
సాక్షి, ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని మహారాష్ట్ర జైళ్ల శాఖను శుక్రవారం ఆదేశించింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది ట్రయల్ కోర్టు. ఆ కేసులో జీవిత ఖైదు విధించింది. అయితే ఆ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇప్పుడు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ దియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించారు.
ఈ మేరకు వాదనలు విన్న అనంతరం ట్రయల్‌కోర్టు తీర్పును కొట్టేస్తూ.. తక్షణమే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కి పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.
ఇక కోర్టు తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి స్పందించారు. మేధావి అయిన తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని, జైల్లో ఏడేళ్లు గడిపారని, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం
Comments
Please login to add a commentAdd a comment