ప్రకాశంలో సుపారీ హత్య: ప్రియుడి మోజులో భర్తను కిరాతకంగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో సుపారీ హత్య: ప్రియుడి మోజులో భర్తను కిరాతకంగా..

Published Thu, Dec 28 2023 1:10 AM | Last Updated on Thu, Dec 28 2023 12:59 PM

- - Sakshi

ప్రకాశం: ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే కడతేర్చేంది ఓ మహిళ. గుంటూరు నగరంపాలెం సీఐ కె.మల్లికార్జున కథనం మేరకు.. కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన చిన్నకత్తి రామచంద్రయ్య(40) గుంటూరులోని లక్ష్మీనగర్‌లో భార్యాబిడ్డలతో నివాసముంటూ కూలీనాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామచంద్రయ్య భార్య వెంకటరమణ గుంటూరుకు చెందిన చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ సంబంధానికి భర్త రామచంద్రయ్య అడ్డుగా ఉన్నాడని అంతమొందించాలని పథకం పన్నారు.

 ఇందుకు చిన్నా.. ఇద్దరు కిరాయి హంతకులతో రూ.లక్షకు సుపారీ కుదర్చుకున్నాడు. గత నెల 27వ తేదీ రాత్రి రామచంద్రయ్య పనులకు వెళ్లి నిద్రిస్తున్న సమయంలో వెంకటరమణ, చిన్నా, కిరాయి గూండాలు శ్యామ్‌, చిన్ను కలిసి కండువాను రామచంద్రయ్య గొంతుకు బిగించి హత్య చేశారు. రామచంద్రయ్య మెడలో ఉన్న బంగారు చైన్‌ను తాకట్టు పెట్టి సుపారీ కింద రూ.60 వేలు ఇచ్చారు. ఆ తరువాత మృతదేహాన్ని అలవలపాడు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే సుపారీ ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వాలని శ్యామ్‌, చిన్నూ అడగడంతో వారి మధ్య వివాదం మొదలైంది.

హత్య విషయం బయటకు పొక్కటంతో గుంటూరు నగరంపాలెం సీఐ కె. మల్లికార్జున సుమోటోగా కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో రామచంద్రయ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. గుంటూరు నగరంపాలెం ఎస్సై బి.రవీంద్రనాయక్‌, గుంటూరు గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రమోద్‌కుమార్‌, రుద్ర చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు బుధవారం అలవలపాడు చేరుకున్నారు. తహసీల్దార్‌ ఎం.జ్వాలానరసింహం, వీఆర్వో కాశయ్య, గ్రామ పెద్దల సమక్షంలో రామచంద్రయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement