సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది.
నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది.
కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్‌లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్‌ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment