సాక్షి, నల్లగొండ : పోలీస్ ఉద్యోగాల్లో జిల్లా నిరుద్యోగ యువత అధిక ఉద్యోగాలు సాధించింది. డిగ్రీ, పీజీ, ఎం.ఫార్మసీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులంతా పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల్లో పట్టు సాధించారు. ఎలాగైనా ఉద్యోగం పొందాలనే తపన, లక్ష్యానికి అనుగుణంగా సాధన చేసి శిక్షణ పొంది ఉద్యోగం పొందడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొనగా వారి తల్లిదండ్రుల్లో ఆనందం ఆకాశాన్నంటింది. మంగళవారం రాత్రి వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో సుమారుగా 401 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందగా ఎస్‌ఐ ఫలితాల్లో 140 మంది ఎంపికైనట్లు జిల్లా పోలీస్ శాఖ అంచనా వేసింది.
ప్రతి గ్రామం నుంచి 10 మంది, ఐదుగురు, ఒకరు చొప్పున ఉద్యోగాలు పొందడంతో ఆయా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 24,908 మంది దరఖాస్తులు చేసుకోగా 22,250 మంది దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్నారు. 10వేల మంది పురుష అభ్యర్థులు, 1844 మంది మహిళలు అర్హత సాధించారు. పోలీస్ పరీక్షా ఫలితాల్లో దేహదారుఢ్య పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన వారే ఎక్కువగా ఉద్యోగాలు పొందారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళా అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. జిల్లా పోలీస్ శాఖ నుంచి అవగాహన సదస్సులు, ప్రత్యేక శిక్షణ కోసం కోచింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు పొందే విధంగా దిశా నిర్దేశం చేశారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎస్పీ రంగనాథ్ స్త్రీ, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా శిక్షణ ఇప్పించారు. జిల్లా నుంచి పోలీస్ ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇటు పోలీస్ శాఖ, అటు నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
దోమలపల్లి గ్రామానికి చెందిన ఎం.ఫార్మసీ విద్యార్థి రాంరెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. అదే గ్రామంలో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసు ఉద్యోగులు ఉండగా ఇటీవల ఫలితాలతో మరో ఆరుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు. ఖాజీ రామారం నుంచి నలుగురురు, చందనపల్లి, బుద్ధారం నుంచి ఒకరు చొప్పున ఉద్యోగాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment