పీఈటీల ఎంపిక పారదర్శకంగా జరగలేదు
-
అభ్యర్థుల ఆందోళన
-
స్పందించిన అధికారులు
-
నియామకాల రద్దు
-
5న రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయం
గాంధారి : గిరిజన బాలుర గురుకుల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు పారదర్శకంగా జరగలేదని అభ్యర్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐదు గిరిజన గురుకుల పాఠశాలల కోసం మండల కేంద్రంలో గల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం కోసం వైవా నిర్వహించారు. ఐదు పీఈటీ పోస్టులకు కోసం 170 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైవా నిర్వహించి ఐదు పోస్టులకు గాను 15 మందిని ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. అయితే నియామకాలు పారదర్శకంగా జరగలేదని జాబితాలో పేర్లు లేని అభ్యర్థులు ఆందోళన చేశారు. పాఠశాల నోడల్ ప్రిన్సిపాల్ బలరాం నాయక్‌తో వాగ్వాదానికి దిగారు. నియామకాలు రద్దు చేసి రాత పరీక్ష నిర్వహించి అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో రిటైర్డ్ పీడీ మన్నాన్, మరో పీడీ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో ప్రిన్సిపాల్ అభ్యర్థులకు నచ్చజెప్పి నోడల్ జిల్లా సమన్వయ అధికారి చంద్రశేఖర్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించారు. స్పందించిన డీసీవో అభ్యర్థుల కోరిక మేరకు పీఈటీల నియామకాలను రద్దు చేసి ఈనెల 5న రాత పరీక్ష నిర్వహించాలని సూచించారు. దీంతో నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించగా అభ్యర్థులు ఆందోళన విరమించారు. నియామకాలను కన్వీనర్ గంగాధర్, ఏడీసీవో కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు నోడల్ ప్రిన్సిపాల్ తెలిపారు.