
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్ పోస్టులకు తుదిరాత పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. ఉమ్మడి 9 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 30వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాతపరీక్ష నిర్వహించనున్నారు. సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల రెండు పరీక్షలకు సైతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్షకేంద్రాన్ని కేటాయించనున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ తుది రాతపరీక్ష హాల్‌టికెట్లను అభ్యర్థులు సోమవారం(ఈ నెల 24) ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు www.tslprb.com వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment