సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చజెండా ఊపింది. ఇందు కోసం రూ.14 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డు, మరో వైపు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు.. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల మూలంగా హైదరాబాద్ నగరంతో పాటు, నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు రావడం ఖాయమన్నారు.
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నలువైపుల ఉన్నటువంటి రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన అన్నారు. ఇదివరకూ రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని, ఆయా ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి తొందరగా, ఈజీగా చేరుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, దీని ద్వారా విద్య, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరగటంతో పాటు, మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా సౌలభ్యం చాలా పెరుగుతుందన్నారు. ఓవరాల్‌గా హైదరాబాద్‌తోపాటుగా తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుందని ఆయన అన్నారు.
దీంతో పాటుగా కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం మూడింట రెండొంతుల ఖర్చును (2/3) రాష్ట్రం భరించాల్సిన ఉన్నా.. వారు ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చిందన్నారు.
రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి పనులకు.. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మూలధన వ్యయాలకు సమయానుగుణంగా మరింత సహకారాన్ని అందించేందుకు 2020-21లో కేంద్రం ప్రారంభించిన ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,102 కోట్లను కేంద్రం మంజూరుచేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రాలకు జరిగిన నష్టం నుంచి కొంతమేరకు ఉపశమనం కల్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాలకు గానూ వడ్డీ లేని రుణంగా.. ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసింది.
చదవండి: ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలను, కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటానికి, అభివృద్ధి చెందుతున్న వ్యాధుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని అందించటానికి వీలుగా అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే జినోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్రం ఇంతవరకు బదలాయించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవలే గోవాలో ముగిసిన జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాలు చాలా ఫల ప్రదంగా జరిగాయని, గోవా రోడ్ మ్యాప్ ద్వారా ప్రపంచ పర్యాటక రంగాభివృద్ధితోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత పర్యాటకాన్నిసరికొత్త పుంతలు తొక్కించేందుకు.. సెప్టెంబర్‌లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా.. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మార్పుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment