సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా నదిలో బోల్తా పడిన బోటు వ్యవహారం కాకినాడకు చేరుకుంది. ఆ పాపంలో మన వాళ్ల భాగస్వామ్యం ఉందనే అపప్రధను మూటగట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదానికి గురైన బోటు ఇక్కడే తయారైందని, దానికి సంబంధించిన డ్రైవర్లు కాకినాడ వారేనని విచారణలో వెలుగు చూస్తుండటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో జిల్లాలో తయారవుతున్న బోట్లుపైనా, డ్రైవర్ల నైపుణ్యంపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజయవాడలో 22 మంది మరణానికి కారణమైన బోటుతోపాటు దాన్ని డ్రైవింగ్ చేసిన వారు కాకినాడకు చెందిన వారేనని, ఇప్పుడు వారంతా బతికే ఉన్నారని, పరారీలో ఉన్నారని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రమాదానికి గురైన బోటు ప్రధాన డ్రైవర్ జి. సూరిబాబు(శ్రీను), అసిస్టెంట్ డ్రైవర్ భైరవస్వామి కాకినాడలోని ఏటిమొగ ప్రాంతానికి చెందిన వారు కావడంతో విచారణ బృందాలు ఇక్కడికొచ్చాయి. ఇప్పటికే ముగ్గురిని విజయవాడలో అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బోటును కాకినాడలో తయారు చేసి, విజయవాడ తీసుకొచ్చామని బోటు యజమాని కొండలరావు విచారణలో చెప్పడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.
నైపుణ్యతపై నీలినీడలు...
బోట్ల తయారీకి కాకినాడ ఎంతో ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలో అత్యధిక బోట్లు కాకినాడ, ఉప్పాడలోనే తయారవుతాయి. ఆ తర్వాత విశాఖ జిల్లా నక్కపల్లిలో తయారవుతుంటాయి. కానీ కాకినాడలో తయారయ్యే బోట్లుకు మంచి పేరు ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి బోట్లు తయారు చేయిస్తుంటారు. నెలకి 15 బోట్లు వరకు ఇక్కడ తయారవుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడా ప్రతిష్టకు మచ్చ వచ్చేలా ఈ ఘటన వెంటాడుతోంది. సాధారణంగా పర్యాటకం కోసం ఫైబర్ బోట్లను ఎక్కువగా తయారు చేయిస్తారు. ఎన్ని ఎక్కువ పొరలతో (లేయర్) తయారుచేస్తే అంత పటిష్టంగా ఉంటుంది. కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న అత్యాశతో పర్యాటక బోట్ల విషయంలో నాణ్యత లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ. 5 లక్షల్లోపే పర్యాటక ఫైబర్ బోట్లను తయారు చేయిస్తున్నట్టు సమాచారం. ఇవే కొంప ముంచుతున్నాయని పలు ప్రమాదాలకు గురైన బోట్ల ద్వారా తెలుస్తోంది. తాజాగా కృష్ణా నదిలో బోల్తా పడిన బోటు కూడా నాసిరకమనే వాదనలున్నాయి.
సదరు బోటు యజమాని తక్కువ ఖర్చుతో ఇక్కడ తయారు చేయించినట్టు విమర్శలొస్తున్నాయి. మత్స్యకారులు వేటకు ఉపయోగించే బోట్లను ఒక్కొక్కటి రూ. 20 లక్షల పెట్టుబడితో తయారు చేయిస్తుండగా, పర్యాటక బోట్లను 2.50 లక్షల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో చేయిస్తున్నారు. దీనిబట్టి పర్యాటక బోట్ల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పర్యాటక బోట్లను 20 మందికి సరిపడే సామర్థ్యంతో తయారు చేయిస్తారు. కానీ బోటు యజమానులు దాన్ని పట్టించుకోకుండా పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. దీంతో అధిక లోడుతో బోటు అదుపు తప్పి ఓ పక్కకు ఒరిగిపోయి తిరగబడిపోతోంది. వీటికి అమర్చిన ఇంజిన్ల విషయంలో అనుమానాలున్నాయి. ఖర్చు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో పాత ఇంజిన్లు అమర్చుతుంటారు. మత్స్యకారుల బోట్లకు ఉపయోగించే ఇంజిన్లను వీటికి వాడటం లేదని తెలుస్తోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ప్రమాదానికి గురవుతున్న పర్యాటక బోట్లకు అనేక లోపాలుంటున్నాయని సమాచారం.
అసలీ డ్రైవర్లు శిక్షణ తీసుకున్నారా...
సాధారణంగా శిక్షణ లేని డ్రైవర్లు కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కృష్ణాలో బోల్తా పడిన బోటుకు డ్రైవర్లుగా వ్యవహరించిన జి. సూరిబాబు, భైరవస్వామి శిక్షణ తీసుకున్నారా? శిక్షణ తీసుకున్నా విఫలమయ్యారా అన్నది తేలాల్సి ఉంది. డ్రైవర్‌గా కొనసాగాలంటే సాధారణంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో శిక్షణ తీసుకోవాలి. ఏడాది శిక్షణ తర్వాత పరీక్షలో పాసైతే డ్రైవింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని ఆధారంగా చేసుకుని పర్యాటక బోట్లు నడపాలి. శిక్షణ తీసుకున్న డ్రైవర్లే ప్రయాణించే పర్యాటకులకు తగు సూచనలు చేయగలరు. బోటు ఓ పక్కకు ఒరిగినప్పుడు ఏం చేయాలి? దాన్నెలా అదుపు చేయాలనేదానిపై అవగాహన ఉంటుంది. అనధికార సమాచారం ప్రకారం కృష్ణాలో ప్రమాదానికి గురైన బోటు డ్రైవర్లుగా వ్యవహరించిన సూరిబాబు, భైరవస్వామి ఎస్‌ఐఎఫ్‌టీలో శిక్షణ తీసుకోలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment