మచిలీపట్నంలో విషాద ఘటన
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది.
అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్‌లో మూడు రౌండ్‌లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు.
పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment