written exam
-
30న కానిస్టేబుల్ పోస్టులకు తుది రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్ పోస్టులకు తుదిరాత పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. ఉమ్మడి 9 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాతపరీక్ష నిర్వహించనున్నారు. సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల రెండు పరీక్షలకు సైతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్షకేంద్రాన్ని కేటాయించనున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తుది రాతపరీక్ష హాల్‌టికెట్లను అభ్యర్థులు సోమవారం(ఈ నెల 24) ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు www.tslprb.com వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే పరీక్ష పేపర్‌ను మాత్రం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవల టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ నేపథ్యంలో స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షను నిర్వహించడంపై అధికారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీగా కసరత్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. భారీ డిమాండ్... స్టాఫ్ నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. మొత్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉంటుంది. దాంతో అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. కాగా వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నారు. కాగా, రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. రాతపరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సై కాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్ నర్సింగ్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సివిల్ ఎస్సైకి.. 95 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు.. 96 మంది
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కొలువులకు పోటీ తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించిన వారంతా ఇప్పుడు తుది రాత పరీక్షపై దృష్టి సారించారు. ఎలాగైనా ఖాకీ యూనిఫాం ధరించాలన్న లక్ష్యంతో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే పోలీసు ఉద్యోగం అంత సులువుగా దక్కే అవకాశం లేదని పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య చెబుతోంది. సివిల్ ఎస్సై మొదలు డ్రైవర్ పోస్టు వరకు ప్రతి దానిలో పోటీ తీవ్రంగానే ఉంది. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ కలిపి.. మొత్తం 11 రకాల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఆయా పోస్టులకు మార్చి 12 నుంచి జరిగే తుది రాత పరీక్షకు టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు చేస్తోంది. పోటీ ఉన్న కొన్ని పోస్టులను పరిశీలిస్తే.. ►సివిల్ ఎస్సై మొత్తం పోస్టులు 554 భర్తీ చేయాల్సి ఉండగా..తుది రాత పరీక్షకు 41,256 మంది పురుషులు, 11,530 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సరాసరిన ఒక్కో పోస్టుకు 95 మంది పోటీ పడుతున్నారు. ►సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 15,644 భర్తీ చేయనున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నా...పోటీపడే అభ్యర్థుల సంఖ్యా అదే స్థాయిలో ఉంది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు ఏకంగా 22,882 మంది మహిళలు, 67,606 మంది పురుషులు పోటీలో ఉన్నారు. ఒక్కో పోస్టుకు దాదాపుగా ఆరుగురు బరిలో ఉన్నారు. ►మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను తుది రాత పరీక్షకు 59,325 మంది పోటీలో ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు సరాసరిన 96 మంది పోటీ పడుతున్నారు. ►ఇక అత్యంత పోటీ ఉన్న పోస్టు రవాణా కానిస్టేబుల్ అని చెప్పాలి. మొత్తం 63 పోస్టులకు తుది రాత పరీక్షకు 747 మంది మహిళలు, 8,256 మంది పురుషులు పోటీలో ఉన్నారు. ఒక్కో పోస్టుకు సరాసరిన 142 మంది పోటీ పడుతున్నారు. ►ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులు 8 ఉండగా.. పోటీలో 1,921 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు 240 మంది పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ మెకానిక్ 21 పోస్టులకు గాను 1,185 మంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో మూడు ఎస్సై పోస్టులకు 933 మంది, 100 డ్రైవర్ పోస్టులకు 6,504 మంది పోటీలో ఉన్నారు. -
అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ
క్రికెట్లో అంపైర్ల పాత్ర కీలకమైనది. అది ఫీల్డ్ అంపైర్లు కావొచ్చు.. థర్డ్ అంపైర్ కావొచ్చు. అంపైర్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆటగాళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది. అంపైర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకోవడానికి ఇప్పుడంటే డీఆర్ఎస్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది. కానీ డీఆర్ఎస్ లేనప్పుడు అంపైర్‌దే కీలక నిర్ణయం.రనౌట్, స్టంపింగ్ మినహా మిగతా ఎలాంటి నిర్ణయాలైనా అంపైర్ తీర్పు ఫైనల్‌గా ఉంటుంది. కొన్నిసార్లు ఔట్ కాకపోయినప్పటికి.. అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాట్స్మెన్లు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి అవి మేలుచేస్తే.. కొన్నిసార్లు కీడు చేశాయి. తప్పుడు అంపైరింగ్ వల్ల ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్లతో గొడవకు కూడా దిగిన సందర్బాలు కోకొల్లలు. డీఆర్ఎస్ రూల్ వచ్చినప్పటికి.. ఇప్పటికీ ఫీల్డ్ అంపైర్లకే సర్వాధికారాలు ఉంటాయి. థర్డ్ అంపైర్ ఔట్ కాదని ప్రకటించినా.. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇస్తే బ్యాటర్ వెనుదిరగాల్సిందే. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్ సహా బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్ సహా ఇతర ప్రైవేట్ లీగ్స్‌లో చాలానే చోటుచేసుకుంటున్నాయి. కాగా క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారత్‌లోనూ అంపైరింగ్ వ్యవస్థ ఎప్పటిలాగే ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండడంతో బీసీసీఐ.. అంపైరింగ్ స్థాయిని పెంచేందుకు చర్చలు తీసుకోవడం మొదలెట్టింది. కొత్త అంపైర్లను తీసుకునే నియామక ప్రక్రియలో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని భావించింది. అందుకే గ్రూప్-డి అంపైరింగ్ నియమాకాల కోసం (మహిళలు, జూనియర్ మ్యాచులు) బీసీసీఐ రాత పరీక్ష నిర్వహించింది. 200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో క్వాలిఫికేషన్ మార్కులు 90. 200 మార్కుల్లో.. రాత పరీక్షకు 100 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకి 35 మార్కులు, వీడియో ఇంటర్వ్యూకి 35 మార్కులు ఉంటాయి. ఫిజికల్ టెస్టుకి మిగిలిన 30 మార్కులు ఉంటాయి. అయితే అంపైర్ల నియామకాల కోసం బీసీసీఐ నిర్వహించిన రాతపరీక్షలో కొన్ని పిచ్చిప్రశ్నలతో అభ్యర్థులను విసిగించింది. రాత పరీక్షలో ప్రశ్నలన్నీ కఠినంగా ఉన్నప్పటికి.. కొన్ని మాత్రం వింతగా ఉండడంతో ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి కొన్ని ప్రశ్నలు మీకోసం.. చదివేయండి. ►పెవిలియన్‌లో ఫ్లడ్ లైట్స్‌తో పాటు స్టేడియం స్టాండ్స్ నీడ పడడం సహజం. అలాగే ఫీల్డర్ నీడ కూడా పిచ్‌పై పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటర్, అంపైర్‌కి ఫిర్యాదు చేస్తే... ఏం చేస్తారు? ►బౌలర్ గాయపడి చేతికి బ్యాండేజీ కట్టుకున్నాడు. అది నిజమైనది కాదని, మీరు దాన్ని పీకేశారు. అప్పుడు రక్తస్రావం అయ్యింది. మీరేం చేస్తారు? అతనితో బౌలింగ్ చేయనిస్తారా? ►షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలా ఫీల్డర్ హెల్మెట్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి ఇరుక్కుని, దాన్ని ఫీల్డర్ క్యాచ్‌గా పట్టుకుంటే అది ఔట్‌గా పరిగణిస్తారా? పైన చెప్పుకున్నవి కేవలం సాంపుల్.. ఇలాంటి వింత ప్రశ్నలు మరో 37 ఉన్నాయి. గత నెల అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 140 మంది హాజరయితే పరీక్ష రాయగా.. అందులో నుంచి ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయనున్నారు.'' ఇది కేవలం క్రికెట్ రూల్స్ గురించి మాత్రమే కాదు. భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక అంపైర్ సమయోచితంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడనేది ముఖ్యం. అది తెలుసుకునేందుకు ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాం'' అని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. -
నేడు లేదా రేపు ‘సచివాలయ’ ఫలితాలు
సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు. భర్తీ చేస్తున్న మొత్తం 19 రకాల ఉద్యోగాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, రూరల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వారి సర్వీస్ కాలం ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఉంటాయని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. అందులో రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. దీంతో గురువారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తయితే, సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్చార్జి మంత్రులతో గ్రామ సచివాలయాలు ప్రారంభం అక్టోబరు 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే గ్రామ సచివాలయాల కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఏదో ఒక మండలంలోని ఒక గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిపించాలని అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి తగిన ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా అధికారులను బుధవారం ఆదేశించారు. -
నిర్మలా సీతారామన్‌కు సీఎం థ్యాంక్స్
సాక్షి, బెంగుళూరు : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉద్యోగ నియామక పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. కొన్ని నిర్దిష్ట పోస్టులకు ఇంగ్లీష్, హిందీ కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ప్రాంతీయ బ్యాంకులు ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు స్కేల్-1 ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షను కూడా స్థానిక భాషలో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయంపై కుమారస్వామి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
సజావుగా పీహెచ్డీ రాత పరీక్ష
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్స్‌ట్రర్నల్ పీహెచ్డీ, అనుబంధ ఇంజినీరింగ్ కంగీళాశాలల్లోని రీసెర్చ్ సెంటర్లలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్ష ఆదివారం సజావుగా నిర్వహించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్ తెలిపారు. ఫిజిక్స్‌కు సంబంధించి 34 మంది అభ్యర్థులు, ఇంగ్లిషు 48, సీఎస్ఈ 696, కెమిస్ట్రి 46, ఈసీఈ 617, మేనేజ్మెంట్ 99, మెకానికల్ 584, సివిల్ 187, ఈసీఈ 453, మేథమేటిక్స్ 62, ఫార్మసీ 220 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్ . కృష్ణయ్య పరిశీలించారు. -
27న ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష
అనంతపురం సెంట్రల్ : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల భర్తీకి ఈనెల 27న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రహ్లాదరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో 20 సెంటర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ పరీక్షలకు దాదాపు 10,260 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష
కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ త్రివిక్రమ వర్మ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఒంగోలు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన రాత పరీక్షకు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జడ్.రమేష్‌బాబు కన్వీనర్‌గా వ్యవహరించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జిల్లాలో 43 కేంద్రాల్లో నిర్వహించారు. 54 మంది అబ్జర్వర్లు, ఆరు స్క్వాడ్ బృంధాలతో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పోలీసులు ప్రత్యేకంగా ఐదు బస్సులను ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, నెల్లూరు బస్టాండ్ సెంటర్, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్, అద్దంకి బస్టాండ్ సెంటర్లలో బస్సులను ఉదయం నుంచే ఏర్పాటు చేశారు. నగర శివారుల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులను బస్సుల ద్వారా చేరవేశారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవటంతో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
పీఈటీల ఎంపిక పారదర్శకంగా జరగలేదు
అభ్యర్థుల ఆందోళన స్పందించిన అధికారులు నియామకాల రద్దు 5న రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయం గాంధారి : గిరిజన బాలుర గురుకుల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు పారదర్శకంగా జరగలేదని అభ్యర్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐదు గిరిజన గురుకుల పాఠశాలల కోసం మండల కేంద్రంలో గల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం కోసం వైవా నిర్వహించారు. ఐదు పీఈటీ పోస్టులకు కోసం 170 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైవా నిర్వహించి ఐదు పోస్టులకు గాను 15 మందిని ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. అయితే నియామకాలు పారదర్శకంగా జరగలేదని జాబితాలో పేర్లు లేని అభ్యర్థులు ఆందోళన చేశారు. పాఠశాల నోడల్ ప్రిన్సిపాల్ బలరాం నాయక్‌తో వాగ్వాదానికి దిగారు. నియామకాలు రద్దు చేసి రాత పరీక్ష నిర్వహించి అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో రిటైర్డ్ పీడీ మన్నాన్, మరో పీడీ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో ప్రిన్సిపాల్ అభ్యర్థులకు నచ్చజెప్పి నోడల్ జిల్లా సమన్వయ అధికారి చంద్రశేఖర్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించారు. స్పందించిన డీసీవో అభ్యర్థుల కోరిక మేరకు పీఈటీల నియామకాలను రద్దు చేసి ఈనెల 5న రాత పరీక్ష నిర్వహించాలని సూచించారు. దీంతో నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించగా అభ్యర్థులు ఆందోళన విరమించారు. నియామకాలను కన్వీనర్ గంగాధర్, ఏడీసీవో కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు నోడల్ ప్రిన్సిపాల్ తెలిపారు. -
రేపే ఎస్ఐ రాత పరీక్ష
హాజరుకానున్న రెండు లక్షల మంది పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి: రిక్రూట్మెంట్ బోర్డు గెజిటెడ్ సంతకం తప్పనిసరి అంటున్న అధికారులు వరుస సెలవులతో సంతకం దొరక్క ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: పోలీసు కొలువులకు తొలి అడుగు పడనుంది. సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ విభాగాల్లోని 539 ఎస్ఐ పోస్టులకు దాదాపు రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పోలీసు శాఖ తొలిసారిగా నిర్వహించనున్న ఈ పరీక్ష పారదర్శకంగా జరిగేలా రిక్రూట్మెంట్ బోర్డు పటిష్ట చర్యలు తీసుకుంది. ఎలాంటి అవకతవకల్లేకుండా చూసేందుకు అభ్యర్థుల వేలిముద్రలు స్వీకరిస్తోంది. ఇందుకోసం అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు సూచించింది. అలాగే పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.. ఎస్ఐ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటో అటెండెన్స్ తీసుకునేందుకు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. దీని ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని బోర్డు భావిస్తోంది. వేలిముద్రలు తీసుకోవడం ద్వారా తదుపరి జరిగే దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్షల్లో వేలిముద్రలను సరిపోల్చనున్నారు. దీంతో అక్రమార్కులకు చెక్ పెట్టొచ్చని ఆలోచిస్తోంది. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకోవడానికి ఒక యాప్‌ను సైతం రూపొందించి సేవలందిస్తోంది. ఎండల తీవ్రత భారీగా ఉండటంతో అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎండ వేడిమి కాారణంగా అభ్యర్థులకు ఏదైనా ఆపద తలెత్తితే వెంటనే చికిత్సలు అందేలా అంబులెన్స్ వాహనాలను అందుబాటులో ఉంచుతోంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షకు వచ్చేటప్పుడు అభ్యర్థులు కచ్చితంగా ఆన్లైన్ దరఖాస్తు కాగితాలపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అని సూచిస్తోంది. అయితే ప్రస్తుతం వరుసగా ప్రభుత్వ సెలవులు ఉండటంతో అభ్యర్థులకు గెజిటెడ్ సంతకాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోటిఫికేషన్ సందర్భంగానే ఆన్లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అని పేర్కొంది. అయితే చాలా మంది అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించలేదు. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నియమ నిబంధనల్లో ఈ అంశాన్ని చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష సందర్భంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేటపుడు గెజిటెడ్ సంతకం కోరవచ్చు కదా అని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అయితే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు మాత్రం ప్రిలిమినరీ పరీక్షకు వచ్చేటప్పుడు గెజిటెడ్ సంతకం తప్పనిసరి చేసుకుని రావాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. -
'నిరుద్యోగులకు కానిస్టేబుల్ రాతపరీక్ష'
నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం జరిగిన పరీక్షా కేంద్రాలను రాములు నాయక్ మెదక్ డీఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు. -
ఇంటర్వ్యూలో అభ్యర్థి అడగకూడని అంశాలు
జాబ్ స్కిల్స్: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ స్థాయిల్లో నెగ్గి మౌఖిక పరీక్షకు పిలుపు అందుకుంటే కొలువు కల సగం నెరవేరినట్లే. అయితే ఇంటర్వ్యూ అంత సులువేమీ కాదు. ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా అవకాశం చేజారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి సంస్థ/ఉద్యోగం గురించి అభ్యర్థులు అడిగే ప్రశ్నలే కొత్త చిక్కులు తెచ్చిపెడతాయి. అలా అని అడగకుండా ఉంటే సంస్థ గురించి కనీస అవగాహన లేదనుకునే అవకాశం ఉంది. కాబట్టి జాబ్ ఇంటర్వ్యూలో అడగకూడని ప్రశ్నలు... ఇంటర్వ్యూల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి అభ్యర్థులు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందే. అందులో భాగంగా ఇంటర్వ్యూ యర్లు అడిగే ప్రశ్నలకు ఏ సమాధానాలు చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే అంశాలే ప్రధానం. వాటి ఆధారంగానే అభ్యర్థుల పరిజ్ఞానం, వ్యక్తిత్వం, అంకితభావాన్ని అంచనా వేస్తారు. అయితే ఒక్కోసారి ఇంటర్వ్యూ చేసే వారే.. ‘ఏమైనా అడగాలనుకుంటున్నారా?’ అని అభ్యర్థులను ప్రశ్నిస్తారు. ఆ సమయంలో అడగకూడని అంశాలను ప్రస్తావిస్తే కొలువు చేజారే ఆస్కారం ఉంది. కంపెనీ ఏం చేస్తుంది? ఉద్యోగంలో చేరాలనుకుంటున్న కంపెనీ కార్యకలాపాలు, ఉత్పాదకత గురించి ప్రాథమిక అవగాహన లేని వారు అడిగే ప్రశ్న ఇది. ఒక వేళ ఈ ప్రశ్నను అభ్యర్థి ఇంటర్వ్యూ సమయంలో అడిగితే నూటికి 90 శాతం అవకాశం చేజారినట్టే. ఎందుకంటే తమ కంపెనీలో చేరాలనుకునే అభ్యర్థులకు సంస్థ గురించి కనీస సమాచారం, దాని లక్ష్యాలు తెలుసుకుని ఉండాలని ఇంటర్వ్యూయర్ భావిస్తారు. కాబట్టి మౌఖిక పరీక్షకు ముందుగానే సంస్థ గురించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. చేరాలనుకుంటున్న ఉద్యోగ విధులపై అవగాహన ఏర్పరచుకోవాలి. వేతనం ఎంత చెల్లిస్తారు? ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు ఎంత వేతనం ఆశిస్తున్నారనే దాన్ని ఇంటర్వ్యూ మేనేజర్లే అడుగుతారు. అభ్యర్థుల ప్రతిభ, నిజాయతీకి ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది అభ్యర్థులు ఎంతవేతనం చెల్లిస్తారని ప్రశ్నించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వారే వేతన విషయాన్ని ప్రస్తావించే వరకు ఓపిగ్గా ఉండాలి. ఎన్ని రోజులు సెలవులు లభిస్తాయి? ఇంటర్వ్యూలో అడగకూడని ముఖ్యమైన ప్రశ్న ఇది. అభ్యర్థులు ఉద్యోగం కంటే సెలవులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే భావనను ఈ ప్రశ్న ఏర్పరుస్తుంది. అంతే కాకుండా అభ్యర్థులను పనిపై శ్రద్ధ లేనివారిగా, సోమరులుగా భావిస్తారు. అయితే కొలువు ఖరారైన తర్వాత లేదా ఆఫర్ లెటర్ చేతికి అందిన తర్వాత అడగొచ్చు. ప్రశంసలొద్దు.. కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఇంటర్వ్యూయర్‌తో ‘యు ఆర్ గ్రేట్’, ‘మీ చొక్కా చాలా బాగుంది’ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇంటర్వ్యూ చేసే వారిని మొదటిసారి కలిసినప్పుడే పొగ డటం సరైన విధానం కాదు. సొంత ప్రయోజనాలను ఆశించి ప్రశంసిస్తున్నారని భావించే అవకాశం ఉంది. నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఇటీవల కాలంలో సంస్థ సాధించిన విజయాలను ప్రస్తావించి ఇంటర్వ్యూయర్‌ను ఆకట్టుకోవచ్చు. ప్రశ్నించడానికి ఏం లేదు. ఇంటర్వ్యూలో ‘ఏమైనా అడగాలనుందా?’ అని అభ్యర్థులనే ప్రశ్నించినప్పుడు చాలా మంది ‘ఐ డోంట్ హావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ యు’ అని చెబుతుంటారు. ఇలా చెప్పడం వల్ల అభ్యర్థులకు ఉద్యోగంపై అంతగా ఆసక్తి లేదని, కంపెనీ గురించి ఏమాత్రం పరిశోధించలేదని అనుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అడగడానికి కొన్ని ప్రశ్నల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఏం లేవనుకుంటే ‘మీ కంపెనీలో పనిచేయడానికి ఏ విభాగం ఉత్తమమైంది?’ అని ప్రశ్నించొచ్చు.