క్రైమ్: పని పేరుతో ఊడిగం చేయించుకున్నారు. నెలల జీతాన్ని పెండింగ్‌లో పెట్టారు. విసిగిపోయిన ఈ టీనేజర్.. బయట వేరే పనులు చేసుకుంటూ కాలం గడిపాడు. ఇంతలో మళ్లీ వచ్చిన ఆ పాత ఓనర్లు.. మళ్లీ పని ఇస్తామని నమ్మబలికారు. నమ్మి వెళ్తే మళ్లీ అదే మోసం ఎదురైంది. తన జీతం తనకు ఇప్పించాలని ఎదురు దిరగడంతో.. దారుణంగా అవమానించారు. ఆ అవమానం భరించలేక ఆ టీనేజర్ ప్రాణం తీసుకున్నాడు.
ముంబై దాదార్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఆరు నెలల పెండింగ్ జీతం కోసం ఓనర్లను ఓ యువకుడు నిలదీయడంతో వాళ్లు ఆగ్రహానికి గురయ్యారు. చితకబాది గుండు కొట్టించి.. నగ్నంగా వీధుల వెంట ఊరేగించారు. ఆ అవమానం భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
బాధితుడి తండ్రి రామ్‌రాజ్ జైస్వార్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. వారణాసి నుంచి వలస వచ్చిన పంకజ్(18) కుటుంబం కామ్‌గర్ నగర్‌లో నివాసం ఉంటోంది. పంకజ్ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. పంకజ్ తండ్రి రామ్‌రాజ్ ఓ ట్రావెల్స్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పదో తరగతి దాకా చదివి స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో పనికి చేరాడు పంకజ్. అయితే ఆరు నెలలుగా ఆ దుకాణం యజమాని డబ్బులు చెల్లించలేదు. దీంతో పని మానేసి.. చిన్నాచితకా పనులు చేసుకుంటూ వెళ్లాడు పంకజ్. ఈ క్రమంలో..
మార్చి నెలలో పాత ఓనర్ సోదరుడు ఒకడు పాన్ షాప్ నడిపించేందుకు పంకజ్ సాయం కోరాడు. పాన్ షాప్‌లో పనికి అంగీకరించిన పంకజ్.. పాత జీతం కూడా ఇప్పించాలని డిమాండ్ చేయడంతో సరే అన్నాడు ఆ వ్యక్తి. అయితే పనిలో కుదిరి నెల దాటినా డబ్బులు చేతిలో పడకపోవడంతో పంకజ్ వాగ్వాదానికి దిగాడు. దీంతో.. ఆ ఓనర్లు ఆగ్రహానికి గురైయ్యారు. యువకుడికి గుండు చేయించి.. ముఖానికి మసి పూసి బట్టలు విప్పదీసి స్థానికంగా ఊరేగించారు. భయంతో ఓ టాయ్‌లెట్‌లోకి వెళ్లి దాక్కున్నాడు పంకజ్. ఆపై..
స్థానికుల సాయంతో ఓ టవల్‌తో ఇంటికి చేరిన పంకజ్.. నేరుగా ఇంటికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తలుపులు తీయకపోయే సరికి స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు తలుపులు బద్ధలు కొట్టి చూసే సరికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పంకజ్. పని మీద పుణేకు వెళ్లిన ఆ తండ్రి.. తిరిగి వచ్చి చూసేసరికి కొడుకు విగతజీవిగా మారడాన్ని తట్టుకోలేకపోయాడు. ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మాత్రం అదొక యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్నారు. అయితే.. స్థానిక మీడియా జోక్యంతో స్పందించిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్ ఇంకా నమోదు కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సమాధానం చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment