ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
ఇదే అదనుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు
ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింకులు
వాటిని ఓపెన్ చేస్తే చాలు ఖాతాలు ఖాళీ
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు.
ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు.
అఅప్రమత్తం చేస్తున్న బాధితులు
ఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment