పట్టుబడిన నగదు, ఎస్సై దీపిక, కానిస్టేబుల్ నరసింహ
ప్రకాశం: ఘర్షణ కేసులో నిందితులుగా పేర్లు లేకుండా చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి రూ.45 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు కానిస్టేబుల్, ఓ మహిళా ఎస్సై. కొనకనమిట్ల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ పి.శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొనకనమిట్ల మండలంలోని కాట్రగుంట ఎస్సీ కాలనీకి చెందిన జల్లి చిన్న చెన్నయ్య, అంజలి భార్యభర్తలు. మే నెల 20వ తేదీ వీరి మధ్య వివాదం జరిగింది. మధ్యవర్తిగా బంధువు అయిన గొట్టిముక్కల నరసింహులు సర్దిచెప్పారు.
ఈక్రమంలో చెన్నయ్య కొట్టడంతో అంజలికి గాయాలయ్యాయి. అంజలి తరఫున పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంజలి తన భర్తతో పాటు, గొట్టిముక్కల నరసింహారావు, జిల్ది కేశవులు, జల్ది మాచర్ల అనే వారిపై కేసు పెట్టింది. మే 20వ తేదీన కేసు నమోదు చేసిన ఎస్సై దీపిక విచారణ జరిపి అంజలి భర్త చెన్నయ్యను మే 31వ తేదీ రిమాండ్‌కు పంపించారు. మిగిలిన ముగ్గురికి కొట్లాటతో సంబంధం లేదని గ్రామస్తులు విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పారు. దీనిని నమోదు చేసుకుని, వారిపై కేసులేనట్లుగా రికార్డుల్లో పోలీసులు నమోదు చేశారు.
అయితే ఈ విషయం కేసులో పేర్లు ఉన్న పై ముగ్గురికి తెలియకుండా, మీ మీద కేసు లేకుండా పేర్లు తీసి వేయాలంటే రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యవర్తి ద్వారా రూ.45 వేలకు బేరం కుదుర్చుకున్నారు. తాను అందుబాటులో లేకుంటే, కానిస్టేబుల్‌కు ఇవ్వాలని ఎస్సై దీపిక చెప్పారు. గొట్టిముక్కల నరసింహులు అనే వ్యక్తి లంచం ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించారు.
కేసు నమోదు చేసుకున్న ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు ఫిర్యాది గొట్టిముక్కల నరసింహులు.. కానిస్టేబుల్ నరసింహకు రోడ్డుపై రూ.45 వేలు ఇస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు. ఎస్సై దీపికను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు అపర్ణ, టీవీ.శ్రీనివాస్, సీహెచ్.శేషు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment