
కేటాయింపులు ఇలాగే ఉంటే మరి పూర్తయ్యేదెన్నడు?
ప్రాధాన్యతగా చేపట్టినవాటి పూర్తికి సరిపడా నిధులివ్వని సర్కార్
చింతలపూడి ఎత్తిపోతలకు రూ.2,043 కోట్లకు రూ.30 కోట్లే
వెలిగొండకు రూ.3,638 కోట్లకు గాను రూ.309.13 కోట్లు
గోదావరిృపెన్నా తొలి దశకు రూ.5,372 కోట్లకు రూ.200 కోట్లే
హంద్రీృనీవా ఆయకట్టుకు నీళ్లందించేందుకు నిధులు
తొలి దశ ప్రధాన కాల్వ వెడల్పు.. రెండో దశ ప్రధాన కాల్వ, పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కాల్వ లైనింగ్‌పై కరుణ
బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు కేటాయింపు
భారీ నీటిపారుదలకు రూ.17,142.06 కోట్లు, చిన్ననీటిపారుదలకు రూ.877.60 కోట్లు
రూ.15,576 కోట్లు ప్రాజెక్టుల పనుల కోసం ఖర్చు చేస్తామని వెల్లడి
పోలవరానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.5,756.82 కోట్లు కేటాయింపు
గత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,705.32 కోట్లు కేటాయించి.. 5,906.76 కోట్లు కోత వేసిన వైనం
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగ చేసే.. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బడ్జెట్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు.. కనీసం వాటినైనా గడువులోగా పూర్తి చేయడానికి సరిపడా నిధులను బడ్జెట్‌లో ఇవ్వకపోవడం గమనార్హం. 2025–26 బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.17,142.06 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.877.60 కోట్లు) కేటాయించారు.
ఇందులో రూ.15,576 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులకు (కేపిటల్ వ్యయం) ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పోలవరానికి కేటాయించిన రూ.5,756.82 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా, 2024–25 బడ్జెట్‌లో ప్రాజెక్టులకు రూ.16,705.32 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.15,483.35 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.1,221.97 కోట్లు) కేటాయించారు.
అయితే, సవరించిన బడ్జెట్‌లో రూ.5,906.76 కోట్లు కోత పెట్టి రూ.10,798.56 కోట్లు కేటాయించినట్లు ప్రస్తుత బడ్జెట్‌లో స్పష్టం చేశారు. అంటే.. గత బడ్జెట్ నిధుల్లో 35.36 శాతం కోత విధించినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం కేటాయించిన నిధులను కూడా ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట..
» ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. తొలి దశలో పోలవరం, హంద్రీ–నీవా, వెలిగొండ, చింతలపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గోదా వరి–పెన్నా తొలి దశను చేపడతామంది. చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి–పెన్నా తొలి దశను 2026, జూన్ నాటికి, పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌కు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో గత ప్రభుత్వమే పోలవరాన్ని కొలిక్కితెచ్చింది. వెలిగొండ తొలి దశ, హంద్రీ–నీవా, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం దాదాపుగా పూర్తి చేసింది.
» రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒకటో టన్నెల్ ద్వారా కృష్ణా జలాలను గత సెప్టెంబరు–అక్టోబరు నాటికే తరలించే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు పనులకు గత బడ్జెట్‌లో 393.49 కోట్లను కేటాయించిన సర్కార్.. అందులో కోత వేసి రూ.300.52 కోట్లతో సరిపెట్టింది.
కనీసం ఆ నిధులను కూడా ఖర్చు చేయలేదు. తాజాగా 309.13 కోట్లు కేటాయించింది. తొలి దశ పూర్తి కావాలంటే రూ.1,458 కోట్లు, రెండో దశకు రూ.2,180 కోట్లు అవసరం. దీన్నిబట్టి చూస్తే ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం లేదు.
» ఒడిశాతో వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార స్టేజ్–2లో అంతర్భాగమైన హిర మండలం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేలా వంశధార ఎత్తిపోతలను గత ప్రభుత్వం చేపట్టింది. ఇది పూర్తయితే వంశధార ఆయకట్టు రైతులకు పూర్తి ఫలాలను అందించవచ్చు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి ఖర్చు చేస్తే.. జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది.
» చింతలపూడి ఎత్తిపోతల పూర్తికి రూ.2043.38 కోట్లు అవసరం. 2026 జూన్ నాటికి నీళ్లందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత బడ్జెట్‌లో ఈ ఎత్తిపోతలకు రూ.150 కోట్లు చూపినా చివరకు రూ.3.08 కోట్లతో సరిపెట్టారు. ఇప్పుడు కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. ఆ ఎత్తిపోతల ఎలా పూర్తవుతుందన్నది సర్కారుకే తెలియాలి.
» 2026 జూన్ టార్గెట్‌గా పెట్టుకున్న గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి కావాలంటే రూ.5,372.31 కోట్లు అవసరం. గత బడ్జెట్‌లో పైసా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో ఎలా పూర్తవుతుందన్నది ప్రభుత్వమే చెప్పాలి.
» హంద్రీ–నీవా సుజల స్రవంతిలో డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి 2026 జూన్‌కు నీళ్లందిస్తామని గొప్పలు చెప్పింది. కానీ.. హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ గత ప్రభుత్వం చేపట్టిన పనులను.. 3,850 క్యూసెక్కులకు కుదించింది. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూర్ బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నా వెనక్కుతగ్గకుండా పూర్తి చేసేందుకే మొగ్గుచూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు నిధులు కేటాయించని నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమే.
» ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులకే నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మిగతావాటికి కేటాయింపు, విడుదల ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
» కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించడానికి వీలుగా కాలువల మరమ్మతులు, డ్రెయిన్లలో పూడికతీత పనులకు అవసరమైన మేరకు నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.
» పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా కాకుండా.. 41.15 మీటర్ల ఎత్తు వరకే 119.40 టీఎంసీలు నిల్వ చేసేలా 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లు ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు కేంద్రం గత, ప్రస్తుత బడ్జెట్‌లలో నిధులిచ్చింది. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తే పూర్తి ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీళ్లందించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment