‘కానిస్టేబుల్‌’ తుది ఫలితాల వెల్లడి | Constable Final Result Declaration | Sakshi
Sakshi News home page

‘కానిస్టేబుల్‌’ తుది ఫలితాల వెల్లడి

Published Thu, Oct 5 2023 3:45 AM | Last Updated on Thu, Oct 5 2023 3:45 AM

Constable Final Result Declaration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డాయి. అన్ని పరీక్షల అనంతరం పోలీస్‌కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి వివరాలు గురువారం ఉదయం టీఎస్‌ఎల్పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకబోర్డు (టీఎస్‌ఎలీ్పఆర్‌బీ) వెల్లడించింది. మొత్తం 13 కేటగిరీల్లో 16,604 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడగా, దరఖాస్తు చేసుకున్న వారిలో 15,750 మందిని ఎంపిక చేసినట్టు టీఎస్‌ఎలీ్పఆర్‌బీ చైర్మన్‌ వీవీ.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులుకాగా, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ 3, 4 వారాల్లో రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో నిర్వహించిన సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో భాగంగా అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, స్థానికత, వయసు మినహాయింపు, ఇతర అంశాలు పరిశీలించామని, దీంతోపాటు శారీరక సామర్థ్య పరీక్ష, ట్రేడ్‌ టెస్టు, తుది రాత పరీక్ష అనంతరం అన్నింటిని పరిగణనలోకి తీసుకొని వీరిని ఎంపిక చేసినట్టు ఆ ప్రకటనలో శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో 854 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు.  

అటెస్టేషన్‌ ఎలా చేయాలంటే...! 
బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్‌ ఫారం తీసుకోవాలి. టీఎస్‌ఎలీ్పఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్‌ టెంప్లేట్‌ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్‌గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్‌ రూపంలో మూడు సెట్‌లు ప్రింట్‌లు ఏ4 సైజు పేపర్‌పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి.

ఇలా తీసుకున్న మూడు సెట్‌లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్‌పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి ఈనెల 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి.  

సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఈనెల 12న ఎస్పీ/ కమిషనర్‌ కార్యాలయాల్లో,  ఎస్పీఎఫ్, ఎస్‌ఏఆర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్టు (హెచ్‌ఓ) కానిస్టేబుళ్లు ఈనెల 13న హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో,  మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో అటెస్టేషన్‌ ఫారంలు సమర్పించాలి. 

సందేహాల నివృత్తికి అవకాశం 
తుది రాత పరీక్షలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో సందేహాలు, వాటిని నివృత్తికి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల లాగిన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీలు రూ.1000, ఇతరులు రూ.2000 ఫీజు చెల్లించాలి.  కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి వ్యక్తిగత వినతులకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement