జేఈఈ మెయిన్స్‌ తెలుగు, ఉర్దూలో.. | Central Government Taken Decision To Conduct JEE In Regional Languages | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌ తెలుగు, ఉర్దూలో..

Published Tue, Nov 24 2020 4:04 AM | Last Updated on Tue, Nov 24 2020 8:06 AM

Central Government Taken Decision To Conduct JEE In Regional Languages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో ఇంగ్లిష్‌లో ఉండే ఫార్ములాలు అర్థంకాక.. ఒక్కోసారి ఇంగ్లిష్‌ పదాలే అర్థంకాక తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ జాతీయ స్థాయి పోటీపరీక్షలో తెలుగు, ఉర్దూ, ఇతర ప్రాంతీయ భాషల్లో చదివిన ఇంటర్మీ డియట్‌ విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. కొందరు అర్థమైన వరకు పరీక్ష రాసి ‘మమ’అనిపిస్తుంటే, ఇంకొందరు అసలు పరీక్షలే రాయట్లేదు.

దీంతో ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులతో పోటీపడలేక ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లను పొందలేకపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈ పరిస్థితి ఇకపై మారనుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలకు చెక్‌పెడుతూ ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను తమ భాషల్లోనే రాసుకోవచ్చు. దీంతో ప్రాంతీయ భాషల విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటే అవకాశం లభించింది.

ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహణ
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) తాజా ఆదేశాలతో.. మాతృభాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఇకపై జేఈఈ మెయిన్‌ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 9 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్‌/హిందీ లేదా గుజరాతీలో పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల భాషా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఎంహెచ్‌ఆర్‌డీ గుర్తించింది. మరోవైపు వివిధ రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హిందీ, ఇంగ్లిష్‌ సహా 9 ప్రాంతీయ భాషలతో కలిపి మొత్తం 11 భాషల్లో జేఈఈ మెయిన్‌ నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఇకపై ఏటా ఇంగ్లిష్, హిందీ, గుజరాతీతోపాటు అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్‌ నిర్వహించనున్నారు. ఇంకా ఏవైనా రాష్ట్రాలు కోరితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసిచ్చే అంశాన్నీ ఎన్‌టీఏ పరిశీలిస్తోంది.

రానున్న జేఈఈ మెయిన్‌ నుంచే అమలు
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. వచ్చే జనవరి, ఏప్రిల్‌లోనూ ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇంటర్మీడియట్‌లో ప్రత్యక్ష విద్యాబోధన కాకుండా ఆన్‌లైన్‌ బోధనే కొనసాగుతోంది. దీంతో 2021లో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న మీమాంసలో ఎన్‌టీఏ ఉంది. దీనిపై అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్‌ బోర్డులతోనూ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే జనవరిలో పరీక్ష నిర్వహణ సాధ్యం కాదన్న భావనకు ఇప్పటికే వచ్చింది. అయితే ఫిబ్రవరిలో నిర్వహించాలా? వద్దా? అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించకపోతే ఏప్రిల్‌కు బదులు మేలో జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది.

మన విద్యార్థులకెంతో మేలు
జేఈఈ మెయిన్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ మీడియంలో 3,48,070 మంది, తెలుగులో 89,996 మంది, ఉర్దూలో 6,394 మంది, హిందీలో 111 మంది, మరాఠీలో 87 మంది, కన్నడలో ఏడుగురు.. ఇలా మొత్తంగా 4,44,665 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరుకాక రెండు రాష్ట్రాల్లోనూ మరో 50 వేలకుపైగా ప్రైవేటు విద్యార్థులున్నారు.

ఇలా మొత్తంగా రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరాన్ని ఏటా దాదాపు 10 లక్షల మంది పూర్తి చేస్తున్నారు. అందులో జేఈఈ మెయిన్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరవుతుండగా, తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 75 వేలకుపైగా ఉంటారని అంచనా. ఇప్పుడు పరీక్ష సులభతరం కానున్న నేపథ్యంలో మరో లక్ష మంది వరకు తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు ఎలాంటి భయాందోళన లేకుండా హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో మొత్తంగా లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.

ఇక ఫస్టియర్‌ నుంచే ప్రిపరేషన్‌..
ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ నిర్వహించాలన్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగు, ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులు లక్షల మంది ఉన్నారు. వారంతా తమ మీడియంలో జేఈఈ మెయిన్‌కు ప్రిపేర్‌ కావచ్చు. అలాంటి వారు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం నుంచే వాటికి సిద్ధమవుతారు. తద్వారా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో తెలుగు మీడియం విద్యార్థులకు సీట్లు వస్తాయి. సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
– సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement