ఒంగోలు సబర్బన్: నగరంలోని కొప్పోలు రోడ్డులో గల రాజీవ్ గృహకల్ప కాలనీలో వివాహిత హత్యకు గురైంది. సేకరించిన వివరాల మేరకు... కర్నూలు జిల్లాకు చెందిన కొండపల్లి గౌరీ (34) బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త వెంకటరెడ్డి చనిపోగా, కర్నూలు జిల్లాకే చెందిన మహేశ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. శుక్రవారం రాత్రి మహేశ్ గౌరీ ఇంటికి వచ్చాడు. ఏమైందో ఏమోగానీ తెల్లవారేసరికి గౌరీ విగతజీవిగా బెడ్‌రూమ్‌లో మంచంపై పడి ఉంది. మహేశ్ వెళుతూ ఇంటి బయట తాళం వేశాడు.
తెల్లవారి నిద్రలేచిన చిన్నకుమార్తె తల్లివద్దకు వెళ్లి నిద్రలేపగా, చలనం లేకపోయేసరికి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు తాళం పగులకొట్టి లోనికి ప్రవేశించారు. గౌరీ చనిపోయిందని నిర్ధారించుకుని ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు డీఎస్పీ వీ నారాయణస్వామిరెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు మృతదేహాన్ని తరలించారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. గతంలో తండ్రినీ, ఇప్పుడు తల్లినీ కోల్పోవడంతో ఆ ముగ్గురు ఆడపిల్లలు అనాథలుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment