మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో విష్ణువర్ధన్‌రెడ్డి, నాగం, మంత్రి గంగుల తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారానే ప్రతీపశక్తులకు గుణపాఠం చెప్పాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరగ్గా, దేవుడి దయతో బతికి బయటపడ్డారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి హేయమైన రాజకీయాలు లేవని, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
నాగం చేరికతో పెరిగిన బీఆర్‌ఎస్ బలం
నాటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని కేసీఆర్ అన్నారు. పాలమూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలో నాగం ఇంటికి వెళ్లి మరోమారు ఆయన అనుచరులతో భేటీ అవుతానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబసభ్యుడి లాంటి వాడన్నారు. విష్ణు తండ్రి పి.జనార్దన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment