వాట్సాప్‌లో డాట్ ఏపీకే ఫైల్‌తో నకిలీ ఆహ్వానాలు
పెళ్లిపత్రిక అనుకుని టచ్ చేస్తే అంతే సంగతులు
మొబైల్‌లోని డాటా మొత్తం హ్యాకర్ల కంట్రోల్లోకి
ఆపై ఖాతాలో డబ్బులుంటే హ్యాకర్లపాలే
పలమనేరు: గతంలో ఎవరిదైనా వివాహ శుభకార్యమైతే ఇళ్లకు వెళ్లి పెళ్లిపత్రికలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. అన్నింటికీ స్మార్ట్ ఫోనే దిక్కుగా మారింది. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులకు పంపుతున్నారు.
వెడ్డింగ్ కార్డు కాబట్టి తప్పకుండా వాట్సాప్‌లో వచ్చిన మెసేజీని టచ్ చేసి చూడాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంలా మారింది. ఆయా ప్రాంతాల్లో బాగా తెలిసిన వారి పెళ్లి డిటిటల్ కార్డును హ్యాకర్లు డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని డాట్ ఏపీకే ఫైల్‌గా మార్చి వేలాదిమందికి వాట్సాప్‌లో పంపుతున్నారు.
కచ్చితంగా చూడాలి కాబట్టి మనం ఆ మెసేజ్‌ను టచ్ చేశామో అంతే సంగతులు. మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లి మన వ్యక్తిగత డేటా, మన బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు స్కామర్లకు చేరిపోతోంది.
వెలుగు చూసిందిలా...
చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని నంగిళిలో ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కార్డులను మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయించి దాన్ని బంధువులకు, స్నేహితులకు వాట్సాప్‌కు పంపారు. దీన్నే కొందరు హ్యాకర్లు కాపీ చేసి అందులో డాట్ ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) ఫైల్‌ను సెట్‌చేసి పలువురి మొబైళ్లకు పంపారు. దీన్ని ఓపెన్ చేసినవారి ఫోన్లలోకి డాట్ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అయి వారి మొబైళ్లు హ్యాక్ అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న కొందరు మొబైల్‌లో డాట్ ఏపీకే ఫైల్‌ను రీసెట్ చేయడం ద్వారా మెయిల్, పాస్‌వర్డ్ మార్చుకుని టూస్టెప్ వ్యాలిడేషన్ చేసుకుని ఆపై డిలీట్ చేసుకున్నారు. మరికొందరి ఖాతాల్లోంచి దాదాపు 1.60లక్షల దాకా పోగొట్టుకున్నట్టు తెలిసింది. దీంతో కొందరు బాధితులు మాత్రం సైబర్‌సెల్‌కు సెల్‌ఫోన్ ద్వారానే ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పోయిన నగదు వారికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment