constables selection
-
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్లో మూడు రౌండ్లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్‌గా..!
ఇన్ఫోసిస్, విప్రోలాంటి పెద్ద సంస్థల నుంచి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వెదుక్కుంటూ వస్తే... ఏ అమ్మాయికైనా సంతోషమే. అయితే సౌమ్య మాత్రం ఆ సంతోషాన్ని కాదనుకుంది. కారణం... పోలిస్ ఉద్యోగంపై ఆమెకు ఉన్న ఇష్టం. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. సౌమ్య ఉద్యోగ ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆమె మాత్రం... ‘ఇది తొలి అడుగు. ఐపీఎస్ నా లక్ష్యం’ అంటుంది....జనగామ జిల్లా తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య ఒకవైపు చదువులో రాణిస్తూనే దుక్కి దున్నడం, పురుగు మందు పిచికారీ చేయడం, కలుపు తీయడంలాంటి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. కానిస్టేబుల్ శిక్షణ సమయంలో బెస్ట్ ఆల్‌రౌండర్, ఇండోర్ ట్రోఫీలను గెలుచుకున్న సౌమ్య 2024 బ్యాచ్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసింగ్ అవుట్ పరేడ్‌లో 1,211 మంది మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించింది.అమ్మ బడిలో...‘మా అమ్మకు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ సమస్యలతో సాధ్యపడలేదు. అందుకే మా చదువులపై ఎప్పటికీ రాజీపడలేదు. మాకు రోజూ లెక్కలు చెప్పేది. గూడూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్పస్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీస్ యూనిఫాం పట్ల ఇష్టం ఏర్పడింది. నేను పదవ తరగతి చదివే సమయానికి నా స్నేహితుల్లో చాలామందికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి విషయంలో తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేను ఎంత చదివితే వారికి అంత సంతోషం. మా గ్రామం నుంచి ఎవరూ పాఠశాల స్థాయి దాటి ముందుకు సాగలేదు’ అంటుంది బీటెక్ చేసిన సౌమ్య. తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేయడానికి ముందు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది సౌమ్య. ఢిల్లీలో కొంత కాలం పాటు పనిచేసింది. ఎలాంటి కోచింగ్‌లపై ఆధారపడకుండా స్వతంత్రంగా పారామిలిటరీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.ఢిల్లీ నుంచి తిరిగి ఇంటికి...‘తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నాను. వారు ఎలా ఉన్నారో ఏమిటో!’ అనే దిగులుతో తిరిగి సొంత ఊరికి వచ్చింది సౌమ్య.మళ్లీ..ఎంతోమందికి ఆశ్చర్యం!‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ఇలా వచ్చావేమిటి’ అని అడిగిన వాళ్లకు సౌమ్య ఏం జవాబు చెప్పిందో తెలియదుగానీ... అదే సమయంలో మరో అవకాశం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. ‘ఐపీఎస్ కచ్చితంగా సాధిస్తాను. ఇది గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట’ అంటుంది సౌమ్య స్వరంతో ఉప్పునూతల సౌమ్య.నా బిడ్డ సాధించింది... ఇంకా ఎంతో సాధిస్తుంది!పోలిస్ అకాడమీలో మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన సౌమ్యను చూసి పొంగిపోయాను. నాలాగా నా పిల్లలు చదువుకు దూరం కావద్దు అనుకున్నాను. చదువులోనే కాదు వ్యవసాయ పనుల్లోనూ కూడా సౌమ్య కష్టపడి పనిచేస్తుంది. నా బిడ్డ సాధించింది. ఇంకా ఎంతో సాధిస్తుంది.– అరుణ, సౌమ్య తల్లి – కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ పరువు హత్య
-
సవాళ్లకు అనుగుణంగా శిక్షణలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో మారిన నేరసరళి, పోలీస్ విధుల ఆధారంగా నూతన కానిస్టేబుళ్ల శిక్షణలో పలు మార్పు లు చేసినట్టు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, శిక్షణ విభాగం డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశాలు, మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాలను ఈసారి కానిస్టేబుల్స్ శిక్షణలో అదనంగా చేర్చినట్టు వెల్లడించారు. లింగ వివక్షకు తావులేకుండా శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో బిస్త్ పలు అంశాలను పంచుకున్నారు. సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీరాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 పోలీస్ శిక్షణ కేంద్రాల నుంచి 8,047 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్నారు. వీరిలో 4,116 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 3,685 మంది ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), 228 మంది ఐటీ కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ అంశాలను తొలిసారిగా చేర్చి అవగాహన కల్పించాం. సైబర్ నేర విధానం (మోడస్ అపరెండీ) ఎలా ఉంటుంది, ఇతర అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండేలా తరగతులు నిర్వహించాం. యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్‌లో పాల్గొనడం, దర్యాప్తులో పై అధికారులకు సహకరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చాం. సెల్ఫ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇన్‌డోర్‌తో పాటు ఔట్‌డోర్ శిక్షణలో సెల్ఫ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత పెంచాం. పని ఒత్తిడి తట్టుకునేలా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా కొన్ని మార్పులు చేశాం. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే సివిల్ కానిస్టేబుళ్లకు కూడా నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. నేర దర్యాప్తు, కేసుల నమోదు, క్షేత్రస్థాయి విధుల్లో తరచూ అవసరమయ్యే చట్టాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఏం చర్యలు తీసుకోవాలి, పై అధికారి వచ్చే వరకు క్రైం సీన్‌ను కాపాడడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చాం. ఈ బ్యాచ్‌లో 5,470 మంది గ్రాడ్యుయేట్లు, 1,361 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 15 మంది ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారున్నారు. -
డిసెంబర్లో ‘కానిస్టేబుల్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీసు నియామక మండలి (ఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. 2023, జనవరి 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరుకాగా వారిలో 95,208 మంది అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వివాదాలు పరిష్కారం కావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎల్పీఆర్బీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో 92,507 మంది దేహదారుఢ్య పరీక్షల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారని, మిగిలిన వారూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులు నవంబర్ 11–21 వరకు slprb.ap.gov.in లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
అమ్మో! 'ఆడపిల్ల' అనుకునే తల్లిదండ్రులకు..ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి!
టెక్నాలజీ పెరిగి ఎంతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ లింగ వివక్షత మాత్రం అలానే ఉంది. మహిళలు కూడా తాము మగవాళ్లకు ఎందులోనూ తీసిపోము అన్నట్లుగా ప్రతీ రంగంలో దూసుకుపోతున్నా.. 'ఆడపిల్ల' అనంగానే చాలా మంది తల్లిదండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంటుంది. వారసుడుగా కొడుకుకి ఉన్నంత ఆదరణ కూతుళ్లకు ఎందుకు ఉండదనేది తరతరాలుగా వేధిస్తున్న చిక్కు ప్రశ్న. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలున్న తల్లిదండ్రులంటే సమాజం సైతం తెగ జాలి చూపించేస్తుంది. అమ్మో! ఇద్దరూ ఆడపిల్లలే!.. అంటూ పదేపదే గుర్తు చేసి ఆయా తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. దీంతో ఆయా తల్లిదండ్రుల కూడా తాము కన్నది ఆడపిల్లలు కదా! అని భయంభయంగా గడుపుతారు. కానీ ఇక్కడొక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే గాదు, శభాష్ ఇలా పెంచాలి ఆడపిల్ల అని అందరిచేత ప్రశంసలందుకున్నాడు. ఈ తండ్రి గాథ కచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, గొప్ప మార్పు తెప్పిస్తుంది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ సింగ్ పిండి మిల్లు కార్మికుడు. ఆయన కూడా అందరిలా తనకి వారుసుడు పుట్టాలని ఎంతగానో అనుకున్నాడు. అయితే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందనుకున్నాడు. ఆ తర్వాత రెండవ కాన్పులో వారసుడు పుడతాడని కొండంత ఆశతో ఎదురుచూడగా మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయినప్పటికీ రాజ్ కుమార్ సింగ్ బాధపడలేదు. ఇలా ఏడుగురు పిల్లల్ని కన్నాడు. అయితే అందరూ ఆడపిల్లలే పుట్టారు. అయితే ఏంటీ? మంచి చదువులు చెప్పించి శివంగుల్లా పెంచాలనుకున్నాడు. అందరిలా ఇతను కూడా తన కూతుళ్లను ఓ వయసు వచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టేయాలనుకోలేదు. తన తాహతకు మించి ఏడుగుర్ని ఉన్నత చదువులు చదివించాడు. ఇక్కడ రాజసింగ్ సింగ్‌ని కూతుళ్ల పెళ్లిళ్ల గురించి ఇరుగుపొరుగు వారు పదేపదే గుర్తు చేస్తూ భయపెడుతూనే ఉండేవారు. కానీ ఆ తండ్రి మాత్రం కూతుళ్లను వాళ్ల కాళ్లమీద నిలబడి గలిగేలా పెంచితే చాలు అనే సూత్రాన్ని గట్టిగా నమ్మేవాడు. అదే నిజమయ్యేలా చేశారు ఏడుగురు కూతుళ్లు కూడా. వారంతా పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వోద్యోగాలు సాధించి తండ్రి ఆలోచనను నిజం చేశారు. ఇక పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తోంది. రెండవ కూతురు హాని ఎస్ ఎస్ బి లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కూతురు సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఇలా ఏడుగురు కూతుర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం అయితే.. వారిని ఆ దిశగా ప్రేరేపించడం మరింత గొప్ప విషయం. ఇన్నాళ్లు రాజ్ కుమార్‌ని ఆడిపిల్లలు అని భయపెట్టే ఇరుగుపొరుగు అంతా అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. పైగా పెంచితే అతడిలా పెంచాలి అని మెచ్చుకుంటున్నారు. కూతురిని భారంగా భావించే వారికి ఈ తండ్రి కథ తగిన సమాధానమిస్తుంది. (చదవండి: నవజాత శిశువులకు బ్లడ్ ఎక్కించాల్సి వస్తే.. ఏ గ్రూప్ రక్తాన్ని ఇస్తారంటే..!) -
కానిస్టేబుల్ నియామకాలకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో 15,750 కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)ను ధర్మాసనం ఆదేశించింది. ఆ కమిటీల నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో.. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు 30న తుది రాతపరీక్ష జరిగింది. అందులో దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు అభ్యర్థులు పేర్కొన్నారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతోపాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ‘‘ఈ పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలి. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదు. 57 ప్రశ్న తప్పుగా ఉంది. వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలి. ఈ మార్పులతో పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి, ఫలితాలను ప్రకటించాలి. తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’’అని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించలేదని, ఆ తీర్పును కొట్టివేయాలని కోరింది. ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశర్వర్రావుల ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నట్టు పేర్కొంది. రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రశ్నల తప్పిదాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులలో విశ్వాసం పెంపొందించేలా పారదర్శకంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని నియామక బోర్టును ఆదేశించింది. ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు ఊరట రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీనే ఫలితాలు ప్రకటించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ.. జాబితాను విడుదల చేసింది. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది. -
హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు...!
-
తెలంగాణ కానిస్టేబుల్ సెలక్షన్స్‌కి లైన్‌క్లియర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగింది. కానిస్టేబుల్ నియామకంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో.. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది. కానిస్టేబుల్ ప్రశ్న పత్రం లో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో.. సెలక్ట్ అయిన అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పు ను సవాలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. గత తీర్పును కొట్టేసింది. సింగిల్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్సపర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూనే.. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలనీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
TS: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలి.. హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు నిలిపివేయాలని ఎస్పీలు, కమిషనర్లకు టీఎస్ఎల్పీఆర్బీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొన్ని రోజుల క్రితం ఆదేశించినా.. నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. దీంతో మెడికల్ టెస్టులు వెంటనే నిలిపివేయాలని కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని టీఎస్ఎల్పీఆర్బీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు తెలిపింది. చదవండి: అబ్రహంకు బీఫామ్ ఇవ్వని కేసీఆర్.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్ -
మళ్లీ ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144వ నంబర్ ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని తొలగించాలని తేల్చిచెప్పింది. 2022, ఆగస్టు 30న జరిగిన కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్షలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి బదులివ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్లు తెలిపారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు రమేశ్ చిల్ల, ఎన్ఎస్ అర్జున్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి.. సోమవారం తీర్పు వెలువరించారు. ‘పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుని ఆదేశిస్తున్నాం. పేపర్లను మూల్యాంకనం చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రచురించి, తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’అని తీర్పులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థుల్లోనూ గందరగోళం.... కానిస్టేబుల్ నియామక పరీక్షల తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గత బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయి తే తాజా తీర్పు మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తే ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు కాగా, ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు మళ్లీ వెల్లడించే అవకాశం రావడంతో నియామక బోర్డుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
TS: ఆ గ్రామం నుంచే కానిస్టేబుల్‌కు 17 మంది ఎంపిక
రంగారెడ్డి: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసుకానిస్టేబుల్ ఉద్యోగాల్లో మారుమూల ప్రాంత మైన మంచాల మండలం నుంచి 76 మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఒక్క మంచాల గ్రామం నుంచే 17 మంది ఎంపిక కావడం విశేషం. ఆరుట్ల పంచాయతీ పరిధిలో 11 మంది ఉద్యో గాలు సాధించారు. అన్నదమ్ములు పృథ్వీధర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డిని సత్కరించిన కౌన్సిలర్ చల్లూరి మురళీధర్‌రెడ్డి ఆగాపల్లి నుంచి నలుగురు, బండలేమూర్ నుంచి నలుగురు, అజ్జిన తండా నుంచి ఇద్దరు, చెన్నారెడ్డిగూడ నుంచి ఇద్దరు, లోయపల్లి నుంచి నలుగురు, ఎల్లమ్మ తండా నుంచి ముగ్గురు, బోడకొండ నుంచి ఐదుగురు ఉన్నారు. సత్తి తండా నుంచి ఇద్దరు, కొర్రం తండా నుంచి ఇద్దరు, చీదేడ్ నుంచి ముగ్గురు, రంగాపూర్ నుంచి ముగ్గురు, వెంకటేశ్వర తండా నుంచి ఒకరు చొప్పున ఎంపికయ్యారు. లింగంపల్లి నుంచి ఒకరు, నోముల నుంచి ఇద్దరు, తిప్పాయిగూడ నుంచి ముగ్గురు, తాళ్లపల్లి గూడ నుంచి నలుగురు, చిత్తాపూర్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. అన్నదమ్ముల ఎంపిక అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం 9వ వార్డుకు చెందిన కర్తాల కృష్ణారెడ్డి, సుజాత దంపతుల ఇద్దరు కుమారులు పృథ్వీధర్‌రెడ్డి, శరత్ చంద్రారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానిక వార్డు కౌన్సిలర్ చల్లూరి మురళీధర్‌రెడ్డి శుక్రవారం వారిని అభినందించి సత్కరించారు. సంతోషంగా ఉంది మాది మధ్యతరగతి కుటు ంబం. కష్టపడి చదివాను. పోలీసు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. పట్టుదలతో మరింత కష్టపడి ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. – చెనమోని సందీప్, మంచాల, ఏఆర్ కానిస్టేబుల్ కష్టానికి ఫలితం మాది నిరుపేద కుటుంబం.రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. చాలా ఆనందంగా ఉంది. – కుండె పల్లవి, మంచాల, సివిల్ కానిస్టేబుల్ -
తాను మరణించలేదు.. కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో.. బతికే ఉన్నాడు!
వరంగల్: రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూనావత్ వేణు కానిస్టేబుల్ రాత పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చేంత వరకు ఇంటి వద్ద ఖాళీగా ఎందుకు ఉండాలని తండ్రితో కలిసి సూర్యాపేటలో సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్లాడు. 2 నెలల క్రితం పనులు ముగించుకొని తండ్రితో కలిసి బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో వేణు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కుమారుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయిన విషయం తెలిసిన తల్లిదండ్రులు భద్రు, కేవూల్య కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు బతికుంటే తమను సాకేవాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు.. ఒకే ఇంట్లో నలుగురు సెలెక్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ పూర్తైంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎల్పీఆర్బీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఒకే కుటుంబంలో నలుగురికి కొలువులు వచ్చాయి. దీంతో, ఆ కుటుంబ సభ్యులు, అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వీరంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడంతో విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు. ఇంట్లో నలుగురికి జాబ్ రావడం సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. పోలీసు నియామక ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మల్లవరం నుంచి 13మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఉపేందర్, హరీష్, సివిల్‌లో సైదులు, శ్రీకాంత్, ఎఆర్లో తిరుపతిరావు, కటికి ప్రవళిక, టిఎస్ఎస్పీలో రవీందర్,పవన్, దుగ్గిదేవర వంశీ, యర్రి లక్ష్మణరావు, శ్రీహరి, వరుణ్, ఎస్పీఎఫ్ లో రాంమోహన్ లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే చింతకాని మండలంలో ఏడుగురు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు. మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్. ఈయన వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అంజలి. వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష. -
‘కానిస్టేబుల్’ తుది ఫలితాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డాయి. అన్ని పరీక్షల అనంతరం పోలీస్‌కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి వివరాలు గురువారం ఉదయం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఉంచుతామని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు (టీఎస్ఎలీ్పఆర్బీ) వెల్లడించింది. మొత్తం 13 కేటగిరీల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, దరఖాస్తు చేసుకున్న వారిలో 15,750 మందిని ఎంపిక చేసినట్టు టీఎస్ఎలీ్పఆర్బీ చైర్మన్ వీవీ.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులుకాగా, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 3, 4 వారాల్లో రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో భాగంగా అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, స్థానికత, వయసు మినహాయింపు, ఇతర అంశాలు పరిశీలించామని, దీంతోపాటు శారీరక సామర్థ్య పరీక్ష, ట్రేడ్ టెస్టు, తుది రాత పరీక్ష అనంతరం అన్నింటిని పరిగణనలోకి తీసుకొని వీరిని ఎంపిక చేసినట్టు ఆ ప్రకటనలో శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో 854 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. అటెస్టేషన్ ఎలా చేయాలంటే...! బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో అటెస్టేషన్ ఫారం తీసుకోవాలి. టీఎస్ఎలీ్పఆర్బీ వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్‌లో ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్‌గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్ రూపంలో మూడు సెట్లు ప్రింట్లు ఏ4 సైజు పేపర్‌పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మూడు సెట్లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్‌పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి ఈనెల 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి. సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు ఈనెల 12న ఎస్పీ/ కమిషనర్ కార్యాలయాల్లో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్టు (హెచ్ఓ) కానిస్టేబుళ్లు ఈనెల 13న హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో, మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో అటెస్టేషన్ ఫారంలు సమర్పించాలి. సందేహాల నివృత్తికి అవకాశం తుది రాత పరీక్షలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో సందేహాలు, వాటిని నివృత్తికి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అభ్యర్థుల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీలు రూ.1000, ఇతరులు రూ.2000 ఫీజు చెల్లించాలి. కేవలం ఆన్లైన్ ద్వారానే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి వ్యక్తిగత వినతులకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. -
ప్రతిభను కనబరిచి.. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో గెలిచి..
ఆదిలాబాద్: పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. జిల్లాకు చెందిన 330 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. ఇది వరకే దేహదారుఢ్య పరీక్షలు, ప్రిలిమినరీలో అర్హత సాధించి తుది పరీక్ష రాశారు. ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 149 మంది, ఏఆర్‌కు 84 మంది, తెలంగాణ స్పెషల్ పోలీసు (టీఎస్ఎస్పీ)కి 97 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందారు. కుటుంబీకులు, బంధువులు వారిని అభింనందించారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలోని డీఈవో కార్యాలయంలో సబార్డినెట్‌గా పనిచేస్తున్న రాథోడ్ కవిత కూతురు రాథోడ్ సింధు సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సింధు తండ్రి శివాజీ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి ఆశయాన్ని ఆమె కొనసాగిస్తోంది. అలాగే భీంపూర్ మండలంలోని కరంజి(టి) గ్రామానికి చెందిన అంకిత కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. వీరిని వారి వారి గ్రామస్తులు అభినందించారు. ఎంపికైన యువకులు.. కానిస్టేబుల్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాంసి గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్‌రెడ్డి, బట్టు రాహుల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భీంపూర్, కరంజి(టి) గ్రామానికి చెందిన రవి ఏఆర్ కానిస్టేబుల్‌కి ఎంపిక కాగా, ఉద్యోగాలు సాధించిన యువకులను గ్రామస్తులు అభినందించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పలువురి ఎంపిక.. కానిస్టేబుల్ ఫలితాల్లో మండలంలోని బాలాపూర్‌కు చెందిన వై. ప్రశాంత్, జి.బబ్లు, జి.వంశీ, మాకోడ గ్రామానికి చెందిన బి.అఖిల్, బెల్లూరికి చెందిన దశరథ్, ప్రణయ్, కూర గ్రామానికి చెందిన అఖిల్‌రెడ్డి ఎంపికయ్యారు. -
ఏం కష్టం వచ్చిందో ఏమో... అప్పటి వరకు స్నేహితులతో మాట్లాడి..
విజయనగరం: ‘ఏం కష్టం వచ్చిందో ఏమో.. కనీసం ఎవరితో చెప్పుకోలేదు.. అటు స్నేహితులకుగాని ఇటు కుటుంబ సభ్యులకుగానీ ఎవరికీ తెలియదు... అర్థరాత్రి వరకు స్నేహితులతో ఫోన్లో మాట్లాడాడు. అంతలోనే ఏమైందో తెలియదుగానీ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.. తన గదిలో ఉరి వేసుకుని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.’ అధికారులు ద్వారా విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని రుంకానవీధికి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేశ్వరరావు ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలచివేసింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నాగేశ్వరరావు ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఢిల్లీలోని తన క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన నాగేశ్వరరావుకు రేణుకతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల పాప ఉండగా, భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. నెల రోజుల సెలవు కోసం ఇటీవల కుటుంబంతో చీపురుపల్లి వచ్చాడు. సెలవులు పూర్తవ్వడంతో వారం క్రితమే నాగేశ్వరరావు భార్య, పాపను చీపురుపల్లిలోనే ఉంచి విధులకు ఢిల్లీ వెళ్లాడు. త్వరలో పాప పుట్టినరోజు ఉండడంతో భార్య, కుమార్తెను చీపురుపల్లిలో ఉంచి, ఆ సమయానికి తిరిగి రావాలనుకునే విధులకు వెళ్లాడు. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం ఉదయం విధుల్లోకి రాకపోవడంతో అక్కడి అధికారులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడు అన్నయ్య మన్మధరావు, స్థానిక ఎంపీటీసీ ముల్లు పైడిరాజు ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి మృతదేహాన్ని విమానంలో చీపురుపల్లి తీసుకొస్తున్నారు. గురువారం చీపురుపల్లిలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయని ముల్లు పైడిరాజు తెలిపారు. -
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్‌లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్ 46తో హైదరాబాద్‌కు 53 శాతం రిజర్వేషన్.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. -
కానిస్టేబుల్స్ కక్కుర్తి.. కారులో డబ్బులున్నాయని తెలిసి దొంగతనం!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జాతీయ రహదారిలో సినీ ఫక్కీలో జరిగిన రూ.2 కోట్ల దారి దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దోపిడీకి పథకం వేసింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈనెల 22న ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన రూ.3 కోట్ల నగదును కొందరు రెండు కార్లలో తీసుకుని బెంగళూరు నుంచి హైదరాబాదు బయలు దేరారు. రూ.కోటి నగదు బ్యాగుతో వెళ్తున్న కారు డ్రైవరు.. కడపకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌కు మరొక కారులో తీసుకొస్తున్న రూ.2 కోట్ల నగదు తరలింపుపై సమాచారం చేరవేశాడు. ఎలాగైనా ఆ సొమ్మును దోపిడీ చేయాలని సదరు కానిస్టేబుల్ పథకం వేశాడు. మరో ఇద్దరు వ్యక్తుల(ఒక కానిస్టేబుల్, మరొక వ్యక్తి)తో కలసి పోలీసు దుస్తుల్లో జాతీయ రహదారి–44లోని గార్లదిన్నె మండలం కలగాసిపల్లి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచే వాహనాల సమాచారం గురించి రూ.కోటితో వస్తున్న కారు డ్రైవర్‌కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు వెనుకగా వస్తున్న సదరు డ్రైవర్ గార్లదిన్నె సమీపంలో రూ.2 కోట్లతో వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసేశాడు. కలగాసిపల్లి వద్ద మాటు వేసిన కానిస్టేబుల్ అండ్‌కోకు సంకేతాలు పంపాడు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న మరొక కారును ఆపి.. తమకందిన సమాచారం, ఆనవాళ్ల ఆధారంగా కారు డిక్కీలో నగదు ఉంచిన బ్యాగును లాగేసుకున్నారు. ప్రశ్నించబోయిన కారులోని వ్యక్తులపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు తమ ముందు వెళ్లిపోయిన రూ.కోటి కారులోని వ్యక్తులకు జరిగిన విషయం తెలియజేశారు. అనంతరం గార్లదిన్నె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీతో దర్యాప్తు ముందుకు.. రూ.2 కోట్ల నగదుతో ఉడాయించిన వ్యక్తులు ఇన్నోవా వాహనంలో అనంతపురం వచ్చారు. దోపిడీ చేసే కొన్ని గంటల ముందు అనంతపురం వద్ద వాహనం నంబరు ప్లేట్‌కు స్టిక్కర్ అతికించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో పోలీసులు పసిగట్టారు. దీంతో చోరీకి తెగబడింది వీరేనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. స్టిక్కర్ అతికించిన వ్యక్తి జంగిల్ షూ, జంగిల్ ప్యాంట్ ధరించి ఉండటంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. అనంతరం అతని మొబైల్‌కు వచ్చిన కాల్ డిటైల్స్ పరిశీలించగా.. ఎస్ఆర్ఆర్ కంపెనీకి చెందిన ఓ డ్రైవరు నంబరుతో ఎక్కువగా సంభాషించినట్లు తెలిసింది. కాల్ డీటైల్స్‌తో దొరికిపోయిన డ్రైవర్.. బెంగళూరు నుంచి రూ.3 కోట్ల నగదుతో హైదరాబాద్‌కు వెళ్తున్న విషయాన్ని ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులు దాచిపెట్టారు. దోపిడీకి గురైన రూ.2 కోట్ల గురించి మాత్రమే పోలీసులకు చెప్పారు. మరో రూ.కోటి ముందు వెళ్లిన కారులో తరలించారని దర్యాప్తులో తేలింది. రూ.కోటిని సురక్షితంగా తీసుకెళ్లిన కారు డ్రైవర్‌ను ఆరా తీయగా... ప్రస్తుతం తాను కళ్లకలక వల్ల డ్యూటీకి వెళ్లడం లేదని బుకాయించాడు. అయితే అతడి సెల్‌ఫోన్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్‌కు కాల్స్ వెళ్లినట్లు తేలడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నాడు. దోపిడీలో పాలుపంచుకున్న మరొక కానిస్టేబుల్, ఇంకొక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దోపిడీ అయిన సొమ్ములో కొంతమేర మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం. నిందితుల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
సెప్టెంబర్‌లో కానిస్టేబుల్స్ ఫలితాలు?
నిజామాబాద్ : కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితాను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సెప్టెంబర్ రెండో, లేదా మూడో వారంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌లో ఎ న్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ముందుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పోలీస్‌శాఖతో పాటు వివి ధ విభాగలైన జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ(రవాణా), ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 266 సివిల్ కానిస్టే బుల్స్, ఏఆర్ పోస్టులు 134 ఉన్నాయి. వివిధ విభాగాల సంఖ్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంది. జిల్లాకు కేటాయింపుల ప్ర కారం జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ (రవాణా), ఎకై ్సజ్‌శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఫలితాల ను మే 30న పోలీస్ నియామక మండలి ప్రకటించింది. జూన్ 1న ధ్రువపత్రాల పరిశీల న ప్రక్రియ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఎస్సై పరీక్ష ఫలితాల్లో బాసర జోన్ పరిధిలోని 35 ఎస్సై పోస్టులకు ఎస్సైలను ఎంపిక చేశారు. ఎస్సై పోస్టులకు ఎంపికై న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు(ఎస్బీ) ఎంకై ్వరీ చేశారు. ఎస్సైగా ఎంపికై న అభ్యర్థులకు మెడి కల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎస్సైల ఎంపిక పూర్తి కావడంతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లాలో 5313 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ చేశారు. మిగితా విభాగాల పోస్టులు కాకుండా సివిల్, ఏఆర్ పోస్టులకు జిల్లాలోని ఒక్కో పోస్టుకు 13 మంది పోటీ పడుతున్నారు. వీరికి సంబంధించిన అన్ని రికా ర్డులు, ఆయా జోన్లు, పోలీ స్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న ట్లు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం జరిగే వరకు రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సెప్టెంబర్ మూడోవారంలో ‘కానిస్టేబుల్’ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ‘కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా’ సెప్టెంబర్ మూడోవారంలో విడుదల కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్‌శాఖల్లో కలిపి మొత్తం 16,929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తుదిరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామకమండలి వెల్లడించడం తెలిసిందే. జూన్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్ నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుంది. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలోని మస్కిలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని అగోలికి చెందిన మల్లనగౌడ(34) మస్కి పోలీస్ స్టేషన్లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రక్తపోటు, చక్కెర వ్యాధులతో బాధపడుతున్న ఇతను శుక్రవారం రాత్రి నిద్రలో ఉండగానే మరణించినట్లు తెలిసింది. -
చావుబతుకుల మధ్య కానిస్టేబుల్ సతీమణి అనిత
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కానిస్టేబుల్ సతీమణి అనిత ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్లు బెంగళూరు వైద్యులు తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేస్తే కోలుకునే అవకాశం ఉందని, రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఇంటి పెద్ద కిరణ్ చనిపోవడంతో వారి పిల్లలు చిన్నారులు కావడంతో చేతిలో డబ్బులు లేక ఆ కుటుంబం చేయూత కోసం ఎదురుచూస్తోంది. రూ.3 లక్షలు సాయం చేసిన ఎస్పీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ కుటుంబానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు అండగా నిలిచారు. కానిస్టేబుల్ భార్య అనిత చికిత్స నిమిత్తం రూ.3 లక్షలు చెక్కును అనిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను నియమించి అనితకు వైద్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కరుణించిన ఖాకీలు ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ మృతిని పోలీసుశాఖ జీర్ణించుకోలేకపోయింది.. చాలా మందితో సన్నిహితంగా మెలిగిన కిరణ్‌కుమార్ ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరు పెట్టుకోని ఖాకీలేడు. ఈ క్రమంలోనే అతని భార్య అనిత ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చేయి చేయి కలిపి సాయం చేసేందుకు ముందుకు కదిలారు. ఇందులో భాగంగానే పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ రూ.25 వేలు ఆర్థిక సహాయం చేశారు. కియా పోలీసు స్టేషన్ సిబ్బంది రూ.10 వేలు సహాయం చేశారు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా గంటల వ్యవధిలోనే రూ.2.50 లక్షలను పంపి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. -
మహిళలపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ తమపై దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించాడని, అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు బుధవారం ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. వింజమూరు గంగమిట్టకు చెందిన మహిళలు మంగళవారం అర్ధరాత్రి స్థానిక సబ్‌స్టేషన్‌కు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేతపై సిబ్బందిని నిలదీసి ఆందోళన చేశారు. దీంతో కొందరు కానిస్టేబుళ్లు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కానిస్టేబుల్ కృష్ణ మహిళలనుద్దేశించి అసభ్య పదాలు ఉపయోగించాడు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుమణిగేలా చేశారు. అయితే తీవ్ర కలత చెందిన మహిళలు, వారి బంధువులు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొని కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఎస్సై కోటిరెడ్డి వారికి సర్దిచెప్పి కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు విజయకుమార్‌రెడ్డి, కొండారెడ్డి, కాలేషా తదితరులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. విద్యుత్ సమస్యను ఏఈ శ్రీనివాసరావు దృష్టికి సాక్షి తీసుకెళ్లగా గంగమిట్టలో లోఓల్టేజీ సమస్య ఉందని, దీనివల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరైందని, రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.