తల్లిదండ్రులు, సోదరుడితో రమ్య, కారుకూరి రమ్య(ఫైల్)
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): ఎట్టకేలకు నీట మునిగిన పడవను బయటకు తీశారు. అందులో మాత్రం కారుకూరి రమ్య(23) మృతదేహం లభించలేదు. పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన పాపికొండల టూరు తీరని విషాధం నింపిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన సెప్టెంబర్ 15 ఇంజినీర్స్ డే రోజున జరగగా సరిగ్గా నేటికి 39 రోజులైంది. రమ్య కుటుంబ సభ్యులు కడసారి చూపుకోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.
హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా భార్య గృహిణి. కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించింది. విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహారయాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి గల్లంతైన రమ్య నేటికీ 39 రోజులైనా ఆచూకీ మాత్రం లభించలేదు. 11 రోజులైనా కన్నబిడ్డ జాడ లభించక పోవడంతో గత నెల 25వ తేదీన సంఘటనా స్థలంలోని గోదావరి వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపించి కర్మకాండలు చేశారు.
మూడు రోజులుగా మరోసారి నీటి మునిగిన పడవను వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం వారి బృందం తీవ్ర ప్రయాత్నాలు చేసింది. మూడు రోజుల కిందట పైకి వచ్చే సమయంలో అదుపు తప్పినా కొంత ప్రయోజనం కనబడింది. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎట్టకేలకు సత్యం బృందం పడవను బయటకు తీసుకురాగలింది. ఆ పడవలో మొత్తం 8 మృతదేహాలు లభించగా అందులో మాత్రం రమ్య మృతదేహం కానరాలేదు. పడవలో మరో 4 మృతదేహాలు ఉన్నాయని వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ఆస్పత్రికి పంపిస్తామని అధికారులు చెప్పడంతో రమ్య కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అంతా రాజమండ్రి ఆస్పత్రి వద్ద రమ్య కడసారి చూపుకు పడిగాపులు కాస్తున్నారు.
దిగాలుగా కుటుంబ సభ్యులు...
మూడు రోజులుగా పడవను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయనే మేరకు రమ్య తల్లిదండ్రులు భూలక్ష్మి–సుదర్శన్‌లతో పాటు వారి కుమారుడు రఘు, మరికొంత మంది వారి కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది రాజమండ్రి వెళ్లారు. అయితే మంగళవారం పడవను బయటకు తీయగా అందులో రమ్య మృతదేహం లేకపోవడంతో ఇన్నాళ్లు నిరీక్షణ కన్నా ఈ రోజు తమ కుమార్తె ఆచూకీ లభిస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. రాత్రి కావడంతో పడవను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెప్పడంతో మరో చికటి గడచి తెల్లవారితే కానీ తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment