బ్యాంకుల పేరుతో ఫేక్ మెసేజ్‌లు
వాట్సాప్‌లకు మోసపూరిత ఏపీకే లింకులు పంపుతున్న హ్యాకర్లు
వాటిని టచ్ చేస్తే హ్యాకర్ల చేతుల్లోకి మన సెల్‌ఫోన్
మన నంబర్ల నుంచే వాట్సాప్ గ్రూపుల్లోకి మోసపూరిత లింక్‌లు...
వాటిపై క్లిక్ చేసి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్యాంకు ఖాతాల్లోని నగదు ఖాళీ
బ్యాంకుల పేరుతో వాట్సాప్‌కు వచ్చే ఏ ఫైళ్లను నమ్మవద్దని బ్యాంకర్ల సూచన
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్‌ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు.
ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్‌కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్‌వర్డ్‌ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్‌లు వస్తున్నాయి.
హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్‌ల లింక్‌లను వాట్సాప్‌కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్‌ఫోన్‌లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్‌ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్‌ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు.
అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్‌ల కింద ఉన్న బగ్ లింక్‌ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరు
ఎక్కువగా గ్రూపులకు...
మన మొబైల్ నంబర్‌కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్‌ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్‌నెట్, డార్క్‌నెట్ ఆధారంగా వాట్సాప్‌లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఈ తరహా మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది.
మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు.
అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్‌లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్‌నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్‌లు, బగ్స్ లింక్‌లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు.
ఇలా చేస్తే మేలు...
మన సెల్‌ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్‌లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్‌పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ కొట్టాలి. ఫోన్‌లోని ఈ–మెయిల్, పాస్‌వర్డ్‌లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్‌పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి.
ఫోన్‌పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్‌లు అన్ ఇన్‌స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్‌కు ఎటువంటి మెసేజ్‌లు, లింక్‌లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్‌లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment