వరంగల్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు ఇటీవలే 32 ఏళ్లు నిండాయి. ఇప్పటికే ఎస్సై శారీరక పరీక్షలు పూర్తి చేసి, రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. డ్యూటీ చేస్తూనే.. రాతపరీక్షకు సిద్ధమవడం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు
కరీంనగర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పదేళ్ల కింద డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఈ మధ్య డిగ్రీ పూర్తి చేసిన యువకులతో పోటీ పడాలంటే.. రాత పరీక్షలకు ఇపుడున్న తక్కువ సమయం సరిపోదంటున్నాడు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై రాత పరీక్షల కోసం సెలవు పెట్టి మరీ సిద్ధమవుతున్న కానిస్టేబుళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో చేరారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సెలవులన్నీ రద్దుచేసిన డీజీ కార్యాలయం.. కానిస్టేబుళ్లంతా ఏప్రిల్ 1 నాటికి తప్పకుండా విధులకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో చేసేదిలేక ఇన్నిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటూ రాతపరీక్షకు ప్రిపేరవుతున్న వారంతా.. డ్యూటీలో రిపోర్ట్ చేసి, విధులకు హాజరవుతున్నారు. అటు.. ఎస్సై రాతపరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే.. ఈ పరీక్షలను వాయిదా వేయాలని పోలీసుశాఖలోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు వేడుకుంటూనే ఉన్నారు. గతేడాది ఎస్సై రాతపరీ క్షకు నోటిఫికేషన్ రాగా.. మార్చి చివరినాటికి శారీరక పరీక్షలు పూర్తయ్యాయి.
ఇదీ.. కానిస్టేబుళ్ల ఆవేదన!
వాస్తవానికి ప్రస్తుతం పోలీసుశాఖలో దాదాపుగా 3వేల మందికిపైగా కానిస్టేబుళ్లు ఎస్సై పరీక్షకు ప్రిపేరవుతున్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వీరికి రాతపరీక్షలు నిర్వహించనుంది. అయితే, సమయం తక్కువగా ఉందని పరీక్షను వాయిదా వేయాలని డిపార్ట్‌మెంట్‌లోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు అభ్యర్థిస్తున్నారు. దీనిపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయినా.. పరీక్షను వాయిదా వేసేది లేదంటూ హోంశాఖ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల తర్వాత అనధికారికంగా సెలవుల్లో ఉన్న కానిస్టేబుళ్లందరికీ నోటీసులు పంపి, టెలిఫోన్లో వారికుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించింది. ఫలితంగా వారంతా ఏప్రిల్ 1లోపు అంతా రిపోర్టు చేసి విధుల్లో చేరారు. ఎస్సై కావాలని ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న తమకు.. తమ శాఖలోని అధికారులే కరుణించకపోతే ఎలాగని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము రాత పరీక్షను రద్దు చేయమని అడగడం లేదని, కేవలం ప్రిపరేషన్ కోసం నెల రోజులు వాయిదా వేయమని మాత్రమే కోరుతున్నామంటున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు, ఏప్రిల్ 14న ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి శిక్షణ ఉందని ఈ నేపథ్యంలో వాయిదా విషయాన్ని మానవతాకోణంలో పరిశీలించాలని విన్నవిస్తున్నారు.
వాయిదా సమస్యేలేదు
ఈ విషయంలో పోలీసుశాఖ పలుమార్లు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని రిక్రూట్‌మెంట్ బోర్డు చెప్పేసింది. ఇప్పటికే 2.17 లక్షల మందికి శారీరక పరీక్షలు నిర్వహించిన బోర్డు రాతపరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment