
ఇస్లామాబాద్: మాజీ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ ఫైజ్ హమీద్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసు (హైసింగ్ స్కీమ్)లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చెపట్టినట్లు పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్‌పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆయనపై ఇచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్‌లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
నవంబర్ 8,2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఓనర్ మోయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్‌ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా.. బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులను బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ (కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్) చిఫ్‌గా పనిచేశారు. తర్వాత ఆయన జూన్ 2019 నుంచి 6 అక్టోబర్ 2021 వరకు ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఫైజ్ హమీద్ ఐఎస్‌ఐ 24వ డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందించారు.