న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా నియమితులయ్యారు. నిన్నటి వరకు ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేయడం, వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందుకు అంగీకరించడం.. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సరిగ్గా ఏడాది కాలం పూర్తైన రోజే ముర్ము ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం సహా ఎల్జీగా కేంద్ర మాజీ మంత్రి నియామకం వంటి ఆకస్మిక పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.(చైనా జోక్యాన్ని ఖండిస్తున్నాం: భారత్)
తొలి ఎల్జీగా జీసీ ముర్ము
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము.. జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం అడిషనల్ ప్రిన్స్‌పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2019 నవంబర్ 30 న పదవీ విరమణ చేసిన ఆయన అదే ఏడాది అక్టోబరులో జమ్మూ కశ్మీర్ ఎల్జీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఆ పదవిలో కొనసాగిన ముర్ము సాయంత్రానికి తన విధులకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం రద్దు చేసుకున్నారు. ఆ వెనువెంటనే రాజీనామాను సమర్పించారు. మరుసటి రోజే ఆయన స్థానంలో సీనియర్ నాయకులు, బీజేపీ మాజీ ఎంపీ మనోజ్ సిన్హా నియామఖం ఖరారైంది. (జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా)
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్జీగా నియమితులైన మనోజ్ సిన్హాకు శుభాకాంక్షలు తెలిపానన్న ఆయన.. తనకున్న రాజకీయ, పాలనా అనుభవంతో సిన్హా ఆ పదవికి మరింత వన్నె తీసుకువస్తారని పేర్కొన్నారు. దీంతో జమ్మూ కశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే కేంద్ర సర్కారు ఈ మేరకు పావులు కదిపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జీగా పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల్లోకి చొచ్చుకుపోయే స్వభావం కలిగిన నాయకుడిని ఎంపిక చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు)
అందుకే ముర్ము రాజీనామా చేశారా?
మరోవైపు.. రాజకీయ ప్రయోజనాల కోసమే సిన్హా నియామకం జరిగిందని పలువురు భావిస్తున్నపటికీ.. ఇటీవల ముర్ము చేసిన వ్యాఖ్యలే ఆయన పదవికి ఎసరు తెచ్చాయని మరికొందరు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ముర్ము మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌లో 4జీ సేవల(ఇంటర్నెట్)ను పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించుకున్నా తాను భయపడబోనని ఆయన పేర్కొన్నారు. కాగా కశ్మీర్‌లో లోయలో ఉగ్రవాదుల వల్ల ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నందున.. కేంద్ర హోం శాఖ ఇందుకు సుముఖంగా లేదని ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అంతేగాక కశ్మీర్ లోయలో రాష్ట్రపతి పాలన కొనసాగింపు భావ్యం కాదని, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని ముర్ము పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలకు తోడు.. స్వయానా ఐఏఎస్ అధికారి అయిన ముర్ముకు ఎల్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్లతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో అభిప్రాయ భేదాలు తీవ్రమయ్యాయని.. అంతేగాక ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఎల్జీ తన ఆఫీసుకు తెప్పించుకుని, అక్కడి నుంచి సీఎస్‌కు నోట్స్ పంపేవారని తెలుస్తోంది. తప్పనిసరిగా తన ఆదేశాలు అమలు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం పరిస్థితి తన చేయి దాటి పోకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్టు జఫర్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘ కశ్మీర్ చాలా సున్మితమైన(బ్యూరోక్రాట్లకు) ప్రదేశం. ఈ కారణంగానే నెహ్రూ హయాంలోనూ సర్దార్ వల్లభబాయ్ పటేల్‌కు కొన్నిసార్లు విభేదాలు తలెత్తాయి. ఇక ముర్ము ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పాలనా విభాగం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరికి కౌంటర్‌గా మరొకరు పనులు చేసేవారు. పాలనా వ్యవస్థలోని అంతర్గత విభేదాలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి’’అని పేర్కొన్నారు.
ఎవరైనా అంతే కదా!
ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక కారణాలు చూపి మాజీ ముఖ్యమంత్రులు సహా పలువురు కశ్మీరీ నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అంతేగాక 400 మందిని అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం వీరిలో కొంతమందిపై ఇంకా నిర్బంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజా పరిణామాల గురించి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా నియమించే వ్యక్తులు వల్ల పెద్దగా తేడా ఉండబోదని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే మార్పులు చేస్తున్నారని విమర్శించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఆందోళనలు ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న అభిప్రాయానికి అద్దం పట్టాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment