స్నేహితుడే కాలయముడు!
గిద్దలూరు రూరల్:
ఓ మహిళ కట్టుకున్న భర్తను పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఆ ప్రియుడి చేతిలోనే హతమైందని మార్కాపురం డీఎస్పీ యు.నాగారాజు పేర్కొన్నారు. అక్రమ సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా మరొకరి జీవితం జైలు పాలయ్యేలా చేసిందని చెప్పారు. ఈ నెల 6వ తేదీన గిద్దలూరులోని చాకలివీధిలో పాకి సుభాషిణి అనే మహిళ ఆమె ప్రియుడు అంబడిదాసు శ్రీకర్ అలియాస్ నాని చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు శ్రీకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరుగునపడిన మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
కంభం మండలం నర్సిరెడ్డిపల్లెకు చెందిన పాకి బాలక్రిష్ణ(31)కు రాచర్లకు చెందిన సుభాషిణిని ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. వీరికి లోకిత, రోహిత్ అనే ఇద్దరు చిన్నపిల్లలున్నారు. బాలకృష్ణ కుటుంబంతో సహా గిద్దలూరులోని రాచర్ల రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సుభాషిణికి తనతో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న రాచర్లకు చెందిన నాని తారసపడ్డాడు. గిద్దలూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాని.. సుభాషిణి ఫోన్ నంబర్ తీసుకుని తరుచూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో పాత పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మార్చుకున్నారు. ఈ వ్యవహారం బాలకృష్ణకు తెలియడంతో సుభాషిణిని మందలించాడు. భార్య చేస్తున్న మోసాన్ని జీర్ణించుకోలేక మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. దీంతో భర్తను అడ్డుతొలగించాలని భావించిన సుభాషిణి తన స్నేహితుడు నానితో కలిసి పథకం రచించింది. 2023 ఏప్రిల్ 4వ తేదీన మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి భర్తతో తాగించింది. మత్తులోకి జారుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత నానితో కలిసి బాలకృష్ణ ముఖానికి గుడ్డకట్టి, గొంతుకు తాడు బిగించి చంపారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన సుభాషిణి బంధువులను నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. బాలకృష్ణ మద్యానికి బానిసై ఉరివేసుకుని చనిపోయి ఉంటాడని అంతా భావించారు. బాలకృష్ణ పెద్ద కర్మ అయిన వెంటనే సుభాషిణి తన ప్రియుడు నానితో కలిసి హైదరబాద్‌కు మకాం మార్చింది. అక్కడ సహజీవనం సాగిస్తున్న క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సుభాషిణి తిరిగి గిద్దలూరు చేరుకుని ఓ రెడీమెడ్ షాపులో పనిచేసుకుంటూ జీవిస్తోంది. అయితే నాని తనతో మళ్లీ మాట్లాడాలంటూ తరుచూ సుభాషిణిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో నానిని మందలించారు. ప్రియురాలు దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని ఆమైపె కక్ష పెంచుకుని కత్తితో గాయపరచగా ఆమె మార్కాపురం వైద్యశాలలో మృతి చెందిందని డీఎస్పీ వివరించారు. కేసును చేధించిన సీఐలు కె.సురేష్, రామకోటయ్య, ఎస్సై ఇమ్మానియేల్‌ను ప్రత్యేకంగా ఆభినందించారు.
ప్రియుడి మోజులో పడి ఏడాదిన్నర క్రితం భర్తను చంపిన భార్య
సహజీవనం చేస్తున్న క్రమంలో ప్రియుడితో
విభేదాలు
వారం క్రితం ప్రియురాలిని కత్తితో
పొడిచి చంపిన ప్రియుడు
Comments
Please login to add a commentAdd a comment