బీబీనగర్‌ ఎయిమ్స్‌పై కేంద్రం చిన్నచూపు! | Central Govt Not Releasing Funds For Bibinagar AIIMS | Sakshi
Sakshi News home page

బీబీనగర్‌ ఎయిమ్స్‌పై కేంద్రం చిన్నచూపు!

Published Sun, Feb 26 2023 3:45 AM | Last Updated on Sun, Feb 26 2023 4:24 PM

Central Govt Not Releasing Funds For Bibinagar AIIMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా నిధుల విడుదలకు సంబంధించి ఇది స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటు­న్నారు. రాష్ట్రానికి మంజూరు అయిన బీబీనగర్‌­లోని ఎయిమ్స్‌కు నిధుల విడుదలలో కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సమాచార హక్కు చట్టం కింద ఇనగంటి రవికుమార్‌ అనే యాక్టివిస్టు సమాచారం కోరగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి అజయ్‌కుమార్‌ లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు.

2024లో బీబీనగర్‌ ఎయిమ్స్‌ పూర్తి కావాల్సి ఉన్నా.. దీనికి ఇప్పటి వరకు కేవలం 8.75 శాతం మాత్రమే నిధులు విడుదల చేశారు. కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ సంవత్సరాల్లో మొత్తం 16 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ 16 ఎయిమ్స్‌లలో బిహార్‌లోని దర్బంగా, హరియాణాలోని మనేథిలలో ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదు. అలాగే తమిళనాడులోని మదురైలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తిగా జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా)నిధులతో చేపట్టాలని నిర్ణయించడం వల్ల ఆ నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో విడుదల కాని పరిస్థితి నెలకొంది.  

నిమ్స్‌ భవనాలను ఇచ్చినా.. 
బీబీనగర్‌లో నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ విస్తరణ కోసం నిర్మాణం చేసిన భవనాలను ఎయిమ్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. అయితే ఇక్కడ మరిన్ని భవనాల నిర్మాణంతోపాటు, జాతీయ స్థాయిలో పేరున్న విజ్ఞాన సంస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేస్తుండడం గమనార్హం. 2018 సంవత్సరంలో నాలుగు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ నాలుగు ఎయిమ్స్‌లలో బీబీనగర్‌ (తెలంగాణ), మధురై (తమిళనాడు), బిలాస్‌పూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), దేవఘర్‌ (జార్ఖండ్‌) ఉన్నాయి. అయితే బిలాస్‌పూర్‌ ఎయిమ్స్‌కు రూ.1,471 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1407.93 కోట్లు విడుదల చేయడంతో నిర్మాణం దాదాపు 98 శాతం పూర్తయింది. అలాగే దేవఘర్‌ ఎయిమ్స్‌కు రూ.1,103 కోట్లు కేటాయించగా.. రూ.713 కోట్లు విడుదల చేసింది. అదే బీబీనగర్‌ ఎయిమ్స్‌కు రూ.1,365 కోట్లు కేటాయించగా రూ. 156.01 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 16 ఎయిమ్స్‌లలో ఏడు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో నాలుగు ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో వైద్య కళాశాల, ఆస్పత్రి, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరికరాలు అన్నీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. బీబీనగర్‌ ఎయిమ్స్‌ మొదట రూ.1,028 కోట్లు మంజూరు చేసి, 2022 అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలని భావించారు.

కానీ నిధులు కేటాయింపులో జాప్యంతో దీనిని 2024 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అంచనా వ్యయం కూడా రూ.1,365 కోట్లకు చేరింది. కాగా, ఇప్పటికే నిమ్స్‌కోసం నిర్మించిన భవనాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఔట్‌పేషంట్‌ సేవలు మాత్రం అక్కడ కొనసాగుతున్నాయి. కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో వంద ఎకరాల స్థలంతోపాటు, నిమ్స్‌ భవనాలను కేంద్రానికి అప్పగించింది. అయినా ఇక్కడ ఎయిమ్స్‌ అభివృద్ధిలో పురోగతి లేదని విమర్శలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement