కోలకతా : ఉగ్రవాద భూతం కోరలు చాస్తూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఐసిస్ కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఐసీస్ భావజాలం పట్ల ఆకర్షితులవడం, ఐసిస్లో చేరేందుకు వెళుతున్న పలువురు విద్యార్థులు నిఘా వర్గాలకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా కోల్ కతాలో మరో ఘటన వెలుగు చూసింది.
వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఇస్టామిక్ స్టేట్ (IS) తో సంబంధాలు కొనసాగుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కనుగొంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులు ఐఎస్ వలలో చిక్కుతున్నట్లు అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు.
విద్యార్థులు ఇస్టామిక్ స్టేట్ ఏజెంట్లు పెడుతున్న ప్రలోభాలకు పడిపోతున్నారని, చివరికి బందీలుగా మారుతున్నారని అధికారులు అంటున్నారు. జిల్లాలో అనుమానితులపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ బృందం.. ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ బృదం భావిస్తోంది.