న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) వస్తాయి. సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment