
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు తేలింది.
అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్‌పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్‌కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్‌నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్‌బార్–ఇ–తలీం టీచర్‌గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment