ట్విట్టర్ లో ట్వీట్ చేయడం ఇక నుంచి మరింత సులభతరం కానుంది. ట్వీట్ లను రాసే 140 క్యారెక్టర్ లిమిట్ నుంచి ఫోటోలను, లింక్స్ ను తప్పించనుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు తెలిపింది. దీంతో సమాచారం ట్వీట్ చేయడానికే మొత్తం 140 క్యారెక్టర్ లిమిట్ ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ట్విట్టర్ ను మరింత సులభతరం చేస్తున్నామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే వెల్లడించారు. కంపెనీ తీసుకునే ఈ నిర్ణయంతో యూజర్లకు మరింత చేరువ కానున్నామని పేర్కొన్నారు.
ట్విట్టర్ పెరుగుదలను నిరోధిస్తున్న కొన్ని విండోస్ సమస్యలను పరిష్కరించడానికి తమ దగ్గర చాలా అవకాశాలున్నాయని డోర్సే గత ఫిబ్రవరిలో చెప్పారు. ప్రస్తుతం ట్వీట్ లో 23క్యారెక్టర్లను లింక్ లే ఆక్రమించుకుంటున్నాయి. దీంతో ఆర్టికల్స్ ను షేర్ చేసినప్పుడు, వేరే సమాచారాన్ని పోస్టు చేసినప్పుడు వాటికి స్పందనలు తెలియజేయడం పరిమితం అవుతుందని అభిప్రాయం వ్యక్తమయ్యాయి. ట్విట్టర్ షేర్లు గతేడాది దాదాపు 70శాతం పడిపోయాయి. అయితే బ్లూమ్ బర్గ్ నివేదించిన ఈ రిపోర్టుపై స్పందించడానికి కంపెనీ తిరస్కరించింది.