పెద్ద ఊళ్లకు బాగా వెలుపల ఈ కంటోన్మెంట్లను వేగంగా ఏర్పాటుచేసుకుంటూ పోయారు. సైనిక కార్యాలయాలు, ఆయుధాగారాలు, ఉదయాన పరేడ్ చేసే గ్రౌండ్లు, ఆటస్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, భవిష్యత్తు ఆర్మీ అవసరాల కోసం ఉంచుకున్న స్థలాలు పోగా కంటోన్మెంటు పరిధిలో మిగిలి ఖాళీ స్థలాల్లో ఇతర సాధారణ పౌరులను ఇళ్లు కట్టుకుని నివసించడానికి కూడా అనుమతించారు. స్వాతంత్య్రం వచ్చేనాటకి 56 కంటోన్మెంట్లు ఉండగా, 1962లో అజ్మేర్ నగరంలో చివరి కంటోన్మెంటు నెలకొల్పారు. అంటే స్వతంత్ర భారతంలో ఆరింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ 75 ఏళ్లలో దేశ జనాభాతో పాటు నగరాల జనసంఖ్య కూడా పెరిగిపోవడంతో జనావాసాలు కంటోన్మెంట్లను తాకేలా ముందుకు సాగిపోయాయి. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు ప్రభుత్వాలు, కంటోన్మెంట్ల బోర్డులను చుట్టుముడుతున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లోని కీలక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అవసరాలకు పది, పదిహేను ఎకరాల భూమి కనపడకపోవడంతో తమకు కంటోన్మెంట్ల అధీనంలోని ఆటస్థలాలు, ఇతర ఖాళీ భూములు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖను గతంలో అభ్యర్థించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలైతే తమ రాజధానుల ప్రాంతాలను చేర్చి ఉన్న కంటోన్మెంట్లను అక్కడ నుంచి తొలగించడానికి సిద్ధపడితే, కాస్త దూరంగా అంతకు రెట్టింపు విస్తీర్ణం గల భూములు ఇస్తామని కూడా కేంద్ర సర్కారుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో సైనిక కంటోన్మెంట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతైనా హర్షణీయం -విజయ సాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
సంసద్ రత్న అందుకున్న విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సంసద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డు అందుకున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది . స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95% కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని గుర్తు చేశారాయన. అలాగే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇక సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం.. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా సాగింది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా అవార్డు అందుకున్నారు. రవాణా ,సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. pic.twitter.com/bTGDxBLwuC — Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2023 ఈ సందర్భంగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్లో బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. విజయసాయిరెడ్డి ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారు అని దత్తాత్రేయ పొగిడారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంటులో గందరగోళం వల్ల బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు. కానీ స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉంది. పర్యాటక సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషకరం. చార్టెడ్ అకౌంటెంట్, మేధావి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సంసద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా.. ఇవాళ (మార్చి 25) న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. -
లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నాం.. ఎవరొచ్చినా సరే: విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోం శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్ అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకమన్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు. తండ్రి కొడుకులు బుద్ది మార్చుకోకపోతే మేము తగిన బుద్ది చెప్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోండి నిన్నటిది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరింతగా ఎదురుదాడి చేస్తాం. అందుకే ఇకనైనా పద్దతులు మార్చుకోండి. టెన్త్ ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటి?. కుసంస్కారంతో మా నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించండి. లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నాం. చర్చకు రావాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు వచ్చినా సరే చర్చకు మేము సిద్దం. జూమ్‌లో మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. చదవండి: (తిరుమల: మే నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం) పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా? ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వర్తించే కార్యక్రమాలు చేస్తోంది. అందుకే టీడీపీకి కడుపుమంట. కుప్పంలో కూడా ఓడిపోయినప్పుడే మాకు 175 గ్యారెంటీగా వస్తాయని నమ్మకం ఉంది. మీకు దమ్ముంటే ఆత్మకూరులో పొటీ చేసి రెఫరెండం కోరండి. అసలు పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా?. టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, కొడాలి నాని, రజని ఎంటర్ అయ్యారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి?. ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉంటే వారింటికి వెళ్లి ఓదార్చాలి. అంతేగానీ రాజకీయాలు చేయటం కరెక్టు కాదు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. మా కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఏ నాయకుడూ కార్యకర్తలను వదులుకోలేరు. కార్యకర్తలు, నాయకుల వలనే 2019లో అధికారంలోకి వచ్చామని విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రిగా జిల్లాలో గెలుపుకోసం నావంతు కృషి చేస్తానని అన్నారు. జిల్లా కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. కొత్తగా పార్టీ ఆఫీసు ప్రారంభం సంతోషించదగిన విషయం. నాయకులంతా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కార్యకర్తల సమస్యల కృషికి పనిచేస్తాం. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పని చేస్తాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో సమన్వయం చేసుకుంటామని మర్రి రాజశేఖర్ అన్నారు. చదవండి: (AP TET Notification 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల) -
ఏపీ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు. -
‘టచ్’ మహిమతో వారికి దరిద్రాన్ని అంటించారు’
సాక్షి, హైదరాబాద్ : వంశపారంపర్య అర్చకత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలపడం పట్ల వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వంశపారంపర్య అర్చకత్వ చట్టాన్ని అమలులోకి తెచ్చి ఆలయాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు సీఎం జగన్ భరోసా కల్పించారని ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సీఎం జగన్ నిర్ణయంతో గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నింటిని పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నాలుగు నెలల పాలనలోనే సీఎం జగన్ 80శాతం హామీలను నెరవేర్చారని ప్రశంసించారు. బీజేపీ క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో జతకట్టి తన దరిద్రాన్ని అందరికీ అంటించాడని ఎద్దేవా చేశాడు. ‘ఒక వ్యక్తి తన ‘టచ్’ మహిమతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కోలుకోకుండా చేశారు. తన దరిద్రాన్ని అందరికి అంటించి వచ్చారు. వచ్చే జనవరిలో ఢిల్లీ, 2021 మేలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటి ఫలితాలెలా ఉంటాయో మనం ఊహించవచ్చు. తనేమో బిజెపీ ‘క్షమాభిక్ష’ కోసం ఎదురు చూస్తున్నాడు’ అంటూ చంద్రబాబును పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీలతో జతకట్టిన విషయం తెలిసిందే. -
ద్రవ్య బిల్లుగా చూడకండి
* రాజ్యసభలో తొలి ప్రసంగం చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి * ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్‌కు అనుమతించాలి * అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలి * ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ జగన్ పోరాడుతూనే ఉంటారు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా చూడొద్దని, దీనిపై ఓటింగ్‌కు అనుమతించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో తొలిసారిగా ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనేది జరిగిపోయిన వాస్తవం. ఏపీకి అన్యాయం జరిగిందనడం కూడా అంతే వాస్తవం. నేను కొన్ని చట్టపరమైన విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఆర్థిక మంత్రి రెండు రోజుల క్రితమే ఒక అభిప్రాయం చెప్పారు. ఏపీ సవరణ బిల్లుకు యోగ్యత లేదని, ద్రవ్యబిల్లు అని చెప్పారు. విభజన బిల్లు పాసయినప్పుడు ఆర్టికల్ 3, 4 ద్వారా అమలు చేశారు. ఇప్పుడు దీనిని ద్రవ్య బిల్లు అని, ఆర్టికల్ 109 అని చెప్పడం, స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. విభజన చట్టం ఆర్టికల్ 3, 4 పరిధిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టికల్ 109లోకి ఎలా వస్తుంది? రాజకీయ కారణాలతో అధికార పక్షం దీనిని ద్రవ్య బిల్లు అని చెబుతుండవచ్చు. కానీ లీగల్‌గా చూస్తే ద్రవ్యబిల్లు అనలేం. ఒకవేళ చట్టానికి సవరణలు అవసరమైనా ఆర్టికల్ 3, 4 ద్వారా చేయాలి. 75 శాతం బిల్లులు దాదాపు ద్రవ్యబిల్లులే. ఈ బిల్లును అనుమతించకపోతే రాజ్యాంగంలో రెండు సభలు ఉండాలన్న స్ఫూర్తి దెబ్బతింటుంది. ద్రవ్య బిల్లుగా చూడకండి. ఓటింగ్‌కు అనుమతించండి’’ అని కోరారు. ‘హోదా’ తప్పనిసరిగా సంజీవనే ‘‘రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి స్వయంగా కొన్ని హామీలు ఇచ్చారు. 6 అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు ఐదేళ్లు సరిపోదన్నారు, పదేళ్లు కావాలన్నారు. చట్టానికి భాష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు బిల్లు చట్టం రూపం దాల్చినప్పుడు ప్రధాన మంత్రి, మంత్రులు చేసిన ప్రసంగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం నిరంతరం కొనసాగుతున్నప్పుడు.. నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పుడు తూచా తప్పకుండా అమలు చేయాలి. ఒకవేళ ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. అది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల ప్రణాళికలో రాష్ట్రానికి పది నుంచి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వర్తింపజేస్తామని హామీ ఇచ్చాయి. ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటున్నారు. అది తప్పనిసరిగా సంజీవనే. ఆంధ్రప్రదేశ్‌కు జీవరేఖ అవుతుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. హోదా రాకుంటే ఇంకా పోరాడుతారు. వచ్చేంతవరకూ పోరాడుతూనే ఉంటారు’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
విజయసాయిరెడ్డి రేపు రాక
ఏలూరు (ఆర్ఆర్ పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఏడాది పాలనలో టీడీపీ సర్కారు వైఫల్యాలను, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు మంగళవారం జిల్లాలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, ప్రజల తరపున పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా, నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన సమర దీక్షను విజయవంతం చేయడానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు నిర్వహిస్తారు. సమర దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.