regional languages
-
పరిపాలనా సౌలభ్యం కోసమే భాషల ఫార్ములా: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు. అలాగే, భాషలు.. మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయం అని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. 121 భాషలు, మన దేశంలో ఉన్నాయి. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి. మోదీ ప్రభుత్వం వచ్చాకా 21 భాషలకు స్థానం దక్కింది. భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్‌పేయి గారి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారు.జ్ఞానాన్ని ప్రసరింపజేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాష ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు.. దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ 2020లో NEP-2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని కామెంట్స్ చేశారు. -
ప్రాంతీయ భాషలో కస్టమర్ సర్వీస్: ఎయిర్ ఇండియా
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీసును తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు కొత్త భాషలను దాని ఐవీఆర్ సిస్టమ్‌కు జోడించడం ద్వారా కస్టమర్ సపోర్ట్ సేవలను మెరుగుపరిచినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.కొత్త ప్రవేశపెట్టిన ఏడు భాషలలో తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం ఉన్నాయి. ఈ సర్వీస్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఎయిర్ ఇండియా కొత్తగా ఐదు కొత్త కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన సమాచారం కోసం ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. -
‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్ టీవీ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేసే ‘సంసద్ టీవీ’ హిందీలో మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సోమవారం ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా సంసద్ టీవీ స్పందించింది.‘ఎంపీ సుప్రియా సూలే చేసిన ఆరోపణలు సత్యం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలను ఎంపీలు మాట్లాడిన భాషలోనే ప్రసారం చేస్తున్నాం. అయితే వినేవారి సౌలభ్యం కోసం హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషల్లో వినే ఆప్షన్ కల్పించాం. ఎంపీలు కూడా సభలో కూర్చొని.. పార్లమెంట్ కార్యకలాపాలను వినవచ్చు’అని ‘ఎక్స్’లో పేర్కొంది.సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రరంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల ప్రచారంలో సంసద్ టీవీ హిందీ మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపణలు చేశారు.‘పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ తొలి సెషన్లోనే సంసంద్ టీవీ ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలను హిందీ వాయిస్ ఓవర్ ఇస్తోంది. ఇలాంటి భయంకరమైన చర్యలకు సంసద్ టీవీ పాల్పడుతోంది. సంసద్ టీవీ హిందీలో ప్రసంగించని ఎంపీలపై వివక్ష చూపుతోంది. ఇతర భాషలతో పోల్చితే.. ఒక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయటం భారత సమాఖ్యవాదాన్ని సవాల్ చేయటమే...ప్రాంతీయ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలకు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, సెన్సార్షిప్ విధించటం వల్ల హిందీ మాట్లాడనివారి హక్కులను కాలరాయటమే. ప్రభుత్వం వెంటనే ఇలా ప్రసారం చేయటాన్ని నిలిపివేయాలి. ఇది పూర్తి వివక్ష, సమాఖ్యవాద వ్యతిరేక విధానం’అని ఆరోపణలు చేశారు.2023లో కూడా సంసద్ టీవీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడే క్రమంలో అధిక శాతం స్పీకర్‌ను చూపించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వంగా విపక్షాల స్క్రీన్ టైంను సంసద్ టీవీ తగ్గించి ప్రసారం చేసినట్లు ఆరోపణులు చేశారు. -
ప్రాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) వస్తాయి. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. -
‘దహీ’పై వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
చెన్నై/బెంగళూరు: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్ ‘కర్డ్’కు బదులుగా హిందీలోని ‘దహీ’ముద్రించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కి తగ్గింది. కర్డ్‌ను కొనసాగిస్తూనే పక్కనే సమానార్థం.. తెలుగులో అయితే పెరుగు, కన్నడలో మొసరు, తమిళమైతే తాయిర్ అని ప్రాంతీయ భాషను ముద్రించవచ్చని స్పష్టతనిస్తూ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులుగా హిందీ సమానార్ధం ‘దహీ’ని ముద్రించాలంటూ ఈ నెల 10వ తేదీన ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తమిళనాడు కో ఆపరేటివ్ మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ ‘ఆవిన్’బ్రాండ్‌తో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) నంది బ్రాండ్‌తో పెరుగును విక్రయిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎప్పటిలాగానే తమిళ ‘తాయిర్’నే వాడుతామని, ‘దహీ’అని మాత్రం వాడబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐకి సమాధానమిచ్చింది. అధికార డీఎంకే పార్టీ ‘నహీ టు దహీ’అంటూ ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘దహీ’వివాదంపై తమిళనాడు బీజేపీ విభాగం అభ్యంతరం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్‌తో తీసుకువస్తున్న పెరుగు ప్యాకెట్లపై హిందీ దహీ పక్కన బ్రాకెట్లలో కన్నడ (మొసరు) ముద్రించాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన మార్గదర్శకాలపై రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఈ చర్య కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనన్నారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. -
ప్రాంతీయ భాషల్లో తీర్పులు శుభపరిణామం
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత న్యాయస్థానం తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఇవ్వడం శుభ పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహా వ్యాఖ్యానించారు. అలాగే, కనీసం జిల్లా కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో వాదనలు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో తమ కేసులో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కక్షిదారులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆంగ్లంలో వాదనలు సాగుతుండటంతో చాలామంది కేసు గురించి అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ‘బార్ అండ్ బెంచ్’ సంబంధాలపై హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ)ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి జస్టిస్ నరసింహా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మన సొంత భాషలో న్యాయ విద్యాబోధనకు అవకాశం ఇవ్వాలన్నారు. ‘న్యాయవా దులు మన భాష, మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతోపాటే ఆంగ్లంపై కూడా పట్టు సాధించాలి. పెండింగ్ కేసులను మాత్రమే కాదు.. రోజూ నమోదవుతున్న కేసులను కూడా సత్వరం పూర్తి చేయాలి. దీనికి బార్ అండ్ బెంచ్ సమన్వయంతో పని చేయాలి. అన్నదమ్ముల భూ పంచాయతీకి.. భార్యాభర్తల విడాకులకు.. దాదాపు 15 ఏళ్లకుపైగా సమయం పడుతుండటంతో కోర్టులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి’ అని వివరించారు. ఇక్కడి వారికి సుపరిచితుడు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకంగా జస్టిస్ నరసింహా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పుట్టి పెరగ డమే కాదు.. న్యాయవాద వృత్తినీ ఇక్కడే ఆరంభించారు. ఇక్కడి న్యాయవాదులకు ఆయన సుపరిచితుడు. పలు కీలక కేసులను వాదించి సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పేరుతెచ్చుకున్నారు. రాజ్యాంగబద్ధమైన కేసుల్లో విజ యం సాధించి.. న్యాయమూర్తిగా నియమితులయ్యారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు..
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించనుంది. షెడ్యూల్డ్ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషల్లో తీర్పులను ప్రజలు ఉచితంగా పొందొచ్చు. ‘ ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా 34,000 తీర్పులు పొందొచ్చు. వాటిలో ఇప్పటికే 1,268 తీర్పులు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నాయి. తీర్పుల్లో 1091 హిందీలో, 21 ఒడియాలో, 14 మరాఠీ, 4 అస్సామీ, ఒకటి గారో, 17 కన్నడ, ఒకటి ఖాసీ, 29 మలయాళం, 3 నేపాలీ, 4 పంజాబీ, 52 తమిళం, 28 తెలుగు, 3 ఉర్దూ భాషల్లో ఉన్నాయి.‘ గురువారం నుంచి 13 భాషల్లో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్సైట్, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ వెబ్సైట్లో జనవరి 26వ తేదీ నుంచి అందుబాటులో వస్తాయి. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీదాకా వెలువరిచిన తీర్పులను న్యాయవాదులు, లా విద్యార్థులు, సాధారణ జనం అందరూ వీటిల్లో ఉచితంగా చూసుకోవచ్చు’ అని సీజే చెప్పారు. -
కేంద్రానికి కేసీఆర్ లేఖ.. నిరుదోగ్యులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. సీఎం కేసీఆర్ రాసిన లేఖ మేరకు కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, సీఎం కేసీఆర్ నవంబర్ 18. 2020న ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్పూర్తిని కొనసాగించాలని కోరారు. రైల్వేలు, డిఫెన్స్, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదన్నారు. భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. కాగా, కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. దీంతో, కేసీఆర్ కృషి ఫలించింది. -
జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు ఆదరణ పెరుగుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈని తొలుత ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. 2016లో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రారంభించారు. ఆ తరువాతి ఏడాది మరాఠీ, ఉర్దూను ఉపసంహరించారు. 2020లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి జేఈఈ పరీక్ష బాధ్యతలను చేపట్టాక ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. ఇతర భాషలకు ప్రాధాన్యమివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో పాటు జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తరువాత నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తోంది. 2021లో నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 9.39 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 1,49,621 మంది ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. బెంగాలీలో 24,841 మంది, గుజరాతీలో 44,094 మంది, హిందీలో 76,459 మంది దరఖాస్తు చేయగా తెలుగులో 371, తమిళం 1264, కన్నడ 234, మలయాళం 398, మరాఠీ 658, ఒడియా 471, పంజాబీ 107, ఉర్దూ 24, అస్సామీ 700 మంది ఉన్నారు. నాలుగు దఫాలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఇది. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య (యూనిక్ సంఖ్య)ప్రకారం చూస్తే 70 వేలు. వీరిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారు 45 వేలు. 2022లో జేఈఈకి మొత్తం 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ప్రాంతీయ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉంది. వీరిలో 50 వేల మంది వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాశారు. బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషల్లోనే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. 2022లో తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య 1,200 వరకు పెరిగింది. 2023లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల్లో సందేహాలు ఉంటే ఆంగ్ల ప్రశ్న పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. (క్లిక్ చేయండి: అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు) -
మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు
న్యూఢిల్లీ: ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఒక వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్సైట్లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్సైట్, యాప్ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగ్విస్టిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్టీటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ గిరినాథ్ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది. -
ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి. -
ప్రాంతీయ భాషల వారిని నియమించండి
సాక్షి, హైదరాబాద్: దేశీయ విమాన సర్వీసుల నిర్వహణలో ఇండిగో విమానంలో ప్రాంతీయ భాషలైనా తెలుగు, తమిళ, కన్నడ వచ్చిన ఎయిర్‌హోస్టెస్‌లను నియమించుకోవాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత విమాన సంస్థకు ట్విట్టర్ ద్వారా సూచించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉన్న సీట్లో కూర్చున్నారు. ఆ సీట్లలో కూర్చున్న వారికి ప్రత్యేకంగా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ సమయంలో సంబంధిత ప్రయాణికురాలికి ఎయిర్‌హోస్టెస్ సూచించిన అంశాలు ఇంగ్లిష్‌లో ఉండటంతో సీటు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై దేవాస్మిత చక్రవర్తి అనే ప్రయాణికురాలు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో తెలుగు భాష వచ్చిన ఎయిర్‌హోస్టెస్ నియమించేలా చూడాలని, దీనివల్ల భద్రతా సంబంధిత సూచనలు తేలికగా తెలుగు మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుందని, ఇంగ్లిష్, హిందీ మాత్రమే వచ్చిన వారినే నియమించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయనిఆ ట్వీట్లో తెలిపింది. ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ స్థానిక భాషల్లోనూ సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక భాషలు వచ్చిన సిబ్బందిని నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఫీచర్ ఫోన్ యూజర్లకు ఊరట: వాయిస్‌తో యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ సేవల్లో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు బహుళ భాషల్లో వాయిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వీటిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ , బెంగాలీ భాషల్లోఇది అందుబాటులోఉంది. ఈ సేవ త్వరలో గుజరాతీ, మరాఠీ,పంజాబీ వంటి ఇతర భాషలలో అందుబాటులోకి రానుంది. ఎన్ఎస్డీఎల్పేమెంట్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో టోన్‌ట్యాగ్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ దేశంలోని 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులను వాయిస్ ద్వారా చెల్లింపు సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తుంది యూపీఐ పేమెంట్స్ స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఏడాది మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో ఫీచర్ ఫోన్వినియోగదారులకు 'యూపీఐ 123పే' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా చెల్లింపులు చేసుకునే సౌలభ్యం వారికి లభించింది. ఇప్పుడు, VoiceSe అనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబర్‌కు కాల్ చేసి, తమ ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి చేసుకోవచ్చు, నిధులను బదిలీ చేయలేరు. టోన్‌ట్యాగ్ సహ వ్యవస్థాపకుడు, ల్యాబ్స్ డైరెక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 100 శాతం డిజిటల్ అక్షరాస్యత లేదా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడని డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అందించేందుకు, సిరి , అలెక్సాలకు మించిన వాయిస్ టెక్నాలజీని పరిశీలిస్తున్నామన్నారు. -
IBPS Exam: 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ క్లర్క్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ రిక్రూట్మెంట్లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్ రిక్రూట్మెంట్లలో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. క్లరికల్ కేడర్ కోసం పరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఐబీపీఎస్ ప్రారంభించిన పరీక్ష ప్రక్రియను నిలివేయాలని నిర్ణయించారు. -
ఆన్లైన్ క్లాసుల కోసం జియోమీట్.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో
వీడియో కాలింగ్ విభాగంలో సరికొత్త ఫీచర్‌కి అదనపు హంగులు జోడించింది జియోమీట్. భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా స్థానిక భాషల్లో ఈ యాప్‌ని ఉపయోగించే విధంగా మార్పులు చేసింది. జియోమీట్ అంటే కరోనా సంక్షోభం తర్వాత జీవన శైలిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫీసు పనులు, అకాడమిక్ వ్యవహరాలు అన్నీ వర్చువల్ పద్దతిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్స్ అవసరం పెరిగిపోయింది. దీంతో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా జియోమీట్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది జియో నెట్వర్క్. స్థానిక భాషల్లో పల్లె, పట్నం తేడా లేకుండా జియో నెట్వర్క్ దేశమంతటా విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జియోమీట్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీరికి మరింత అనువుగా ఉండేలా ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల్లో జియోమీట్‌ను ఉపయోగించుకునేలా మార్పులు చేశారు. ఆగస్టు 15 నుంచి హింది, మరాఠి, గుజరాత్ భాషలను ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. అతి త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ భాషలను కూడా యాడ్ చేస్తామని జియో సంస్థ తెలిపింది. డేటా సేవర్ సాధారణంగా కాన్ఫరెన్స్‌లు , ఆన్లైన్ క్లాసులు గంటల తరబడి జరుగుతుంటాయి. దీని వల్ల డేటా వాడకం ఎక్కువ అవుతుంది. తమ వీడియో కాలింగ్ యాప్‌లో డేటా యూసేజీ తక్కువగా ఉంటుందని జియో అంటోంది. తక్కువ డేటా ఉపయోగిస్తూ హై డెఫినేషన్‌లో ఎక్కువ సేపు ఆన్లైన్ క్లాసులు, వర్చువల్ సమావేశాల్లో పాల్గొనవచ్చని హామీ ఇస్తోంది. చదవండి : Apple Days Sale: ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..! -
ప్రాంతీయ భాషల్లోనే పోటీ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలను 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో జీరో అవర్ సందర్భంగా జాతీయస్థాయి పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరుతూ నోటీస్ ఇచ్చారు. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల హిందీయేతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను సీజీటీఎంఎస్ఈలో చేర్చాలి: నామా కోవిడ్ కారణంగా నష్టపోయిన ప్రైవేటు విద్యాసంస్థలను ఆదుకోవడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పథకంలో చేర్చాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరుతూ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాశారు. రైతులను శిక్షించడం న్యాయమా?: సురేశ్‌రెడ్డి కాలుష్యానికి కారణమంటూ రైతులను శిక్షించడం ఎంతవరకు న్యాయమని టీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత యాజమాన్య కమిషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ‘ఈ బిల్లులోని క్లాజ్ 15ను కేంద్రం పునః పరిశీలించాలి. కాలుష్య నివేదికలు పరిశీలిస్తే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వరి, ఇతర పంటల గడ్డి కాల్చివేత వల్ల కారణమైన కాలు ష్యం వాటా కేవలం 4 శాతమే. గతంలో సెప్టెంబరులో పంట చేతికి రావడంతో వీచే గాలి వాయు కాలుష్యాన్ని నివారించేది. వాతావరణ మార్పుల వల్ల పంటల కాలం కూడా మారింది’ అన్నారు. ఖాయితా లంబాడీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలి: బండ ప్రకాశ్ ఖాయితా లంబాడీ, బోయలను ఎస్టీ జాబితాలో చే ర్చాలని టీఆర్ఎస్ కేంద్రా న్ని కోరింది. రాజ్యాంగ సవరణ (షెడ్యూల్డ్ తెగలు) బిల్లు–2021పై జరిగిన చర్చలో ఎంపీ బండ ప్రకాశ్ కేంద్రానికి విన్నవించారు. ‘ఖాయితా లంబాడీలను, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణలో చెల్లప్ప కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి సానుకూల నివేదికిచ్చింది. వీటిని అమలు చేయాలని శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి పంపి మూడేళ్లయింది’ అని తెలిపారు. -
ఓటీటీ.. ప్రాంతీయ భాషల హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటలు, పాటలు, సినిమా.. ఏదైతేనేం వినోదం మన జీవితంలో భాగం. సినిమా విషయానికి వస్తే వెండి తెర మీద చూడాల్సిందే. అయితే మహమ్మారి కారణంగా జనం థియేటర్లకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఉండి బుల్లి తెర మీదనో, ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లోనో వీడియోలను వీక్షిస్తున్నారు. ఈ అంశమే ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలకు కలిసి వచ్చింది. ఇంటర్నెట్ వ్యయాలు దిగిరావడం, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ఫోన్ల విస్తృతి తోడవడం కూడా పరిశ్రమకు మేలు చేకూరుస్తోంది. ఇంకేముంది ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మారుమూల పల్లెల్లోనూ విజయకేతనం ఎగురవేస్తున్నాయి. వీటికి పోటీగా అటు జాతీయ, అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ కంపెనీలు స్వయంగా ప్రొడ్యూసర్ల అవతారం ఎత్తుతుండడం గమనార్హం. కంటెంట్ లభ్యతతో.. వ్యయాల కారణంగా థియేటర్లు, టీవీల్లో సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ విడుదల చేయలేని ప్రొడ్యూసర్లకు ఓటీటీ చక్కని వేదిక. తక్కువ ఖర్చు, నిడివితో తీసే సినిమాలకైతే ఇవి ప్రాణం పోస్తున్నాయి. పైగా ప్రాంతీయ భాషల్లో ఇప్పుడు విరివిగా కంటెంట్ లభిస్తోంది. చందా చెల్లించి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను వీక్షకులు ఎంజాయ్ చేస్తున్నా రు. అనతి కాలంలోనే ప్రాంతీయ ఓటీటీలు వీక్షకుల ఆదరణ అందుకుంటున్నాయి. ఇందుకు తెలుగులో వచ్చిన ఆహా చక్కని ఉదాహరణ. 2020 మార్చిలో ప్రారంభమైన ఈ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీకి కోటి మందికిపైగా యూజర్లున్నారంటే ప్రాంతీయ భాషలకు ఉన్న డిమాండ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. శ్రేయాస్ ఈటీ ఆరు లక్షలకుపైగా డౌన్లోడ్స్ సాధించింది. డిమాండ్ నేపథ్యంలో సెప్టెంబరుకల్లా 10 భాషలను పరిచయం చేయనున్నట్టు శ్రేయాస్ ఈటీ ఫౌండర్ గండ్ర శ్రీనివాస రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఓటీటీ రంగంలో భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతోంది. కంపెనీలకు చందా ఆదాయం దేశంలో వచ్చే నాలుగేళ్లు ఏటా 30.7% అధికం అవుతుంది’ అని చెప్పారు. పట్టు సాధిస్తున్న ప్రాంతీయం.. ఓటీటీ వేదికలపై ప్రాంతీయ భాషల వాటా 2025 నాటికి 50 శాతం దాటుతుందని ఫిక్కీ–ఈవై నివేదిక చెబుతోంది. 2019లో ఇది 30 శాతంగా ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు పిల్లల కోసం సినీ నటుడు మహేశ్ బాబు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళంలో నీస్ట్రీమ్, కూడె, బెంగాలీలో అడ్డాటైమ్స్, హోయిచొయి, తులు, కొంకణి, కన్నడలో టాకీస్, గుజరాతీలో ఓహో గుజరాతీ, సిటీషోర్.టీవీ, మరాఠీలో ప్లానెట్ మరాఠి, తమిళంలో రీగల్ టాకీస్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీలో సన్ నెక్ట్స్æ పోటీపడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ను ప్రాంతీయ భాషల్లో అనువదించి విడుదల చేస్తున్నాయి. ఒకట్రెండు ఓటీటీలు మాత్రమే ఆదాయంలో వాటా విధానాన్ని అమలు చేస్తున్నాయి. మిగిలినవన్నీ ఏక మొత్తంగా ప్రసార హక్కులను చేజిక్కించుకుంటున్నాయి. దేశంలో వీడియో ఓటీటీ విపణి ప్రస్తుతం రూ.11,100 కోట్లుంది. 2030 నాటికి రూ.92,500 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. -
ప్రాంతీయ భాషల్లో బీటెక్ సాధ్యమేనా?
సాక్షి, అమరావతి: నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీటెక్ వంటి సాంకేతిక కోర్సులను స్థానిక భాషల్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చ సాగుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల అమలు కష్టమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక భాషల్లో సాంకేతిక పదజాలం ఏది? స్థానిక భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలంటే ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ప్రాంతీయ భాషల్లో లేదు. వాటిని ఏదోలా తర్జుమా చేసినా విద్యార్థులకు పదాలు అర్థమవడం కష్టమే. ప్రస్తుతం ఇంజనీరింగ్ సహా అనేక అంశాల పరిజ్ఞానం ఆంగ్లంలోనే లభ్యమవుతోంది. ఆ భాషలో నైపుణ్యమున్న వారికే ఆ పరిజ్ఙానం ఎక్కువగా పొందగలుగుతున్నారు.ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులను నిర్వహించడం, అభ్యసించడం కష్టమే కాకుండా అలా చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు దక్కవు ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిషు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికే ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు వంటి స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించడం చాలా కష్టం. అందరూ ఎల్కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమానికి మొగ్గుచూపుతున్న తరుణంలో తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. తెలుగులో ఇంజనీరింగ్ చేసేవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకురావు. – చొప్పా గంగిరెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఆప్షన్ మాత్రమే ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలన్నది జాతీయ నూతన విద్యావిధానంలో పాలసీగా పెట్టినా అది ఆప్షన్ మాత్రమే. దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కొన్ని ఎంపికచేసిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా తర్జుమా చేయించారు. కాలేజీలు తమకు నచ్చితే అమలు చేయవచ్చు. వద్దనుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమంలోనే బీటెక్ కోర్సులను కొనసాగించవచ్చు. అది వారిష్టం. – సతీష్‌చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ -
ఆ ఉద్యోగ పరీక్షలు.. ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు ఆదివారం లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు, శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు నిర్వహించే పోటీపరీక్షలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలవారు పోటీపడతారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని.. దీనివల్ల ఆంగ్లేతర మాధ్యమంలో చదివినవారు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం అమలు చేయండి జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి.. జాతీయ పోటీ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. కానీ అమల్లో తాత్సారం జరుగుతోందన్నారు. తాజాగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుళ్ల నియామకాలు, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్‌మెన్ ఎగ్జామినేషన్ తదితర నోటిఫికేషన్లలో కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రాంతీయ భాషల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. కేంద్ర ప్రభుత్వ, అనుబంధ శాఖలు, ఎస్ఎస్సీ, ఆర్బీఐ, పీఎస్బీ, యూపీఎస్సీ వంటి పరీక్షలను ప్రాంతీయ భాషల్లో సైతం నిర్వహించాలని కోరారు. ప్రస్తుత నోటిఫికేషన్లను నిలిపేసి.. అన్ని భాషల్లో పరీక్షలు నిర్వహించేలా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రాంతీయ భాషలకు పెద్దపీట
న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేలా నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యా వ్యవస్థలో భాషాపరమైన అవరోధాలను తొలగించడానికి ‘మిషన్ మోడ్’లో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు, పేదలకు తగిన అవకాశాలు దక్కుతాయని, వారి జీవితాలు మెరుగవుతాయని తెలిపారు. విద్యా రంగం కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల సమర్థ అమలుపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విషయాలను(కంటెంట్) ప్రాంతీయ భాషల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఇది సాధ్యమేనని సూచించారు. జ్ఞానానికి, పరిశోధనలకు పరిమితులు విధించుకోవడం అంటే దేశానికి పెద్ద అన్యాయం చేసినట్లేనని తేల్చిచెప్పారు. అంతరిక్షం, అణుశక్తి, డీఆర్డీఓ, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో ప్రతిభావంతులైన మన యువతకు తలుపులు తెరిచి ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ప్రపంచ దేశాల సరసన భారత్ ‘‘కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యం తర్వాత విద్యా, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలపైనే ఎక్కువ దృష్టి పెట్టాం. ఉపాధి, వ్యాపార సామర్థ్యాన్ని విద్యతో అనుసంధానించడమే లక్ష్యంగా మేము సాగిస్తున్న ప్రయత్నాలకు ఈ బడ్జెట్ మరింత ఊతం ఇస్తుంది. మా ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైజ్ఞానిక ప్రచురణలు, పీహెచ్డీ స్కాలర్లు, స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారత్ స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో ప్రపంచంలోని మొదటి 50 దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. తన స్థానాన్ని క్రమంగా మెరుగుపర్చుకుంటోంది. ఇక మన ఇంధనం హైడ్రోజన్ భారత్ స్వావలంబన సాధించిన దేశంగా మారాలంటే యువతకు తమపట్ల తమకు విశ్వాసం ఉండాలి. అది జరగాలంటే వారు ఆర్జించిన విద్య, విజ్ఞానం పట్ల పూర్తి నమ్మకం పెంచుకోవాలి. విద్యా వ్యవస్థలో ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో భాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా అత్యత్తమ కంటెంట్‌ను మన ప్రాంతీయ భాషల్లో తీసుకురావాలి. మెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్.. అన్ని సబ్జెక్టుల్లో ప్రపంచ స్థాయి కంటెంట్ ప్రాంతీయ భాషల్లో రావాలి. కేవలం భాష అన్న ఒక్క అవరోధం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాలను వృథా కానివ్వొద్దు. దేశ అభివృద్ధి ప్రయాణంలో పల్లె ప్రజలను, పేద వర్గాలను సైతం కలుపుకొని వెళ్లాలి. ప్రి–నర్సరీ నుంచి పీహెచ్డీ స్థాయి దాకా జాతీయ విద్యా విధానంలోని అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో మన విద్యార్థులకు, యువ సైంటిస్టులకు కొత్త అవకాశాలు నానాటికీ పెరుగుతున్నాయి. పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, ఉన్నత విద్యా సంస్థల్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద ఐఐటీ–వారణాసి, ఐఐటీ–ఖరగ్‌పూర్, ఐఐఎస్ఈఆర్–పుణేలో పరంశివాయ్, పరంశక్తి, పరబ్రహ్మ అనే మూడు సూపర్ కంప్యూటర్లు ఏర్పాటు చేశాం. మరో 12 సంస్థల్లో సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. దీనికి రూ.50 వేల కోట్లు కేటాయించాం. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. ఇందులో భాగంగానే బడ్జెట్లో హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించాం. హైడ్రోజన్ వాహనాన్ని ఇప్పటికే పరీక్షించాం. రవాణా రంగంలో ఇంధనంగా హైడ్రోజన్‌ను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి’’ అని ప్రధాని మోదీ కోరారు. -
గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్
గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం కొత్త కొత్త సేవలను ప్రవేశపెడుతుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం ఇంటర్నెట్ వినియోగించే జనాభా సంఖ్య 75 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దింతో వినియోగదారులు తమ ఇష్టపడే ప్రదేశాల పేర్లను ప్రాంతీయ భాషలో సెర్చ్ చేసినప్పుడు కూడా ఆ ప్రదేశానికి సంబంధించిన సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు గూగుల్ తెలిపింది. మ్యాప్స్ ఉపయోగించేప్పుడు వీధులు, ఇతర ప్రాంతాల పేర్లను 10 ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, ఒడియా వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది. దీని కోసం యూజర్స్ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి నచ్చిన భాషను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు ప్రముఖ ప్రదేశాలకు ప్రాంతీయ భాషల్లో పేర్లు వచ్చేలా మార్పులు చేశారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) -
జేఈఈ మెయిన్స్ తెలుగు, ఉర్దూలో..
సాక్షి, హైదరాబాద్ : జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఇంగ్లిష్‌లో ఉండే ఫార్ములాలు అర్థంకాక.. ఒక్కోసారి ఇంగ్లిష్ పదాలే అర్థంకాక తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ జాతీయ స్థాయి పోటీపరీక్షలో తెలుగు, ఉర్దూ, ఇతర ప్రాంతీయ భాషల్లో చదివిన ఇంటర్మీ డియట్ విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. కొందరు అర్థమైన వరకు పరీక్ష రాసి ‘మమ’అనిపిస్తుంటే, ఇంకొందరు అసలు పరీక్షలే రాయట్లేదు. దీంతో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో పోటీపడలేక ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లను పొందలేకపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈ పరిస్థితి ఇకపై మారనుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలకు చెక్‌పెడుతూ ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను తమ భాషల్లోనే రాసుకోవచ్చు. దీంతో ప్రాంతీయ భాషల విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటే అవకాశం లభించింది. ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహణ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) తాజా ఆదేశాలతో.. మాతృభాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఇకపై జేఈఈ మెయిన్ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తో పాటు 9 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్/హిందీ లేదా గుజరాతీలో పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల భాషా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఎంహెచ్ఆర్డీ గుర్తించింది. మరోవైపు వివిధ రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ, ఇంగ్లిష్ సహా 9 ప్రాంతీయ భాషలతో కలిపి మొత్తం 11 భాషల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఇకపై ఏటా ఇంగ్లిష్, హిందీ, గుజరాతీతోపాటు అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ నిర్వహించనున్నారు. ఇంకా ఏవైనా రాష్ట్రాలు కోరితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసిచ్చే అంశాన్నీ ఎన్టీఏ పరిశీలిస్తోంది. రానున్న జేఈఈ మెయిన్ నుంచే అమలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ఎన్టీఏ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. వచ్చే జనవరి, ఏప్రిల్‌లోనూ ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యాబోధన కాకుండా ఆన్లైన్ బోధనే కొనసాగుతోంది. దీంతో 2021లో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న మీమాంసలో ఎన్టీఏ ఉంది. దీనిపై అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులతోనూ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే జనవరిలో పరీక్ష నిర్వహణ సాధ్యం కాదన్న భావనకు ఇప్పటికే వచ్చింది. అయితే ఫిబ్రవరిలో నిర్వహించాలా? వద్దా? అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించకపోతే ఏప్రిల్‌కు బదులు మేలో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. మన విద్యార్థులకెంతో మేలు జేఈఈ మెయిన్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ మీడియంలో 3,48,070 మంది, తెలుగులో 89,996 మంది, ఉర్దూలో 6,394 మంది, హిందీలో 111 మంది, మరాఠీలో 87 మంది, కన్నడలో ఏడుగురు.. ఇలా మొత్తంగా 4,44,665 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరుకాక రెండు రాష్ట్రాల్లోనూ మరో 50 వేలకుపైగా ప్రైవేటు విద్యార్థులున్నారు. ఇలా మొత్తంగా రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరాన్ని ఏటా దాదాపు 10 లక్షల మంది పూర్తి చేస్తున్నారు. అందులో జేఈఈ మెయిన్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరవుతుండగా, తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 75 వేలకుపైగా ఉంటారని అంచనా. ఇప్పుడు పరీక్ష సులభతరం కానున్న నేపథ్యంలో మరో లక్ష మంది వరకు తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు ఎలాంటి భయాందోళన లేకుండా హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో మొత్తంగా లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇక ఫస్టియర్ నుంచే ప్రిపరేషన్.. ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలన్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగు, ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు లక్షల మంది ఉన్నారు. వారంతా తమ మీడియంలో జేఈఈ మెయిన్‌కు ప్రిపేర్ కావచ్చు. అలాంటి వారు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నుంచే వాటికి సిద్ధమవుతారు. తద్వారా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో తెలుగు మీడియం విద్యార్థులకు సీట్లు వస్తాయి. సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. – సయ్యద్ ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల భర్తీలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడానికి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఈ నెల 18న లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారతీయ రైల్వే, రక్షణ శాఖ, జాతీయ బ్యాంకులు తదితర అన్ని ఉద్యోగ నియామకాల కోసం ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారని లేఖలో తెలిపారు. దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదవని విద్యార్థులతో పాటు హిందీ మాట్లాడని రాష్ట్రాల వారు నష్టపోతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించడానికి వీలుగా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు రాయడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. యూపీఎస్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలతోపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, జాతీయ బ్యాంకులు, ఆర్బీఐ నిర్వహించే నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సైతం కేసీఆర్ పంపినట్లు సీఎం కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పీవీ స్టాంపును హైదరాబాద్‌లో ఆవిష్కరించండి హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక స్టాంపును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, ఈ స్టాంపును వీలు చూసుకొని హైదరాబాద్‌లో ఆవిష్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ ఈ నెల 18న రాష్ట్రపతికి రాసిన లేఖను సీఎం కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ.. మానవవనరుల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక శాఖలు, కళలు, సంస్కృతి, సాహిత్యం తదితర రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని లేఖలో కేసీఆర్ గుర్తుచేశారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరిస్తూ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు పీవీ స్మారక స్టాంపును విడుదల చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
ఇక ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్‌ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌ను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. 2021 నుంచి భారత్‌లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్‌లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్‌ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు. -
యాహూ! సరికొత్తగా...
ఒకప్పుడు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్‌గా, ఈ–మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్ యాప్‌ను రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ–బ్రాండ్ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 22 కోట్ల మంది యూజర్లు.. యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్స్ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయో గిస్తున్నారు. యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈమెయిల్ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమవద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్ యాప్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. కొత్త ఫీచర్స్‌లో కొన్ని .. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ (టీబీ) స్టోరేజీ స్పేస్ అందిస్తోంది. సుమారు 250–300 సినిమాలకు సరిపడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్ కొన్నింటిని డిలీట్ చేసుకుని.. ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా .. యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్మెంట్ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ–మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే బహుళ ఈ–మెయిల్ ఖాతాలను యాహూ మెయిల్ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మెయిల్ ప్రో రీబ్రాండింగ్.. యూజర్లకు ఉచిత సర్వీసులు అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనల ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. దీనితో పాటు ప్రకటనల బాదరబందీ లేని సబ్స్క్రిప్షన్ ఆధారిత యాహూ మెయిల్ ప్రో సర్వీసును కూడా సంస్థ గతంలో ప్రవేశపెట్టింది. సుమారు 6–7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును కూడా ప్రస్తుతం రీబ్రాండ్ చేస్తోంది. అలాగే, కొత్త యాహూ మెయిల్ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్స్‌లో ప్రీ–ఇన్స్టాల్ చేసేలా ఫోన్స్ తయారీ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎంటర్ప్రైజ్ ఈ–మెయిల్ విభాగంలో ప్రవేశించే యోచనేదీ లేదని.. సాధారణ యూజర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నాయి. -
తెలుగుసహా 9 భాషల్లోకి ‘సుప్రీం’ తీర్పులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని తొమ్మిది ప్రాంతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయని, వాటిని కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని లోక్‌సభలో చెప్పారు. ‘సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తుతం, తొమ్మిది స్థానిక భాషలలోకి అనువదిస్తున్నాం. అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నాం’ అని చెప్పారు. కార్మిక, అద్దె ఒప్పందం, భూములు, సర్వీస్ మేటర్స్, నష్టపరిహారం, నేరాలు, కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ కేసులు, వ్యక్తిగత, ఆర్థిక, కౌలు రైతుల వివాదాలు, వినియోగదారుల హక్కుల సంరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటు ఉంచుతామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్’ పరీక్ష
న్యూఢిల్లీ: తమిళ పార్టీల ఆందోళనకు కేంద్రం దిగి వచ్చింది. ఈ నెల 14న నిర్వహించిన పోస్ట్‌మెన్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది, ప్రాంతీయ భాషల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పోస్టల్ శాఖ నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని రాజ్యసభలో ఏఐడీఎంకే నాయకత్వంలో చేపట్టిన నిరసనలో డీఎంకే, సీపీఐ, సీపీఎం పాల్గొన్నాయి. సభ్యుల ఆందోళనతో లంచ్ విరామానికి ముందు సభ మూడుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైనా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో మరోసారి అర్ధగంట వాయిదాపడింది. పోస్టుమెన్, సహాయకుల కోసం పోస్టల్ శాఖ గత ఆదివారం నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వశాఖల పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించాలని సభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి. -
తెలుగులోనూ సుప్రీం తీర్పులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాను చెప్పే తీర్పులను కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా తెలుగు సహా ఆరు భారతీయ భాషల్లో కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇంగ్లిష్ నుంచి హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి తీర్పులను అనువదించి, వాటిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆమోదం తెలిపారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకోసం సుప్రీంకోర్టుకే చెందిన ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ విభాగం ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివరికే తీర్పులు ఈ ఆరు ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తీర్పులు వెలువడిన రోజు వాటిని ఇంగ్లిష్‌లో మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఆరు ప్రాంతీయభాషల్లోనూ తీర్పులను అప్లోడ్ చేయనున్నారు. ప్రాంతీయభాషల్లో కూడా తీర్పులను ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రయోజనకరంగా ఉంటుందని 2017లో రాష్ట్రపతి సూచించారు. -
ప్రాంతీయ భాషల్లో వెబ్సైట్లకు సర్వర్లు సిద్ధం
న్యూఢిల్లీ: తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లో వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకునేందుకు ఉపయోగపడేలా అంతర్జాతీయ ఇంటర్నెట్ సర్వర్లు సిద్ధమవుతున్నాయి. జూన్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి కాగలదని యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ (యూఏఎస్జీ) చైర్మన్ అజయ్ డాటా తెలిపారు. ఈ తొమ్మిది భాషల్లో తెలుగు సహా తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతి, బెంగాలీ, ఒరియా మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్ కాకుండా దేవనాగరి, అరబిక్, మాండరిన్, రష్యన్ తదితర కొన్ని భాషల్లో మాత్రమే వెబ్‌సైట్‌ను నమోదు చేసుకోవడానికి వీలుంటోంది. ఇంటర్నెట్ వెబ్సైట్ల పేర్లు తదితర అంశాలను సమీక్షించే అంతర్జాతీయ సమాఖ్య ఐకాన్‌లో భాగంగా యూఏఎస్జీ ఏర్పాటైంది. అరబిక్, హీబ్రూ, జపానీస్, థాయ్ తదితర భాషల్లో వెబ్సైట్ల నమోదుకు అవసరమైన ప్రమాణాలను రూపొందించే బాధ్యత దీనికి అప్పగించారు. -
ప్రోమో వైరల్: కోహ్లి న్యూజిలాండ్ వస్తున్నాడు..
హైదరాబాద్: స్టార్ స్పోర్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార విస్తరణతో పాటు అభిమానులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో స్టార్ సంస్థలు ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చానల్ ప్రారంభించింది. ఇప్పటికే ప్రో కబడ్డీ ఆరో సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్.. క్రీడా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు మరో ముందుడుగేసింది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టీమిండియా న్యూజిలాండ్‌కు పయనమవనుంది. ఈ పర్యటనలో కివీస్‌తో కోహ్లి సేన ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. దీనిలో భాగంగా సిరీస్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ స్పోర్స్ట్ విడుదల చేసింది. ‘కె అంటే కోహ్లి.. కోహ్లి న్యూజిలాండ్ వస్తున్నాడు. అప్పుడు తెలుస్తుంది నిజమైన కింగ్ ఎవరనేది’ అంటూ తెలుగులో సంభాషణలు ఉండటంతో తెలుగు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రాంతీయ భాషలో క్రికెట్ కామెంటరీ వినబోతుండటం ఆనందంగా ఉందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషల్లో అనౌన్స్మెంట్స్
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఎయిర్‌పోర్టులలో ముందుగా స్థానిక భాషలో ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్లలో పబ్లిక్ అనౌన్స్మెంట్స్ చేయాలంటూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) 2016లోనే తన పరిధిలోని ఏరోడ్రోమ్స్ అన్నింటికి ఇందుకు సంబంధించిన సర్క్యులర్ జారీ చేసింది. తాజాగా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్‌కి కూడా ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు పంపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందకు పైగా ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి. -
ప్రాంతీయ భాషల్లో ‘షేర్’చాట్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాంతీయ భాషలో పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు వాటిని ఇతరులతో షేర్ చేయడం కోసం వచ్చిన భారతీయ యాప్ ‘షేర్‌చాట్’ ఎంతో ఆదరణ పొందుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సెలబ్రటీలు ఇంగ్లీషు భాషలో తప్ప ఇతర ప్రాంతీయ భాషల్లో ముచ్చటించుకోవడానికి దీన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీషు భాషలో ముచ్చటించుకోవాలన్న ఇందులో కుదరదు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీషు లేదు. మిగతా భారత్‌లోని 14 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఇంగ్లీషులో ముచ్చటించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గ్లోబల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీషు రాకుండా కేవలం ప్రాంతీయ భాష మాత్రమే వచ్చిన ప్రజల సౌకర్యార్థం ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ప్రాంతీయ భాషలతోపాటు ఇందులో కూడా ఇంగ్లీషు భాషను పెట్టినట్లయితే ప్రాంతీయ భాషను చిన్న చూపు చూసినట్లు అవుతుంది. ఆంగ్ల భాషకున్న ఆదరణ కారణంగా ఆ భాష అంతగా రాకపోయినా ఆంగ్లంలో ముచ్చటించేందుకు కొంత మంది ప్రయత్నించవచ్చు. కొంత కూడా ఆ భాషరాని వారు ఇబ్బంది పడవచ్చు. అందుకని 2015, అక్టోబర్ నెలలో ఈ ‘షేర్‌చాట్’ను తీసుకొచ్చారు. గత 18 నెలల కాలంలోనే దీని యూజర్ల సంఖ్య 20 ఇంతలు పెరిగి, రెండున్నర కోట్లకు చేరుకుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే ఉపయోగించిన ఈ చాట్‌ను ఇప్పుడు సెలబ్రీటలతోపాటు వివిధ వర్గాల ప్రజలను ఉపయోగిస్తున్నారని వారు చెప్పారు. మూడు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమత్రులు....చత్తీస్ గఢ్ రమన్ సింగ్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌవాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, భోజ్‌పూరి పాటల గాయకుడు మనోజ్ తివారీ కూడా ఈ షేర్‌చాట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ను ఉపయోగించడంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూకుడును పెంచారు. కాంగ్రెస్ పార్టీగానీ, ఆ పార్టీ నాయకులుగానీ ఈ యాప్‌ను అంతగా ఉపయోగించడం లేదు. చైనా వెంచర్ క్యాపిటర్ ‘షన్వీ కాపిటల్’ ద్యారా ఈ యాప్ గత నెలలో దాదాపు 720 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. 2021 వరకు దాదాపు 53 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్పైకి వస్తారని గూగుల్ నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది. -
ప్రాంతీయ భాషలైతే మరింతమంది యూజర్లు
న్యూ ఢిల్లీ : ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. అయినా నేటికి ఎంతోమంది ఇంటర్నెట్ను వినియోగించలేని వారు ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఇంటర్నెట్లో ప్రాంతీయ భాషలను వాడే అవకాశం ఉండదు. ఐఏఎంఏఐ, కంతార్ ఐఎంఆర్బీ వారి రిపోర్టు ప్రకారం ఒకవేళ ఇంటర్నేట్లో ప్రాంతీయ భాషలు ఉపయోగించుకొనే వీలుంటే దాదాపు 205 మిలియన్ల నాన్-యూజర్లు కూడా ఇంటర్నెట్కు లాగ్ ఆన్ అవుతారని వెల్లడించింది. ‘ఇంటర్నెట్ ఇన్ ఇండిక్’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రస్తుతం భారతదేశంలో నగరాల్లో 193 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 141 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని తెలిపింది. 2017, డిసెంబరు నాటికి దేశంలో 481 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు పేర్కొంది. ఒకవేళ ఇంటర్నెట్ సమాచారం ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటే ప్రస్తుతం ఉన్న నాన్-యూజర్లలో 23 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సమాచారం పూర్తిగా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మెట్రో నగరాల వారికి ఇది సౌలభ్యంగానే ఉంటుంది. కానీ సమాజంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారు, చదువులేని వారు, వెనకబడిన వారే. వారంతా ఇంటర్నెట్ వాడాలంటే ప్రాంతీయ భాషలు ఉపయోగించే వీలుండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యూజర్లు 20 శాతం కన్నా తక్కువగా ఉన్నారు. డిజిటలైజేషన్‌ను పూర్తి స్థాయిలో సాధించాలన్నా, వీరిని ఇంటర్నెట్ వాడేలా చేయాలన్నా సమాచారం ఏ భాషలో లభిస్తుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ‘ఇండిక్ అప్లికేషన్’(భారతీయ భాషల్లో సెర్చ్ ఆప్షన్)లో మ్యూజిక్, పాటలతో పాటు ఈ-మెయిల్, చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ సెర్చింగ్, టికెట్ బుకింగ్, జాబ్ సెర్చింగ్ వంటివే ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిల్లో కూడా ప్రాంతీయ భాషలు తక్కువగానే వినియోగిస్తున్నారు. -
ప్రాంతీయ భాషల్లో ‘నీట్’ను పరిశీలిస్తాం: సుప్రీం
తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు అనుమతి కోరిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘నీట్’ రాయటం తప్పనిసరి అని ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది ఈ పరీక్షను తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. సుప్రీం బెంచ్ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించే అంశం ప్రస్తావన లేదని.. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ మంగళవారం జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నీట్‌ను ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించడం వల్ల ప్రాంతీయ భాష విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు నష్టపోతారని, ఈ విద్యా సంవత్సరానికి తెలుగు, తమిళం, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీల్లో నిర్వహించేలా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఎస్ఈ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే ఈ ఏడాది నీట్ నిర్వహణ నుంచి రాష్ట్రాలను మినహాయించాలని గుజరాత్ న్యాయవాది తుషార్ మెహతా మరోసారి బెంచ్కునివేదించారు. ఈ అంశాలపై మరో బెంచ్ ఏర్పాటు చేసే విషయమై ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని బెంచ్ పేర్కొంది. మెడికల్ సీట్ల భర్తీకి ‘గుజ్‌సెట్’ నిర్వహణ అహ్మదాబాద్: వైద్య విద్య ప్రవేశాలను ‘నీట్’ ద్వారా మాత్రమే కల్పించాలన్న సుప్రీం ఆదేశాలను గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వైద్య సీట్ల భర్తీకి ‘గుజరాత్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’(గుజ్‌సెట్)ను మంగళవారం నిర్వహించింది. 68 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ‘మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ ఇతర వైద్య సంబంధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించింది గుజ్‌సెట్. ఈ క్రమంలో నీట్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పుపై మరోమారు సుప్రీంలో పిటిషన్ వేశాం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. -
'నీట్'పై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం
న్యూఢిల్లీ : నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యార్థులు ఏడు ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో మంగళవారం కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులు అలవాటు పడ్డారని సుప్రీంకు కేంద్రం తెలిపింది. అలాగే నెగటివ్ మార్క్ విధానం కూడా ఇప్పటి వరకు రాష్ట్రాల పరీక్ష విధానంలో లేదని ఆ పిటిషన్లో స్పష్టం చేసింది. కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, ఉర్ధూ భాషలో నీట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంను కేంద్రం కోరింది. -
తెలుగులోకి సచిన్ ఆత్మకథ
-
తెలుగులోకి సచిన్ ఆత్మకథ
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'కు అమితాదరణ లభిస్తోంది. అభిమానుల కోసం ఈ పుస్తకాన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రచురించనున్నారు. సచిన్ ఆత్మకథను తెలుగులో సహా ఇతర భారతీయ ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలని నిర్ణయించారు. హచెట్ ఇండియా సహ పబ్లిషర్‌గా వ్యవహరించనుంది. వివిధ భాషల పబ్లిషర్స్‌తో చర్చలు జరుపుతున్నట్టు హచెట్ ఇండియా పబ్లిషర్ పౌలోమి ఛటర్జీ చెప్పారు. తెలుగు భాషతో పాటు మరాఠీ, హిందీ, మలయాళం, అస్సామీ, బెంగాలీలో ప్రచురించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. నవంబర్ 6న విడుదలైన సచిన్ ఆత్మకథకు మార్కెట్లో భలే డిమాండ్ ఏర్పడింది. రెండు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.