
న్యూఢిల్లీ: యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
తాజాగా దుర్గ్(ఛత్తీస్‌గఢ్) నుండి చాప్రా(బీహార్) వరకూ, అలాగే చాప్రా నుండి దుర్గ్ వరకు నడిచే సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ దుర్గ్-చాప్రా సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 21 వరకు రద్దు చేశారు. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళదామనుకున్న ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ రైలు ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారి డబ్బును రైల్వేశాఖ వారి ఖాతాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో భారీ రద్దీని తగ్గించడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇదేవిధంగా రైలు నంబర్ 55098/55097 గోరఖ్‌పూర్-నర్కటియగంజ్ ప్యాసింజర్ రైలును ఫిబ్రవరి 23 వరకు రద్దుచేశారు. అలాగే రైలు నంబర్ 15080 గోరఖ్‌పూర్-పాటిలీపుత్ర ఎక్స్‌ప్రెస్ కూడా ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు. మహాశివరాత్రికి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకున్న భక్తులకు ఈ వార్త షాక్‌లా తగిలింది. మరోవైపు జయనగర్ నుండి ప్రయాగ్‌రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్‌ను మార్చారు. ఈ రైలు ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్ళదు. బీహార్, ఛత్తీస్‌గఢ్‌ల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళుతున్నారు. దీంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది.
ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా?
Comments
Please login to add a commentAdd a comment