
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఇన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్ ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము బుధవారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆయన రాజీనామాను ఆమోదించారు. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శరవేగంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.(కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు)
కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్ సిన్హా ఐఐటీ వారణాసి నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అఫ్జల్ అన్సారీ చేతిలో ఆయన ఓటమి పాలైన విషయం విదితమే. ఇక గతేడాది (ఆగస్టు 5న) ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే.