సాయన్న మృతికి సంతాపంగా అసెంబ్లీలో మౌనం పాటిస్తున్న స్పీకర్, సీఎం, సభ్యులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు.
ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment