links
-
సైబర్ నేరగాళ్ల ‘పెళ్లి పిలుపులు’!
సాక్షి, హైదరాబాద్: సీజన్‌కు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరదీస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇదే అంశాన్ని వారికి అనుగుణంగా మల్చుకుని కొత్త దందా మొదలుపెట్టారు. వాట్సాప్ మెసేజ్‌లలో పెళ్లి పత్రికల పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్స్‌ను క్రియేట్ చేసి పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి ఆహ్వాన పత్రికల పేరిట ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి ఫైల్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవడంతోపాటు మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల జాబితా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. దీంతో ఫోన్‌ను హ్యాక్ చేసి వారి చేతుల్లోకి తీసుకుంటారని, తర్వాత మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టడం..డబ్బుల కోసం డిమాండ్ చేయడం వంటి ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఏపీకే ఫైల్స్ వేటిపైనా క్లిక్ చేయవద్దని సూచించారు. ఒక వేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. -
లింక్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్‌ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్‌కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్‌వర్డ్‌ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్‌లు వస్తున్నాయి.హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్‌ల లింక్‌లను వాట్సాప్‌కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్‌ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్‌ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్‌ల కింద ఉన్న బగ్ లింక్‌ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరుఎక్కువగా గ్రూపులకు... మన మొబైల్ నంబర్‌కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్‌ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్నెట్, డార్క్‌నెట్ ఆధారంగా వాట్సాప్‌లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ తరహా మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు. అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్‌లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్‌నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్‌లు, బగ్స్ లింక్‌లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు... మన సెల్‌ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్‌లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్‌పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ కొట్టాలి. ఫోన్లోని ఈ–మెయిల్, పాస్వర్డ్లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్‌పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. ఫోన్‌పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్‌లు అన్ ఇన్స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్‌కు ఎటువంటి మెసేజ్‌లు, లింక్‌లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్‌లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
సందట్లో సైబర్ వల
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు. ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. అఅప్రమత్తం చేస్తున్న బాధితులుఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
న్యూఢిల్లీ: సన్నిహితులైన వ్యాపారవేత్తలతో ఉన్న లింకులపై ప్రశ్నలకు, ఎలక్టోరల్ బాండ్లను దురి్వనియోగం చేయడంపై సమాధానాలు చెప్పుకోలేరు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ సీట్లలో కూటమిని గెలిపించాలని పిలుపిచ్చారు. ఆసక్తికరమైన విషయమేమింటే నేను ఆప్‌కు ఓటేస్తాను, కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు ఓటేస్తారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల పాత్రికేయులకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ తనతో చర్చకు మాత్రం రారని, ఎందుకంటే తన ప్రశ్నలకు సమాధానమివ్వలేనని మోదీకి తెలుసన్నారు. అదానీ– అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ డబ్బు ముట్టిందని ప్రధాని ఆరోపిస్తారు.. కానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం మాత్రం చేయరు అని ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధాని మోదీతో చర్చకు నేను సిద్ధమే. ఆయన రారని నాకు తెలుసు. ఆయన్ను నేనడిగే తొలి ప్రశ్న.. అదానీతో మీకున్న బంధుత్వమేమిటి? రెండో ప్రశ్న... బీజేపీకి అందిన ఎలక్టోరల్ బాండ్ల గురించి’ అని రాహుల్ వివరించారు. మోదీ, రాహుల్‌లు చర్చ చేయాలని ఇద్దరు మాజీ జడ్జిలు, మాజీ సంపాదకుడు ఎన్.రామ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈడీæ అధికారులు అలసిపోయే దాకా 55 గంటల పాటు వారు నన్ను ఇంటరాగేట్ చేసేలా బీజేపీ చేసింది. నా ఇంటిని (ఎంపీ క్వార్టర్‌ను) లాగేసుకున్నారు. నాకు మీ క్వార్టర్ అవసరం లేదని.. మొత్తం దేశమే నా ఇల్లని వారికి చెప్పానని రాహుల్ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీలో చేరుతున్న వారిపై మాట్లాడుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని, పిరికిపందలు తమకు అక్కర్లేదని చెప్పారు. సీబీఐ, ఈడీ దాడులను భయపడి లొంగిపోయే వారు తమకు అవసరం లేదన్నారు. -
విశాఖ డ్రగ్స్: అంతర్జాతీయ లింకులపై సీబీఐ ఆరా.. బ్రెజిల్‌కు స్పెషల్ టీంలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కరీంనగర్‌తో లింకులు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో సూత్రధారిగా భావిస్తోన్న రాజశేఖర్‌రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా లీకేజీ, డబ్బుల వసూలు, లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారంతో రాజశేఖర్‌రెడ్డి బంధువులపై సిట్ సభ్యులు దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో నిపుణుడని గ్రామస్తులు తెలిపారు. అదే అర్హత మీద అతను ఆఫ్గనిస్తాన్ వెళ్లి కొంతకాలంపాటు అక్కడ పనిచేశాడు. తరువాత టీఎస్‌పీఎస్‌లో చేరాక అతని లైఫ్‌స్టైల్ మారిందని అంటున్నారు. ఈ మొత్తం వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్లో ఉన్న అతని బంధువుల వివరాలు, వారి కార్యకలాపాలపై తీగ లాగుతున్నారు. బొమ్మకల్ వాసులే కీలకమా? రాజశేఖర్‌రెడ్డికి కంప్యూటర్ హ్యాకింగ్ కోర్సుపై అవగాహన ఉండే ఉంటుందని, దాని ఆధారంగానే అతను ప్రశ్నపత్రాలు తస్కరించి ఉంటాడని భావిస్తున్న సిట్ బృందం అతని మిత్రుల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకునే పనిలో పడింది. రాజశే ఖర్‌రెడ్డి గతంలో తన బంధువులు ఇద్దరికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించాడని జరుగుతున్న ప్రచారంపై కూడా దృష్టి సారించారు. ఈ మొత్తం వ్యవహారంలో కరీంనగర్‌లోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాజశేఖర్‌రెడ్డికి సహకరించారని తెలిసింది. వారిద్దరే లీకైన ప్రశ్నపత్రాలను కావాల్సిన వ్యక్తులకు అందజేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం తదితర వ్యవహారాలను చక్కదిద్దేవారని సమాచారం. ఉద్యోగార్థుల నుంచి మొత్తం నగదు రూపంలోనే డబ్బులు తీసుకునే వారని, బ్యాంకులు, ఆన్లైన్ లావాదేవీలు అస్సలు అంగీకరించలేదని తెలిసింది. ఆ అధికారి తన బంధువని చెప్పుకునే వాడు! వీరిద్దరే రాజశేఖర్‌రెడ్డికి బినామీలు వ్యవహరించారని, జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ వీరికి పలు ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే, ఈ ఆస్తులు 2017 రాజశేఖర్‌రెడ్డి టీఎస్పీఎస్సీలో చేరిన తరువాత సంపాదించారా? ముందే సమకూర్చుకున్నారా? అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డికి ఓ ఉన్నతాధికారితో దూరపు బంధుత్వం ఉందని, అతని సిఫారసుతోనే తను టీఎస్‌పీఎస్‌లో తాత్కాలిక పద్ధతిన కొలువు సాధించగలిగాడన్న ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. ఆ అధికారిని పలుమార్లు తన బంధువుగా చెప్పుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. చదవండి: లీకేజీలో కేటీఆర్ పీఏ.. -
మెసేజ్ లింక్స్‌తో జాగ్రత్త..!
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పూర్ణిమ(పేరుమార్చడమైనది) ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది. రాత్రి పడుకునే ముందు సోషల్‌మీడియా అకౌంట్స్‌తో పాటు, మెయిల్‌కి వచ్చిన నోటిఫికేషన్స్ చూడటం అలవాటు. వాటిలో తన ఆఫీసు నుంచి, స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లై చేసింది. అదే సమయంలో మరో మెసేజ్ వచ్చింది. గోల్డ్స్కీమ్కి సంబంధించిన సమాచారం అది. ఆసక్తిగా అనిపించడంతో దానిని ఓపెన్ చేసింది. ఆ స్కీమ్‌లో చేరితే తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అది, పేరున్న కంపెనీ వెబ్సైట్ నుంచి వచ్చింది. లిమిటెడ్ టైమ్‌లో వచ్చిన ఆఫర్ అది. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని, అప్లికేషన్లో తన వివరాలను పొందుపరిచి, సెండ్ చేసింది. మిగతావి ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అని ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది. ఉదయం పనిచేసుకుంటూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. వచ్చిన బ్యాంక్ మెసేజ్‌లు చూసి షాక్ అయ్యింది. యాభై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ అది. నిన్నరాత్రి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. స్కీమ్‌లో చేరినట్టుగా వివరాలు ఇచ్చింది కానీ, బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదు తను. తన డబ్బు మరెలా పోయినట్టు? మెయిల్ ఐడీలో ఉన్న కస్టమర్ కేర్‌కి మెసేజ్ చేసింది. ఫోన్ చేసింది. కానీ, ఎలాంటి సమాచారమూ లేదు. పూర్ణిమ మాదిరే చాలామంది మెసేజ్‌లు లేదా మెయిల్స్‌కు వచ్చిన ఆకర్షణీయమైన పథకాలతో ఉన్న లింక్స్‌ను ఓపెన్ చేయడం, వాటి ద్వారా మోసాలకు గురికావడం అతి సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారిక కంపెనీల నుంచి వచ్చినట్టుగా మెసేజ్ లింక్స్ ఉండటం ప్రధాన కారణం. ఈ రోజుల్లో స్పూఫింగ్ అనేది మన భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రకమైన దాడుల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరం సిద్ధపడాల్సిన సమయం ఇది. పేరున్న కంపెనీల పేరుతో అధికారిక వెబ్సైట్లనుంచి వచ్చినట్టు మెసేజ్‌లు మెయిల్స్‌కు వస్తుంటాయి. అయితే, వాటిలో ఏవి కరెక్ట్ అనేది పెద్ద సంశయం. ఇలాగే, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీ, లాగిన్ ద్వారా మోసగాళ్లు మన సమాచారాన్ని బయటపెట్టేలా చూస్తుంటారు. లాటరీ వచ్చింది, డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ వివరాలు ఇవ్వమని అడగడం, ఓటీపీ చెప్పమని కోరడం, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర సంస్థ నుండి ఫోన్ కాల్స్ చేస్తుంటారు. ఈ కాల్స్ ద్వారా బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని మనం బయటపెట్టేలా మోసం చేసే అవకాశం ఉంది. మనలో నమ్మకాన్ని కలిగించడానికి సులువైన, ఆకర్షణీయమైన పద్ధతులను మోసగాళ్లు ఎంచుకుంటారు కాబట్టి, మనమే జాగ్రత్త వహించాలి. ఇ–మెయిల్ ద్వారా.. ఫేక్ మెయిల్ ఐడీతో మన ఇన్‌బాక్స్‌లో ఓ మెసేజ్ వస్తుంది. అది వేరొకరి నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఫిషింగ్ దాడులలో ఉపయోగించబడుతుంది, ఇక్కడ దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్ లోడ్ చేయడానికి, మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ♦ పంపినవారి ఇ–మెయిల్ చిరునామా అనుమానాస్పదంగా ఉండచ్చు. ఉదాహరణకు.. మనకు వచ్చిన ఫేక్ మెయిల్ ఐడీలో లెక్కకు మించి, అక్షర దోషాలు లేదా వింత భాష ఉండచ్చు. గమనించాలి. ♦మోసపూరిత ఇ–మెయిల్లు ఎలా ఉంటాయంటే.. తరచుగా క్రెడిట్ కార్డ్ నంబర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేదా పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు కోరుతుంటాయి. ♦ ఇ–మెయిల్లోని అనుమానాస్పద లింక్‌లు చట్టబద్ధమైన వెబ్సైట్లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కి దారితీయవచ్చు. లేదా అవి అసాధారణమైన అక్షరాలను కలిగి ఉండవచ్చు. లేదా వేరే వెబ్‌సైట్‌కి దారి మళ్లించవచ్చు. ఫోన్ ద్వారా దాడులు ♦ ఫోన్ ద్వారా దాడులకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. వీరు వినియోగదారుడిని రకరకాల ఆకర్షణీయ పథకాల ద్వారా అతని వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ♦ మీ ఫోన్‌కి బయటి దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి. ♦ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కాల్స్ వచ్చినా, పగలు లేదా రాత్రి అసాధారణ సమయాల్లో మీకు కాల్స్ వచ్చినా, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦మీరు గుర్తించని కంపెనీలు లేదా వ్యక్తుల నుండి అయాచిత కాల్స్‌ను స్వీకరిస్తే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦కాలర్ ఐడీ స్పూఫింగ్ తరచూ క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా సామాజిక భద్రతా నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు ఉంటాయి. ♦ఫోన్ కాల్లో అవతలి వారి మాటల్లో ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా, కాల్ సమయంలో అసాధారణ శబ్దాలు లేదా అంతరాయాలు ఉంటే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ఇలా సురక్షితం... ♦ అపరిచిత ఇ–మెయిల్లు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ♦ బ్రౌజర్ అడ్రస్ బార్లో లాక్ గుర్తు ఉండదు. అడ్రస్ బార్‌పై అక్షరాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటా యి. ఈ చిన్న అక్షరాలను కూడా గమనించాలి. ♦యుఆర్ఎల్ అక్షరాలు సరిగా ఉన్నా డిజైన్లలో కూడా తేడాలు ఉంటాయి. గమనించాలి. ♦బ్యాంక్, డిజిటల్ రెండు రకాల కార్యకలాపాలకు రెండు కారకాల ఫోన్ ప్రమాణీకరణను ప్రారంభించడం శ్రేయస్కరం. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని మహారాష్ట్ర జైళ్ల శాఖను శుక్రవారం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది ట్రయల్ కోర్టు. ఆ కేసులో జీవిత ఖైదు విధించింది. అయితే ఆ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇప్పుడు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ దియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించారు. ఈ మేరకు వాదనలు విన్న అనంతరం ట్రయల్‌కోర్టు తీర్పును కొట్టేస్తూ.. తక్షణమే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కి పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. ఇక కోర్టు తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి స్పందించారు. మేధావి అయిన తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని, జైల్లో ఏడేళ్లు గడిపారని, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం -
5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్‌ను క్లిక్ చేశారంటే అంతే..
హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్‌ను క్లిక్ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్‌ను బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో 5 జీ మొబైల్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్‌వర్క్‌ను అప్డేట్ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు. లింక్ ఓపెన్ చేయరాదు మొబైల్ 5 జీ నెట్‌వర్క్‌కు, బ్యాంక్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబరును 5 జీ నెట్వర్క్ కు అప్డేట్ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్ పంపించి క్లిక్ చేయమంటే స్పందించరాదు. చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో నమ్మితే అంతే సైబర్ వంచకులు ఎయిర్టెల్, జియోతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీల కాల్‌సెంటర్ల పేరుతో ఫోన్ చేస్తారు. సిమ్‌కార్డును 5 జీ కి అప్డేట్ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్‌ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్లు 5 జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. కానీ పాత మొబైల్స్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్ వంచకులు, 4 జీ మొబైల్స్‌ను 5జీ కి అప్డేట్ చేస్తామని కాల్స్ చేయడం మొదలైంది. వాట్సాప్ మెసేజ్, లింక్‌లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్‌ని 5జీ కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. -
కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం
రెండు రోజుల క్రితం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’సినిమా లింక్ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిముషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. కడపలోని ఏడు రోడ్ల కూడలిలోని ఓ మొబైల్ షాపునకు ఇద్దరు యువకులు వచ్చి ఫోన్ కొన్నారు. ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లంపులు చేశారని తేలింది. తెలంగాణలో మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు మెయిల్‌కు ఓ లింక్ వచ్చింది. సిబ్బంది దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకులోని సొమ్ము మాయమైంది. ఇందులో బ్యాంకు సిబ్బందితోపాటు నైజీరియా దేశస్తులను తెలంగాణ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సాక్షి, కడప కార్పొరేషన్/అర్బన్: మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమై పోతోంది. చివరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారాగానీ, నంబర్ల నుంచిగానీ నేరుగా వెబ్సైట లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు మాయమవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడపలోని ఓ బ్యాంకులో నెల రోజుల వ్యవధిలోనే 50 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే... బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. ఇంట్లో భద్రం కాదని అనుమానంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడ కూడా భద్రత ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదు. 2021లో యోనో కేవైసీ, ఫేక్ మనీ యాప్స్, ఫ్లిప్‌కార్ట్ లాటరీ, గిఫ్ట్ మనీ, క్రెడ్ యాప్, ఓటీపీ, ఇన్స్రూె ఓఎల్ఎక్స్, జాబ్, ఏనీ డెస్క్ వంటి వాటి ద్వారా 326 మంది రూ.50.04లక్షలు మోసపోయారు. ఎఫ్ఐఆర్ వరకూ రాని సంఘటనలు చాలానే ఉన్నాయి. ఏఈపీఎస్ ద్వారా కూడా మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు మాసాల్లో దీని ద్వారా మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10వేల వరకూ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు రూపాల్లో ప్రజల వేలిముద్రలు సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బులు దోచేçస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి చేయొద్దు ►కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ►ఎవరైనా క్యాష్ ఇవ్వండి. ఫోన్ పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్రావా పంపితే అమౌంట్ వచ్చినట్లు చూపుతుంది. కానీ మన ఖాతాలో జమ కాదు. ►ఇటీవల హిట్ అయిన సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల మన ఖాతాల్లో డబ్బు మాయమవుతుంది. ►మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ►ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ►ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులు అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. తెలియని కాల్స్, మెయిల్స్‌పై క్లిక్ చేయవద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్‌ను లాక్ చేసుకోవాలి. రుణాలు ఇస్తామని, క్రెడిట్, డెబిట్ కార్డు గడువు తీరిపోయాయని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదు. – దుర్గాప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించవద్దు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు, ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశాం. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – కేకేఎన్ అన్బురాజన్, వైఎస్సార్ జిల్లా ఎస్పీ -
కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం విధుల నుంచి తప్పింది. తాజాగా ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను బుధవారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశామని అధికారులు చెప్పారు. గత 6 నెలల కాలంలో మొత్తంగా 25 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగింనట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రసంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఇద్దరు కుమారులనూ గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగింది. శ్రీనగర్‌లో శాసన మండలి సభ్యుని ఇంట్లో ప్రభుత్వ ఆయుధాలను దొంగిలించిన కానిస్టేబుల్ షౌకత్ ఖాన్‌ను పక్కకు తప్పించారు. చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్ -
రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఆందోళన నేపథ్యంలో సోషల్ మీడియాపై గుర్రుగా ఉన్న కేంద్రం ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీలో హింస తరువాత ట్విటర్ ఖాతాలపై మరింత కన్నేసిన సర్కార్ ఖలీస్తాన్ సానుభూతి పరులతో లేదా పాకిస్తాన్ లింకులున్న ఖాతాలను బ్లాక్ చేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు తాజాగా నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో, "రైతుల మారణహోమం" లాంటి ప్రమాదకర హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్న 250 ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఇటీవల కోరిన కొన్ని రోజుల తరువాత తాజా ఆదేశాలివ్వడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖ నివేదిక మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ఈనోటీసు లిచ్చింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా రైతుల ఆందోళనలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, రైతులను రెచ్చగొడుతున్న పాకిస్తాన్ , ఖలీస్తాన్‌తో సంబంధాలున్న 1,178 ఖాతాలను తొలగించాలని కేంద్రం కోరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. అయితే దీనిపై ట్విటర్ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టిన సమాచారం లేదు. ఇదిలా ఉంటే ట్విటర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా పదవినుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. కౌల్ ఈ జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, బాధ్యతల మార్పిడి సౌలభ్యం కోసం మార్చి వరకు పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్య రాజీనామా చర్చకు దారి తీసింది. అయితే ఈ వివాదానికి ఆమె రాజీనామాకు సంబంధం లేదని భావిస్తున్నప్పటికీ, కొందరు పెద్దల ఒత్తిడితోనే కౌల్ ముందస్తు రాజీనామా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా సుమారు మూడు నెలలకాలంగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఆ మృత్యు బోటుతో కాకినాడకీ లింక్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా నదిలో బోల్తా పడిన బోటు వ్యవహారం కాకినాడకు చేరుకుంది. ఆ పాపంలో మన వాళ్ల భాగస్వామ్యం ఉందనే అపప్రధను మూటగట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదానికి గురైన బోటు ఇక్కడే తయారైందని, దానికి సంబంధించిన డ్రైవర్లు కాకినాడ వారేనని విచారణలో వెలుగు చూస్తుండటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో జిల్లాలో తయారవుతున్న బోట్లుపైనా, డ్రైవర్ల నైపుణ్యంపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజయవాడలో 22 మంది మరణానికి కారణమైన బోటుతోపాటు దాన్ని డ్రైవింగ్ చేసిన వారు కాకినాడకు చెందిన వారేనని, ఇప్పుడు వారంతా బతికే ఉన్నారని, పరారీలో ఉన్నారని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రమాదానికి గురైన బోటు ప్రధాన డ్రైవర్ జి. సూరిబాబు(శ్రీను), అసిస్టెంట్ డ్రైవర్ భైరవస్వామి కాకినాడలోని ఏటిమొగ ప్రాంతానికి చెందిన వారు కావడంతో విచారణ బృందాలు ఇక్కడికొచ్చాయి. ఇప్పటికే ముగ్గురిని విజయవాడలో అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బోటును కాకినాడలో తయారు చేసి, విజయవాడ తీసుకొచ్చామని బోటు యజమాని కొండలరావు విచారణలో చెప్పడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. నైపుణ్యతపై నీలినీడలు... బోట్ల తయారీకి కాకినాడ ఎంతో ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలో అత్యధిక బోట్లు కాకినాడ, ఉప్పాడలోనే తయారవుతాయి. ఆ తర్వాత విశాఖ జిల్లా నక్కపల్లిలో తయారవుతుంటాయి. కానీ కాకినాడలో తయారయ్యే బోట్లుకు మంచి పేరు ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి బోట్లు తయారు చేయిస్తుంటారు. నెలకి 15 బోట్లు వరకు ఇక్కడ తయారవుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడా ప్రతిష్టకు మచ్చ వచ్చేలా ఈ ఘటన వెంటాడుతోంది. సాధారణంగా పర్యాటకం కోసం ఫైబర్ బోట్లను ఎక్కువగా తయారు చేయిస్తారు. ఎన్ని ఎక్కువ పొరలతో (లేయర్) తయారుచేస్తే అంత పటిష్టంగా ఉంటుంది. కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న అత్యాశతో పర్యాటక బోట్ల విషయంలో నాణ్యత లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ. 5 లక్షల్లోపే పర్యాటక ఫైబర్ బోట్లను తయారు చేయిస్తున్నట్టు సమాచారం. ఇవే కొంప ముంచుతున్నాయని పలు ప్రమాదాలకు గురైన బోట్ల ద్వారా తెలుస్తోంది. తాజాగా కృష్ణా నదిలో బోల్తా పడిన బోటు కూడా నాసిరకమనే వాదనలున్నాయి. సదరు బోటు యజమాని తక్కువ ఖర్చుతో ఇక్కడ తయారు చేయించినట్టు విమర్శలొస్తున్నాయి. మత్స్యకారులు వేటకు ఉపయోగించే బోట్లను ఒక్కొక్కటి రూ. 20 లక్షల పెట్టుబడితో తయారు చేయిస్తుండగా, పర్యాటక బోట్లను 2.50 లక్షల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో చేయిస్తున్నారు. దీనిబట్టి పర్యాటక బోట్ల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పర్యాటక బోట్లను 20 మందికి సరిపడే సామర్థ్యంతో తయారు చేయిస్తారు. కానీ బోటు యజమానులు దాన్ని పట్టించుకోకుండా పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. దీంతో అధిక లోడుతో బోటు అదుపు తప్పి ఓ పక్కకు ఒరిగిపోయి తిరగబడిపోతోంది. వీటికి అమర్చిన ఇంజిన్ల విషయంలో అనుమానాలున్నాయి. ఖర్చు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో పాత ఇంజిన్లు అమర్చుతుంటారు. మత్స్యకారుల బోట్లకు ఉపయోగించే ఇంజిన్లను వీటికి వాడటం లేదని తెలుస్తోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ప్రమాదానికి గురవుతున్న పర్యాటక బోట్లకు అనేక లోపాలుంటున్నాయని సమాచారం. అసలీ డ్రైవర్లు శిక్షణ తీసుకున్నారా... సాధారణంగా శిక్షణ లేని డ్రైవర్లు కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కృష్ణాలో బోల్తా పడిన బోటుకు డ్రైవర్లుగా వ్యవహరించిన జి. సూరిబాబు, భైరవస్వామి శిక్షణ తీసుకున్నారా? శిక్షణ తీసుకున్నా విఫలమయ్యారా అన్నది తేలాల్సి ఉంది. డ్రైవర్‌గా కొనసాగాలంటే సాధారణంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో శిక్షణ తీసుకోవాలి. ఏడాది శిక్షణ తర్వాత పరీక్షలో పాసైతే డ్రైవింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని ఆధారంగా చేసుకుని పర్యాటక బోట్లు నడపాలి. శిక్షణ తీసుకున్న డ్రైవర్లే ప్రయాణించే పర్యాటకులకు తగు సూచనలు చేయగలరు. బోటు ఓ పక్కకు ఒరిగినప్పుడు ఏం చేయాలి? దాన్నెలా అదుపు చేయాలనేదానిపై అవగాహన ఉంటుంది. అనధికార సమాచారం ప్రకారం కృష్ణాలో ప్రమాదానికి గురైన బోటు డ్రైవర్లుగా వ్యవహరించిన సూరిబాబు, భైరవస్వామి ఎస్‌ఐఎఫ్‌టీలో శిక్షణ తీసుకోలేదని తెలుస్తోంది. -
ఐఎస్ఐకి ఉగ్ర సంస్థలతో లింకులు
వాషింగ్టన్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, సొంత విదేశాంగ విధానంతో అది ముందుకు వెళుతోందని అమెరికా తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. భారత్, అఫ్గాని స్తాన్ కూడా గతంలో చాలా సార్లు ఐఎస్ఐకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమెరికా తాజా ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి పాక్ దర్యాప్తు సంస్థలకు కీలకమైన సమాచారం అందించేది ఐఎస్ఐనే అని స్పష్టం చేసింది. కీలకమైన సెనెట్ విదేశాంగ సంబంధాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్ మాట్లాడుతూ.. ‘ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేది మాకు స్పష్టంగా తెలుసు’అని కుండబద్ధలు కొట్టారు. ఐఎస్ఐ ఇప్పటికీ తాలిబన్లకు సహాయం అందిస్తోందా? అని సెనెటర్ జో డోనెల్లీ అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పునకు అమెరికా చర్యలు తీసుకుంటు న్నట్టు డన్ఫోర్డ్ చెప్పారు. అయితే బహుముఖ వ్యూహంతోనే పాక్ వైఖరిలో మార్పు తేగలమన్నారు. రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్ కూడా ఐఎస్ఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మరోవైపు ఐఎస్ఐ సొంత విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోందని ఆరోపించారు. పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న కొన్ని గంటలలోనే ట్రంప్ యంత్రాంగం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ నుంచీ సాయం పొందొచ్చు.. పాక్ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయడం మానేస్తే.. భారత్ నుంచి కూడా భారీగా ఆర్థిక సాయాన్ని పొందవచ్చని అమెరికా రక్షణ మంత్రి మాటిస్ చెప్పారు. పాక్ వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, అంతర్జాతీయ సమాజంతో కలసి పనిచేస్తామని చెప్పారు. వారం క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్, దక్షిణాసియా పాలసీని ప్రకటించిన నేపథ్యంలో మాటిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్తాన్‌లోనే కాక దక్షిణాసియాలో స్థిరత్వం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని మాటిస్ చెప్పారు. మరోవైపు వివాదాస్పద ప్రాంతమైన పీఓకేలోంచి చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ వెళ్లడంపై భారత్ అభ్యంతరాలకు అమెరికా మద్దతు తెలిపింది. ప్రస్తుత ప్రపంచీకరణ సమాజంలో ఎన్నో బెల్ట్‌లు, ఎన్నో రహదారులు ఉన్నాయని, వీటికి సంబంధించి ఏ ఒక్కదేశమో నియంతృత్వ వైఖరిని అవలంభించడం కుదరదని మాటిస్ చెప్పారు. -
వాట్సాప్ లింకులు ప్రమాదకరమే!
లండన్: వాట్సప్‌లో ప్రతిరోజూ వివిధ గ్రూపులలో వందలాది మెసేజిలు వస్తుంటారుు. కొంతమంది రకరకాల లింకులు పంపుతుంటారు. ఏవేవో ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడతారు. కానీ, అలా వచ్చిన లింకులన్నింటినీ ఓపెన్ చేసి చూశారో.. మీరు సైబర్ దాడుల బారిన పడటం ఖాయమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లందరినీ ఈ మేరకు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. వాట్సప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈమధ్య వచ్చింది. వాస్తవానికి గూగుల్ ప్లేస్టోర్‌లో వాట్సప్‌ను అప్డేట్ చేసుకుంటే చాలు.. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నారుు. కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోన్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. గ్రూప్ వీడియో కాలింగ్ పేరుతో కూడా కొన్ని లింకులు వస్తున్నాయని, ఇవన్నీ చాలా ప్రమాదకరమని చెప్పారు. -
ట్వీట్ లిమిట్ నుంచి ఫోటోలు, లింక్ లు ఔట్
ట్విట్టర్ లో ట్వీట్ చేయడం ఇక నుంచి మరింత సులభతరం కానుంది. ట్వీట్ లను రాసే 140 క్యారెక్టర్ లిమిట్ నుంచి ఫోటోలను, లింక్స్ ను తప్పించనుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు తెలిపింది. దీంతో సమాచారం ట్వీట్ చేయడానికే మొత్తం 140 క్యారెక్టర్ లిమిట్ ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ట్విట్టర్ ను మరింత సులభతరం చేస్తున్నామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే వెల్లడించారు. కంపెనీ తీసుకునే ఈ నిర్ణయంతో యూజర్లకు మరింత చేరువ కానున్నామని పేర్కొన్నారు. ట్విట్టర్ పెరుగుదలను నిరోధిస్తున్న కొన్ని విండోస్ సమస్యలను పరిష్కరించడానికి తమ దగ్గర చాలా అవకాశాలున్నాయని డోర్సే గత ఫిబ్రవరిలో చెప్పారు. ప్రస్తుతం ట్వీట్ లో 23క్యారెక్టర్లను లింక్ లే ఆక్రమించుకుంటున్నాయి. దీంతో ఆర్టికల్స్ ను షేర్ చేసినప్పుడు, వేరే సమాచారాన్ని పోస్టు చేసినప్పుడు వాటికి స్పందనలు తెలియజేయడం పరిమితం అవుతుందని అభిప్రాయం వ్యక్తమయ్యాయి. ట్విట్టర్ షేర్లు గతేడాది దాదాపు 70శాతం పడిపోయాయి. అయితే బ్లూమ్ బర్గ్ నివేదించిన ఈ రిపోర్టుపై స్పందించడానికి కంపెనీ తిరస్కరించింది. -
ఐఎస్ వలలో బెంగాల్ విద్యార్థులు..
కోలకతా : ఉగ్రవాద భూతం కోరలు చాస్తూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఐసిస్ కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఐసీస్ భావజాలం పట్ల ఆకర్షితులవడం, ఐసిస్‌లో చేరేందుకు వెళుతున్న పలువురు విద్యార్థులు నిఘా వర్గాలకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా కోల్ కతాలో మరో ఘటన వెలుగు చూసింది. వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఇస్టామిక్ స్టేట్ (IS) తో సంబంధాలు కొనసాగుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కనుగొంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులు ఐఎస్ వలలో చిక్కుతున్నట్లు అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థులు ఇస్టామిక్ స్టేట్ ఏజెంట్లు పెడుతున్న ప్రలోభాలకు పడిపోతున్నారని, చివరికి బందీలుగా మారుతున్నారని అధికారులు అంటున్నారు. జిల్లాలో అనుమానితులపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ బృందం.. ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ బృదం భావిస్తోంది.