వాషింగ్టన్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, సొంత విదేశాంగ విధానంతో అది ముందుకు వెళుతోందని అమెరికా తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. భారత్, అఫ్గాని స్తాన్ కూడా గతంలో చాలా సార్లు ఐఎస్‌ఐకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమెరికా తాజా ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి పాక్ దర్యాప్తు సంస్థలకు కీలకమైన సమాచారం అందించేది ఐఎస్‌ఐనే అని స్పష్టం చేసింది. కీలకమైన సెనెట్ విదేశాంగ సంబంధాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. ‘ఐఎస్‌ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేది మాకు స్పష్టంగా తెలుసు’అని కుండబద్ధలు కొట్టారు. ఐఎస్‌ఐ ఇప్పటికీ తాలిబన్లకు సహాయం అందిస్తోందా? అని సెనెటర్ జో డోనెల్లీ అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పునకు అమెరికా చర్యలు తీసుకుంటు న్నట్టు డన్‌ఫోర్డ్ చెప్పారు.
అయితే బహుముఖ వ్యూహంతోనే పాక్ వైఖరిలో మార్పు తేగలమన్నారు. రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్ కూడా ఐఎస్‌ఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మరోవైపు ఐఎస్‌ఐ సొంత విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోందని ఆరోపించారు. పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న కొన్ని గంటలలోనే ట్రంప్ యంత్రాంగం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత్ నుంచీ సాయం పొందొచ్చు..
పాక్ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయడం మానేస్తే.. భారత్ నుంచి కూడా భారీగా ఆర్థిక సాయాన్ని పొందవచ్చని అమెరికా రక్షణ మంత్రి మాటిస్ చెప్పారు. పాక్ వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, అంతర్జాతీయ సమాజంతో కలసి పనిచేస్తామని చెప్పారు. వారం క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్, దక్షిణాసియా పాలసీని ప్రకటించిన నేపథ్యంలో మాటిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అఫ్గానిస్తాన్‌లోనే కాక దక్షిణాసియాలో స్థిరత్వం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని మాటిస్ చెప్పారు. మరోవైపు వివాదాస్పద ప్రాంతమైన పీఓకేలోంచి చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ వెళ్లడంపై భారత్ అభ్యంతరాలకు అమెరికా మద్దతు తెలిపింది. ప్రస్తుత ప్రపంచీకరణ సమాజంలో ఎన్నో బెల్ట్‌లు, ఎన్నో రహదారులు ఉన్నాయని, వీటికి సంబంధించి ఏ ఒక్కదేశమో నియంతృత్వ వైఖరిని అవలంభించడం కుదరదని మాటిస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment