సాక్షి, హైదరాబాద్ : మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్పుల ఊబిలో నెట్టారని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్టుల పేరుతో నిధులు దోచుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో రెండు సంవత్సారాలు వెనుక పడిపోయిందని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే గత ప్రభుత్వాల కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు తరలింపు వల్ల ఒక లిప్ట్‌కు బదులు మూడు లిప్టులు అవసరం పడుతున్నాయని ఆరోపించారు. తుమ్మిడి హెట్టి దగ్గరే బ్యారేజ్ నిర్మిస్తే ఒకటే లిప్ట్ అవసరం వచ్చేదని అన్నారు.
గ్రావిటీ ద్వారా పొందే నీటిని తొలుత పొంది, ఆతరువాత మిగిలిన వాటిని లిప్ట్ చేయాలని, కానీ కేసీఆర్ మాత్రం లిప్ట్ ఇరిగేషన్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిడ్డారు. ముఖ్యమంత్రి అనుకున్నదాన్ని సాధించడం కోసం ఖజానా మీద 20 వేల కోట్ల రూపాయల భారం పెంచుతున్నారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గరే కడితే గత ఏడాది నుండే నీటి వినియోగం కూడా జరిగేదని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించే అవకాశం కోల్పోయామని ఆరోపించారు. కేసీఆర్ గొప్పల కోసం ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment