కంటోన్మెంట్‌ ప్రజలకు నిజంగా శుభవార్తే! | Good News For The People Of Cantonment | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌ ప్రజలకు నిజంగా శుభవార్తే!

Published Fri, May 19 2023 6:25 PM | Last Updated on Fri, May 19 2023 6:27 PM

Good News For The People Of Cantonment - Sakshi

దేశంలోని సైనిక కంటోన్మెంట్లను రద్దు చేసి, వాటిలోని పౌర నివాస ప్రాంతాలను పక్కనున్న నగర పాలక సంస్థల్లో విలీనం చేయాలని, ఇక నుంచి కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు నిజంగా శుభవార్త. 

సికింద్రాబాద్‌ కంటోన్మెంటు బోర్డు పరిధిలోని కొన్ని చోట్ల సైనిక దళాలు వాడుకునే రోడ్లపై పౌరులు తిరగకుండా ఆంక్షలు విధించినప్పుడు గత కొన్నేళ్లుగా నగరంలో అలజడి చెలరేగడం తెలుగు ప్రజానీకానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా దేశంలోని ఈ కంటోన్మెంట్లలో సైన్యానికి అవసరం లేని, ప్రస్తుతం ఉపయోగంలో లేని లక్షలాది ఎకరాల ఖాళీ భూములను ఆయా నగరాలు, పట్టణాలు లేదా రాష్ట్రాలకు అప్పగిస్తారు. 

ఇప్పటికే హైదరాబాద్, ఆగ్రా వంటి 62 కంటోన్మెంటు నగరాల్లో ఖాళీ జాగాల కొరతతో జనసాంద్రత పెరిగిపోతోంది. చాలీచాలని పౌర సదుపాయాలతో జనం ఈ పట్టణాలు, నగరాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక, ఎన్నికైన పౌర ప్రజానీకం ప్రతినిధులు, మిలిటరీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పాలనసాగే ఈ మిలిటరీ కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాల్లో మరో సమస్య ఉంది. 

అదేమంటే, సాధారణ ప్రజలకు ప్రభుత్వాలు అందించించే పథకాలు, సదుపాయాలు ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అందడం లేదు. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ల బోర్డుల రద్దుతో ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు ఆయా రాష్ట్రాల ప్రజలకు సర్కార్ల నుంచి అందే అన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత విలువైన, అవసరమైన ఖాళీ స్థలాలు వేలాది ఎకరాల మేర అందుబాటులోకి వస్తాయి. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అతి పెద్ద భూస్వామి రక్షణ శాఖ. దేశంలో ఈ శాఖకు 17.99 లక్షల ఎకరాల భూమి ఉండగా, మొత్తం 62 మిలిటరీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని ఢిల్లీలోని డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ కార్యాలయం లెక్కలు వెల్లడిస్తున్నాయి. కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములు చాలా వరకూ ఇక ముందు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి.

నాడు బ్రిటీష్‌ పాలన కోసం కంటోన్మెంట్ల ఏర్పాటు
బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని తన అధీనంలోని ప్రాంతాల ప్రజలను నియంత్రణలో ఉంచుకోవడానికి, విదేశీ దండయాత్రలను తిప్పికొట్టడానికి ఇంగ్లిష్‌ ఆఫీసర్లు, భారత సిపాయిలతో కూడిన కంపెనీ సైనిక దళాల మజిలీ కోసం ప్రధాన నగరాలు, పట్టణాల వెలుపల ఈ కంటోన్మెంట్లను ఏర్పాటు చేసింది. 

నాటి కలకత్తా సమీపంలోని బ్యారక్‌ పూర్‌ వద్ద తొలి సైనిక కంటోన్మెంటును 1765 జులై 10న ఈ కంపెనీ స్థాపించింది. బ్రిటిష్‌ సైనికులు స్థానిక జనంతో కలిసిపోకుండా, తమ సైనిక సంస్కృతిని కాపాడుకోవడం కోసం పెద్ద ఊళ్లకు బాగా వెలుపల ఈ కంటోన్మెంట్లను వేగంగా ఏర్పాటుచేసుకుంటూ పోయారు. 

సైనిక కార్యాలయాలు, ఆయుధాగారాలు, ఉదయాన పరేడ్‌ చేసే గ్రౌండ్లు, ఆటస్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, భవిష్యత్తు ఆర్మీ అవసరాల కోసం ఉంచుకున్న స్థలాలు పోగా కంటోన్మెంటు పరిధిలో మిగిలి ఖాళీ స్థలాల్లో ఇతర సాధారణ పౌరులను ఇళ్లు కట్టుకుని నివసించడానికి కూడా అనుమతించారు. స్వాతంత్య్రం వచ్చేనాటకి 56 కంటోన్మెంట్లు ఉండగా, 1962లో అజ్మేర్‌ నగరంలో చివరి కంటోన్మెంటు నెలకొల్పారు. 

అంటే స్వతంత్ర భారతంలో ఆరింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ 75 ఏళ్లలో దేశ జనాభాతో పాటు నగరాల జనసంఖ్య కూడా పెరిగిపోవడంతో జనావాసాలు కంటోన్మెంట్లను తాకేలా ముందుకు సాగిపోయాయి. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు ప్రభుత్వాలు, కంటోన్మెంట్ల బోర్డులను చుట్టుముడుతున్నాయి. 

హైదరాబాద్‌ వంటి మహానగరాల్లోని కీలక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అవసరాలకు పది, పదిహేను ఎకరాల భూమి కనపడకపోవడంతో తమకు కంటోన్మెంట్ల అధీనంలోని ఆటస్థలాలు, ఇతర ఖాళీ భూములు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖను గతంలో అభ్యర్థించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలైతే తమ రాజధానుల ప్రాంతాలను చేర్చి ఉన్న కంటోన్మెంట్లను అక్కడ నుంచి తొలగించడానికి సిద్ధపడితే, కాస్త దూరంగా అంతకు రెట్టింపు విస్తీర్ణం గల భూములు ఇస్తామని కూడా కేంద్ర సర్కారుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో సైనిక కంటోన్మెంట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతైనా హర్షణీయం


 -విజయ సాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement