Chandrasekhar rao
-
బరాజ్‌ల నిర్ణయం కేసీఆర్‌దే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే నిర్ణయం తీసుకున్నారని నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. 2016 జనవరిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. వ్యాప్కోస్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ స్వయంగా సంతకం చేశారని అన్నారు. ఈ డీపీఆర్ ఆధారంగా వివిధ కాంపోనెంట్ల అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. బరాజ్‌లను ఎక్కడ కట్టాలో ప్రభుత్వమే చెప్పగా, ఆ మేరకు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సిద్ధం చేసిందన్నారు. నిర్మాణ దశలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చినట్టు చెప్పారు. గ్రావిటీ కాల్వ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం ఆరు గంటల పాటు నిర్వహించిన రెండో విడత ఎగ్జామినేషన్‌లో వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరణ ఇచ్చారు. తొలి విడతలో ఆయనకు 71 ప్రశ్నలు వేసిన కమిషన్.. తాజాగా రెండో విడతలో ఏకంగా 128 ప్రశ్నలు సంధించింది. శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని ఆదేశించింది. నిర్మాణ దశలో మార్పులు ‘డీపీఆర్‌ను 2016 మార్చిలో కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించిన తర్వాత నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులపై నిర్ణయాలు జరిగాయి. డీపీఆర్‌లో అన్ని కాంపోనెంట్లు లేవు. గైడ్‌బండ్, ఫ్లడ్ బ్యాంకులు, డైవర్షన్ చానల్స్‌ను తర్వాత చేర్చాం. నిర్మాణ దశలో సైట్ పరిస్థితుల ఆధారంగా మరికొన్ని మార్పులు చేశాం. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్సీ)లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పులు జరిగాయి. డీపీఆర్‌లో అన్నారం బరాజ్‌ను 120 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, అటవీ భూముల ముంపు, సైట్ పరిస్థితుల ఆధారంగా 119 మీటర్లకు కుదించాం. ప్రాథమికంగా మూడు బరాజ్‌లకు వేర్వేరు డీపీఆర్‌లను తయారు చేయగా, తర్వాత ఉమ్మడి డీపీఆర్‌ను తయారు చేశాం..’అని కమిషన్‌కు వెంకటేశ్వర్లు తెలిపారు. సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో రూ.17,875 కోట్లతో అనుమతిచ్చి 2008లో రూ.38,500 కోట్లకు అంచనాలను పెంచి రూ.6,156 కోట్ల పనులు సైతం పూర్తి చేశాక 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏమిటి?’అని కమిషన్ నిలదీసింది. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌కు మహారాష్ట్ర అభ్యంతరం తెలపడంతో 148 మీటర్లకు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఎత్తులో బరాజ్ కడితే 44 టీఎంసీల లభ్యతే ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ చేశారు’ అని వెంకటేశ్వర్లు వివరించారు.మ్యాథమెటికల్లీ తప్పుడు నిర్ణయమే ! ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రెండుదశల్లో కలిపి 304 మెగావాట్ల పంపుల సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి వీలుండగా రీఇంజనీరింగ్ చేసి పంపుల సామర్థ్యాన్ని 11 వేల మెగావాట్లకు పెంచడం సరైందేనా అని కమిషన్ ప్రశ్నించగా, గణితపరంగా తప్పుడు నిర్ణయమేనని మాజీ ఈఎన్సీ పేర్కొన్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో మేడిగడ్డ బరాజ్ నిర్మించారా? అని ప్రశ్నించగా వాస్తవం కాదని ఆయన బదులిచ్చారు. బరాజ్ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నట్టు జాదవ్‌పూర్ వర్సిటీ ఇచి్చన నివేదికను ప్రస్తావించగా దానితో తాను ఏకీభవించనని చెప్పారు. ప్రభుత్వ అధినేత ఆదేశాలతో బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేశామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లో నిర్మించిన బరాజ్‌లలో సికెంట్ పైల్స్ వాడినట్టు చెప్పగా.. తన స్వరాష్ట్రం బెంగాల్ పేరును ఉటంకించడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ‘మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూసంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యముందన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. రేవంత్ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను రాష్ట్ర ప్రజలు సుఖశాంతు లతో ఘనంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేర కు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావ ళి పండుగను జరుపుకుంటామని, రాబోయే ఎన్నికలలో తెలంగాణకు పట్టిన చీకటి పోయి వెలుగులు రావడం ఖాయమని పేర్కొన్నారు. -
సారుకు కారు లేదు!
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం, వ్యవసాయ భూమి వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తనతోపాటు సతీమణి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. కేసీఆర్, సతీమణి శోభమ్మకు కలిపి మొత్తం ఆస్తులు రూ.58,93,31,800 కాగా.. ఇందులో చరాస్తులు రూ.35,43,31,800, స్థిరాస్తులు రూ.23.50 కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పులు రూ.24,51,13,631 ఉన్నాయి. ఇందులో ఇద్దరి పేరిట విడివిడిగా ఉన్న ఆస్తులు కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని ఉన్నాయి. విడిగా పరిశీలిస్తే.. కేసీఆర్ చరాస్తులు రూ.17,83,87,492. ఇందులో 95 గ్రాముల బంగారం (రూ. 17.40 లక్షలు విలువ), చేతిలో నగదు రూ 2,96,605 ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.8.5 కోట్లు. రూ.17,27,61,818 అప్పులు ఉన్నాయి. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.7,78,24,488 ఉండగా అందులో 2.841 కిలోల బంగారు అభరణాలు, 45 కేజీల వెండి వస్తువులు (రూ.1,49,16,084 విలువ), అప్పులు ఏమీ లేవు. కేసీఆర్, శోభమ్మ ఉమ్మడి ఆస్తులు రూ.24,81,19,820 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.9,81,19,820. (దీనిలో రూ.1,16,72,256 విలువైన 14 వాహనాలు ఉన్నాయి), ఉమ్మడి స్థిరాస్తుల విలువ రూ.15 కోట్లు. ఉమ్మడి అప్పులు రూ.7,23,51,813. కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 2010 సంవత్సరం నుంచీ ఉమ్మడి ఆస్తులుగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.1,35,00,116 విలువైన 53.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. అలాగే 9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని, దానికి నాలా పన్నును సైతం చెల్లించామని వివరించారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా వచ్చే వేతనం/అలవెన్సులతోపాటు వ్యవసాయ ఆదాయం.. సతీమణి శోభమ్మకు బ్యాంకులోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించారు. కేసీఆర్‌పై తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 9 కేసులు ఉన్నట్టు తెలిపారు. -
ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారానే ప్రతీపశక్తులకు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరగ్గా, దేవుడి దయతో బతికి బయటపడ్డారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి హేయమైన రాజకీయాలు లేవని, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. నాగం చేరికతో పెరిగిన బీఆర్ఎస్ బలం నాటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని కేసీఆర్ అన్నారు. పాలమూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలో నాగం ఇంటికి వెళ్లి మరోమారు ఆయన అనుచరులతో భేటీ అవుతానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబసభ్యుడి లాంటి వాడన్నారు. విష్ణు తండ్రి పి.జనార్దన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడుచోట్ల సీఎం సభలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కాగా, ఈ నెల 31వ తేదీన సీఎం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
బీఆర్ఎస్కు కూచుకుళ్ల, కేఎస్ రత్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్/కొల్లాపూర్/చేవెళ్ల: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇద్దరూ తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించారు. ఈనెల 31న కొల్లాపూర్‌లో నిర్వహించనున్న ప్రియాంకాగాంధీ సభలో ఆమె సమక్షంలో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. సభాస్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవితో తగిన గుర్తింపు ఇచ్చినప్పటికీ, స్థానికంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. సమస్యలను చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ను ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. తాను గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని 15 రోజులకోసారి కలిసి స్థానిక అంశాలు మాట్లాడేవాడినని వివరించారు. కేసీఆర్ పాలనలో అలాంటి అవకాశం లేదన్నారు. కాగా.. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇది వరకే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం శుక్రవారం బీజేపీలో చేరనున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పదేళ్లుగా పారీ్టలో తగిన ప్రాధాన్యత లేకపోయినా కేసీఆర్‌పై ఉన్న గౌరవంతో కార్యకర్తగా కొనసాగానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఆ తరువాత రెండుసార్లు తనకు టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని.. చేవెళ్ల ప్రజల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కేసీఆర్ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అంతమైతేనే తప్ప తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ‘తెలంగాణ సమాఖ్య – ప్రజా సంఘాల ఉమ్మడి మేనిఫెస్టో’ను జస్టిస్ చంద్రకుమార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అప్పులు చేశారని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ప్రజా సంఘాల పోరాటాలకు అడ్డంకి కాదని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు ఏకమై కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ...బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రవళిరెడ్డి, శ్యామల శ్రీను, హర్షవర్షన్ రెడ్డి, తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. -
29న రాష్ట్ర కేబినెట్ భేటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్టు తెలిసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 171(3), 171(5)లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యత కానీ ఆచరణాత్మక అనుభవం కానీ లేకపోవ డంతో వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తు న్నట్టు గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్ లేవనెత్తిన అంశాలకు సమాధా నమిస్తూ మళ్లీ వారి పేర్లనే సిఫారసు చేస్తూ... గవర్నర్ కోరిన వివరాలను పూర్తిగా తిరిగి పంపించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు సన్నద్ధతపై సైతం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించడానికి కొత్త పథకాలు, కార్యక్రమాల అమలుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిసింది. అయితే మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయనున్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వవిధానానికి అనుగుణంగా ఆదివారం రాజ్‌భవన్‌లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. విమోచన దినోత్సవం జరుపుకోవాలి: గవర్నర్ పిలుపు హైదరాబాద్ విముక్తి పోరాటం దేశ స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు. విమోచన ఉద్యమంలో పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. -
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
అసెంబ్లీ సమావేశాలకు తెర
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్‌తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్‌కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్‌వన్ అనే రీతిలో నడిపాం: పోచారం 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్‌వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన
-
జూబ్లిహిల్స్‌లోని ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు భౌతికకాయం
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవీ కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలఓనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. చదవండి: మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి -
50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడే కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. ఈనెల 13న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా.. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది. -
నెహ్రూను మించిన ప్రధాని పీవీ
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూను మించిన ప్రధాని పీవీ నరసింహారావు అని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆర్వీఆర్ చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా పీవీకి సన్నిహితుడిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడే కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన లీడర్షిప్ ఇన్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్‌లో పీవీ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుందని, ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు కాన్ఫరెన్స్‌ను మరో రోజు పొడిగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. పీవీకి అనుకోకుండా పదవులు వచ్చినా.. అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పీవీని ప్రధానిగా కాంగ్రెస్ ప్రకటించే సమయంలో తాను ఢిలీల్లో ఉన్నానని, ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పగా, తెలుగు వ్యక్తి ప్రధాని కావడంపై ఆయన ఎంతో సంతోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన మనవడు ఎన్వీ సుభాష్ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. -
కమీషన్ల కోసమే ప్రాజెక్టుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్ : మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్పుల ఊబిలో నెట్టారని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్టుల పేరుతో నిధులు దోచుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో రెండు సంవత్సారాలు వెనుక పడిపోయిందని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే గత ప్రభుత్వాల కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు తరలింపు వల్ల ఒక లిప్ట్కు బదులు మూడు లిప్టులు అవసరం పడుతున్నాయని ఆరోపించారు. తుమ్మిడి హెట్టి దగ్గరే బ్యారేజ్ నిర్మిస్తే ఒకటే లిప్ట్ అవసరం వచ్చేదని అన్నారు. గ్రావిటీ ద్వారా పొందే నీటిని తొలుత పొంది, ఆతరువాత మిగిలిన వాటిని లిప్ట్ చేయాలని, కానీ కేసీఆర్ మాత్రం లిప్ట్ ఇరిగేషన్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిడ్డారు. ముఖ్యమంత్రి అనుకున్నదాన్ని సాధించడం కోసం ఖజానా మీద 20 వేల కోట్ల రూపాయల భారం పెంచుతున్నారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గరే కడితే గత ఏడాది నుండే నీటి వినియోగం కూడా జరిగేదని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించే అవకాశం కోల్పోయామని ఆరోపించారు. కేసీఆర్ గొప్పల కోసం ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
పది తరాలకు సరిపోయేలా దోచుకున్నావ్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ నేతలను సన్నాసులంటూ సీఎం కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో నాగం ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. సీఎం విచ్చలవిడి అవినీతిని అడ్డుకోవడానికి మాత్రమే కోర్టుకు వెళ్లామన్నారు. రాష్ట్రం కోసమంటూ లక్షల కోట్లు అప్పు చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కుటుంబం మొత్తం బంగారు తెలంగాణను పది తరాలకు సరిపోయేలా దోచుకున్నరని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, అవినీతికి సహకరించిన మంత్రులు, అధికారులు జైలుకు వెళ్లక తప్పదని నాగం జనార్ధన్ హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర మూడు లిప్టులు ఎందుకని ప్రశ్నించారు. ఒక బడా కాంట్రాక్టు సంస్థకు పనులను కట్టబెట్టడానికే కాళేశ్వరం నిబంధనలు మార్చారంటూ మండిపడ్డారు. ముప్పై నెలల్లో పాలమూరు పూర్తి చేస్తామన్న కేసీఆర్ కనీసం పది శాతం పనులను పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పేరును అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్లగా మారుస్తామని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను అర్హత లేని కంపెనీకి కట్టబెట్టారని, 14 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. రివ్యూలు, రివిజన్ పేరు మీద కేసీఆర్ కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు నాగం విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై యుద్ధం చేస్తామని, ఈడీ, సీబీఐ దగ్గర కూర్చుంటామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మిస్తే.. ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం అవినీతిని సాక్ష్యాధారలతో నిరూపిస్తానని, అలా చేయకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు. -
చంద్రబాబు సహకారం అందిస్తున్నారు : బాలకృష్ణ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి 15 ఎకరాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధికి సీఎం తన వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పురిటి గడ్డమీద బసవతారకం హాస్పిటల్ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయం పురడు పోసుకొని రెండు దశాబ్ధాలుగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో అమరావతిలో బసవతారకం హాస్పిటల్‌కు భూమి చేయనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మూడు ఫేజ్‌లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బసవతారకం ఆస్పత్రికి పన్ను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి బసవతారకం పడిన బాధ ఏతల్లి పడొద్దని అందుకే హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. జీవితం మన హక్కుని దానిని పోరాడి సాధించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కూడా అంతేన్నారు. -
కేసీఆర్ నిరంకుశత్వానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహ నిర్బంధం దారుణమని ఆయన మండిపడ్డారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణమని, ఇది ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దళిత శాసన సభ్యుడైనందువల్లే సంపత్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజక వర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం అసువులు బాసిన బీజేపీ కార్యకర్త మైసయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి అమరుడైతే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కమీషన్ కోసమే మిషన్ కాకతీయ, భగీరథ చేపట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్, ఆయన మంత్రులు ఉస్మానియాలో అడుగుపెట్టాలంటే వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శవాలతో రాజకీయాలు రకం అంటూ లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. భారత దేశాన్ని తమ కుటుంబమే ఏలాలని నెహ్రూ కుటుంబం చూస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మోడీని చూసి ఓర్వలేక పోతోందని, కావాలనే ప్రధాని కులం, తినే ఆహారం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోడీ విజయాల జైత్రయాత్ర సాగితే తమ ఉనికి పోతోందని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు బయపడుతున్నాయని విమర్శించారు. ఫ్లోరైడ్ బాధితులు ఇబ్బందిపడున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని, ఫ్లోరైడ్ నిర్మూలణకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం 350 కోట్లు ఇస్టే వాటిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ, ఒక్క టీచర్ నియామకాలను చేపట్టలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు చోటు ఇవ్వలేదంటే మహిళలపై ఉన్న గౌరవం ఎంటో అర్థం అవుతోందన్నారు. సుకన్య సంవృద్ధి యోజన కింద కోట్ల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. తల్లి పడ్డ కష్టాలు చూసిన మోదీ ఏ మహిళా కష్టాలు పడకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. జనచైతన్య యాత్ర టీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 350 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో మొక్కల పెంపకానికి ఇచ్చిన 47 కోట్ల రూపాయలు ఏమయ్యాయని లక్ష్మణ్ నిలదీశారు. ఎన్నికల కోసమే రైతు బంధు పథకం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదని, ఊరు ఉరా బార్లు తెరిచి ఆదాయం పొందుతున్నారని దయ్యబట్టారు. జిల్లాకు ఇచ్చిన 543 కోట్ల రూపాయలు లెక్కలేకుండా పోయాయని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమన్న లక్ష్మణ్, అధికారంలోకి వస్తే రైతులకు రూ 2లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరైతుకు చితంగా బోర్లు వేయిస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీని కూడా బీజేపీ కడుతుందని అన్నారు. -
మైనారిటీ విద్యకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే పది పన్నెండేళ్లలో మైనారిటీ వర్గాల్లో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావత్–ఏ–ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసి గురుకులాల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు నాసా వరకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ‘‘దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశాం. దేశం మొత్తమ్మీద మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో రూ.2 వేల కోట్లు కేటాయించాం. ఈ బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తాం’’అని అన్నారు. రాజస్తాన్‌లో హైదరాబాద్ రుబాత్ అల్లా కృపతో తెలంగాణ సాధించగలిగామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అల్లాను వేడుకున్నామని, అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపామన్నారు. దేవుడు న్యాయమైన కోరికను కరుణించడంతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. మక్కా మదీనాలో మాదిరిగా రాజస్తాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రుబాత్ భవన సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. ఇందుకు రాజస్తాన్ ప్రభుత్వం 8 ఎకరాల భూమి కేటాయించిందని, త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు వేసి 31 జిల్లాల నుంచి ముస్లింలను శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో సుమారు 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీ వర్గాలకు కూడా అన్ని పథకాలు వర్తింపచేసినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశంలో మైనారిటీ వర్గాలు సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్లో ఉన్నారు జాగ్రత్త : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారా? పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వారంతా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదా? ఈ జాబితాలో పలువురు చైర్మన్లు, ప్రభుత్వ విప్‌లతోపాటు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా? ఇందుకు అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులున్నాయంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్టుగా తెలిసింది. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారు. మరికొందరు ఎమ్మెల్యేలకు వారికి దగ్గరగా ఉన్న మంత్రులతో చెప్పించారు. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు సన్నిహితులకు వారితోనే ఈ విషయాన్ని చెప్పించినట్టుగా సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యేలకు ఆదరణ ఎక్కువగా ఉందని అంచనా వేసుకుంటున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పలువురు సీనియర్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేసీఆర్‌కు నివేదికలు అందాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే ఎక్కువ మంది పనితీరుపై వ్యతిరేకత ఉండగా.. కొందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని వివిధ సర్వేల నివేదికల ద్వారా తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తేలిన 39 మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరని సీఎం స్పష్టంగా చెప్పారు. 100 సీట్లపై ధీమా : గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుని అధికారం చేపట్టింది. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణం (నారాయణఖేడ్, పాలేరు) కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్ఎస్ గెల్చుకుంది. టీడీపీ(12), కాంగ్రెస్(7), వైఎస్సార్ కాంగ్రెస్(3), బీఎస్పీ(2), సీపీఐ(1) నుంచి మొత్తం 25 మంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 90 మందికి చేరింది. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న 90 మంది ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గకుండా గెల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు రాష్ట్రంలో అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా వంటి భారీ బడ్జెట్‌తో కూడిన పథకాలను అమలు చేస్తున్నారు. వీటితోపాటు పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటితో టీఆర్ఎస్కు తిరుగులేని ఆధిక్యత వస్తుందన్న విశ్వాసంతో కేసీఆర్ ఉన్నారు. వీటి భరోసాతోనే కనీసం 100 స్థానాలు గెలుస్తామని బహిరంగ సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతున్నారు. కనీసం ఇప్పుడున్న 90 సంఖ్యను తగ్గకుండా గెలుస్తామని అంతర్గత సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం తేలింది? రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్ షాక్‌కు గురయినట్టు టీఆర్ఎస్ ముఖ్యులు వెల్లడించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందాయి. నియోజకవర్గంలో అంతా తమదే రాజ్యం అని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా తెలిసింది. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పలు కార్పొరేషన్ చైర్మన్లు, విప్ల పరిస్థితి అయితే పార్టీకి ఉన్న ఆదరణలో సగం కూడా లేదని తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ కారణాలతో పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తటస్థులు వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని చెబుతూ 39 మంది ఎమ్మెల్యేలకు రాతపూర్వకంగా నివేదికల వివరాలను పంపించినట్టుగా తెలిసింది. నియోజకవర్గాల్లో ఏయే కారణాల వల్ల వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మండలాల వారీగా అందించారు. ఇలా ఉంటే కష్టమే.. ఎమ్మెల్యేల పనితీరుపై హెచ్చరికతో కూడిన నివేదికను పంపించడంతోపాటు పార్టీ ముఖ్యులను ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేసీఆర్ ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడి హెచ్చరించారు. ‘‘పార్టీ పనితీరుపై మీ నియోజకవర్గం సానుకూలంగా ఉంది. ఎమ్మెల్యేగా మాత్రం మీపై వ్యతిరేకత ఉంది. పార్టీ పనితీరుకు ఉన్న ఆదరణలో సగం కూడా మీకు లేదు. ఇది వ్యక్తిగతంగా మీకు మాత్రమే కాకుండా పార్టీకి చాలా నష్టం. ఎమ్మెల్యేలు గెలిస్తేనే టీఆర్ఎస్కు అధికారం వస్తుందని గుర్తుంచుకోవాలి. మీ పనితీరు ఎలా ఉన్నా అభ్యర్థిగా మీకే అధికారం ఇచ్చి, టీఆర్ఎస్కు అధికారం వచ్చే అవకాశాలను వదులుకోలేం. మీకు ఏయే కారణాలతో వ్యతిరేకత పెరిగిందో, ఏయే వర్గాలు మీకు దూరమయ్యాయో స్పష్టంగా, నిర్దిష్టంగా అందిస్తున్నాం. మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ పనితీరు మారకుంటే, ఆదరణ పెంచుకోకుంటే కష్టం’’ అని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. వ్యక్తిగతంగా పనితీరును ఎలా మార్చుకుంటారో, బలమెలా పెంచుకుంటారో నివేదిక ఇవ్వాలంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయినట్టుగా తెలిసింది.