ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష
-
కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ త్రివిక్రమ వర్మ
-
అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు
ఒంగోలు క్రైం:
పోలీస్ కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఒంగోలు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన రాత పరీక్షకు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జడ్.రమేష్‌బాబు కన్వీనర్‌గా వ్యవహరించారు. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జిల్లాలో 43 కేంద్రాల్లో నిర్వహించారు.
54 మంది అబ్జర్వర్లు, ఆరు స్క్వాడ్ బృంధాలతో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పోలీసులు ప్రత్యేకంగా ఐదు బస్సులను ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, నెల్లూరు బస్టాండ్ సెంటర్, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్, అద్దంకి బస్టాండ్ సెంటర్‌లలో బస్సులను ఉదయం నుంచే ఏర్పాటు చేశారు. నగర శివారుల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులను బస్సుల ద్వారా చేరవేశారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవటంతో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు.