Outer
-
10 రోజులు.. రూ.14,324 కోట్లు
భూముల అమ్మకాలు, ఔటర్ లీజు రూపంలో ప్రభుత్వానికి పది రోజుల్లో ఏకంగా రూ.14,324 కోట్ల ఆదాయం సమకూరింది. జీఓ 111 రద్దు అనంతరం రియల్ భూమ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో హెచ్ఎండీఏ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు పోటాపోటీగా పాల్గొన్నాయి. దీంతో హెచ్ఎండీఏకు భారీఎత్తున ఆదాయం లభించింది. ఈ నెల మొదటి వారంలో కోకాపేట్‌లోని నియోపోలిస్ రెండో దశ భూములకు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 45.33 ఎకరాలపై ఏకంగా రూ.3,319.60 కోట్ల ఆదాయం లభించింది. అనూహ్యంగా ఎకరం రూ.100 కోట్లకుపైగా అమ్ముడు కావడం సంచనలంగా మారింది. కోకాపేట్లో సగటున ఎకరం రూ.73.23 కోట్ల చొప్పున విక్రయించగా, బుద్వేల్‌లో ఎకరానికి గరిష్టంగా రూ.41.25 కోట్ల చొప్పున అమ్ముడైంది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్‌లో మొత్తం 100.01 ఎకరాలపై ప్రభుత్వానికి రూ.3,625.73 కోట్లు ఆదాయం లభించింది. ► ఔటర్‌రింగ్ రోడ్డు లీజును దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ తాజాగా రూ.7,380 కోట్లను ఏకమొత్తంగా హెచ్ఎండీఏకు చెల్లించింది. దీంతో గత పది రోజుల్లోనే సుమారు రూ.14,324 కోట్లకు పైగా ఆదాయాన్ని హెచ్ఎండీఏ సమకూర్చింది. మరోవైపు మోకిల, షాబాద్‌లలో విక్రయించిన ప్లాట్లపైనా రియల్ ఎస్టేట్ వర్గాలు, మధ్యతరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెలలో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని మరిన్ని భూములను విక్రయించేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెల రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ‘ఐఆర్బీ’ ఔటర్.. ► హైదరాబాద్ నగరం చుట్టూ మణిహారంలా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు ఐఆర్బీ ఖాతాలో చేరిపోయింది. లీజు ఒప్పందం ప్రకారం రూ.7,380 కోట్లను ఐఆర్బీ సంస్థ శుక్రవారం అర్ధరాత్రి హెచ్ఎండీఏకు చెల్లించింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతిలో ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు లీజును దక్కించుకున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ల పాటు లీజు కొనసాగనుంది. సెప్టెంబరు 24 వరకు టెండర్ మొత్తాన్ని చెల్లించేందుకు గడువు ఉన్నప్పటికీ ఆగస్టులోనే చెల్లించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని హెచ్‌జీసీఎల్ నిర్వహణలో ఉన్న ఔటర్ శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఐఆర్బీ అనుబంధ ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహణలోకి వెళ్లినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ► ఆది నుంచీ వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు వ్యవహారంలో అధికారులు చివరి నిమిషం వరకు గోప్యతను పాటించారు. టెండర్ నిబంధనల మేరకు లీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉండడంతో లీజు సొమ్ము చేతికి అందే వరకు బయటికి రాకుండా అధికారులు జాగ్రత్తలు పాటించారు. నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో ఎంతో జాగ్రత్తగా లీజు ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఇప్పటి వరకు హెచ్‌జీసీఎల్ పక్షాన టోల్ వసూలు చేసిన ఈగిల్ ఇన్ఫ్రా నుంచి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వేకు టోల్ నిర్వహణ బదిలీ అయింది. ► 158 కిలోమీటర్ల ఔటర్ మార్గంలో 121కి పైగా టోల్గేట్లు ఉన్నాయి. ప్రతి రోజు లక్షకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.కొంతకాలంగా ఔటర్‌పై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ప్రతి నెలా సుమారు రూ.550 కోట్ల వరకు టోల్ రూపంలో ఆదాయం వస్తోంది. ఇకనుంచి ఈ మొత్తం ఐఆర్బీ ఖాతాలోకి వెళ్లనుంది. -
హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చజెండా ఊపింది. ఇందు కోసం రూ.14 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డు, మరో వైపు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు.. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల మూలంగా హైదరాబాద్ నగరంతో పాటు, నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు రావడం ఖాయమన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నలువైపుల ఉన్నటువంటి రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన అన్నారు. ఇదివరకూ రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని, ఆయా ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి తొందరగా, ఈజీగా చేరుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, దీని ద్వారా విద్య, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరగటంతో పాటు, మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా సౌలభ్యం చాలా పెరుగుతుందన్నారు. ఓవరాల్‌గా హైదరాబాద్‌తోపాటుగా తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుందని ఆయన అన్నారు. దీంతో పాటుగా కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం మూడింట రెండొంతుల ఖర్చును (2/3) రాష్ట్రం భరించాల్సిన ఉన్నా.. వారు ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి పనులకు.. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మూలధన వ్యయాలకు సమయానుగుణంగా మరింత సహకారాన్ని అందించేందుకు 2020-21లో కేంద్రం ప్రారంభించిన ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,102 కోట్లను కేంద్రం మంజూరుచేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రాలకు జరిగిన నష్టం నుంచి కొంతమేరకు ఉపశమనం కల్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాలకు గానూ వడ్డీ లేని రుణంగా.. ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసింది. చదవండి: ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలను, కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటానికి, అభివృద్ధి చెందుతున్న వ్యాధుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని అందించటానికి వీలుగా అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే జినోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్రం ఇంతవరకు బదలాయించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే గోవాలో ముగిసిన జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాలు చాలా ఫల ప్రదంగా జరిగాయని, గోవా రోడ్ మ్యాప్ ద్వారా ప్రపంచ పర్యాటక రంగాభివృద్ధితోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత పర్యాటకాన్నిసరికొత్త పుంతలు తొక్కించేందుకు.. సెప్టెంబర్‌లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మార్పుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని ఆయన అన్నారు. -
రయ్... రయ్...
పెద్దఅంబర్‌పేట- ఘట్కేసర్ మార్గం ప్రారంభం వరంగల్- విజయవాడ హైవేలతో అనుసంధానం ఉప్పల్, ఎల్బీనగర్లలో తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ సిటీబ్యూరో ఔటర్‌పై వాహనాల పరుగులు మొదలయ్యాయి. కీలకమైన వరంగల్-విజయవాడ జాతీయ రహదారితో ‘లింక్’ కుదిరింది. ఫలితంగా దూరం తగ్గింది. సమయం కలిసి వస్తోంది. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సుమారు 14 కి.మీ. ఔటర్ ప్రధాన రహదారి (మెయిన్ క్యారేజ్ వే)ని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అధికారులు బుధవారం ప్రారంభించారు. 8 లైన్ల ప్రధాన రహదారిపై రయ్... రయ్... మంటూ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలో రాకపోకలకు అనుమతించడంతో వరంగల్ నుంచి విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానమైంది. ఘట్కేసర్ జంక్షన్ వద్ద ఔటర్ పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారికి చేరుకునేందుకు వీలు కలిగింది. ప్రధానంగా వరంగల్- విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబయ్ ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలకు ఈ మార్గంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్, ఎల్బీనగర్ మీదుగా వనస్థలిపురం, హయత్‌నగర్ గుండా ప్రయాణించి పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-9)పైకి చేరుకుంటున్నాయి. ఘట్ కేసర్-పెద్ద అంబర్‌పేట ఔటర్ అందుబాటులోకి రావడంతో వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా శివార్ల నుంచే ప్రధాన రహదారులకు చేరుకునే అవకాశం కలుగుతోంది. వరంగల్ నుంచి వచ్చే వారు శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తక్కువ సమయంలో నేరుగా చేరుకునేందుకు ఈ మార్గం ఉపకరిస్తుంది. ఉచిత ప్రవేశం ఘట్కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ప్రవేశం ఉచితం. ఈ మారంలో వాహనదారుల నుంచి టోల్‌ట్యాక్స్ (దారి సుంకం) వసూలు చేయరాదని హెచ్‌జీసీఎల్ అధికారులు నిర్ణయించారు. కొంతకాలం ఉచితంగా అనుమతించి... ట్రాఫిక్ రద్దీని గమనించాక టోల్‌ట్యాక్స్ వసూలుపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌కు ఇరువైపులా సర్వీసుల రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని జూన్ నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. పెద్దఅంబర్‌పేట-ఘట్కేసర్ 14 కి.మీ. స్ట్రెచ్‌ను రూ.300 కోట్ల వ్యయంతో ఎన్సీసీ సంస్థ నిర్మించింది. నిజానికి 2012 నవంబర్కుఈ మార్గం పూర్తవ్వాల్సి ఉంది. భారీగా రాక్ కటింగ్‌తో పాటు మూసీ నదిపై 200 మీటర్ల మేర 6 స్పాన్లతో బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగినట్లు హెచ్ఎండీఏ చెబుతోంది. త్వరలో పెండింగ్ పనులు పూర్తి మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డుకు గాను ఇప్పటి వరకు 134 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. ఇంకా 24 కి.మీ. రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ఘట్కేసర్- కీసర (10 కి.మీ.) మార్గాన్ని, ఘట్కేసర్ ఆర్వోబీని జూన్కుపూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు. కీసర-శామీర్‌పేట (10.3 కి.మీ.) ప్రధాన మార్గాన్ని ఈ ఏడాది నవంబర్‌కు పూర్తి చేస్తామని చెప్పారు. కండ్లకోయ జంక్షన్ వద్ద భూసేకరణ కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున అక్కడ 1.1 కి.మీ. మేర నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. ప్రస్తుతం 18 జంక్షన్లలో టోల్ అడ్మినిస్ట్రేషన్ భవనాల నిర్మాణం మొదలైందన్నారు. 2016 ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తి చేసి ఔటర్‌పై ఆధునిక టోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. -
ఔటర్‌పై లారీని ఢీకొన్న కారు. ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా , ఐదుగురికి త్రీవ గాయాలయ్యాయి. షిర్డీ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. -
‘ఔటర్’పె కారు దగ్ధం
వాహనంలోని నలుగురు సురక్షితం హైదరాబాద్ : ఔటర్‌పై వేగంగా వెళ్తున్న కారు ఇంజన్లో చిన్నపాటి నిప్పురవ్వలు చెలరేగి మంటలు లేచి వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన శంషాబాద్ మండలంలోని తొండుపల్లి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన సుధాకర్ తన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో కుటుంబీకులు, బంధువులతో కలసి ఔటర్ రింగు రోడ్డు మీదుగా నాగోల్ వైపు నుంచి గచ్చిబౌలి వెళ్తున్నారు. ఈ క్రమంలో తొండుపల్లి ఔటర్ జంక్షన్ సమీపంలోకి రాగానే కారు ఇంజన్లో చిన్నపాటి నిప్పురవ్వలు మొదలయ్యాయి. వాహనదారుల సమాచారంతో అప్రమత్తమైన సుధాకర్ కారును ఆపి అందులో ఉన్న వారందరినీ దించేశారు. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. దాదాపు గంటకు పైగా కారు మంటల్లో కాలి బూడిదయింది. -
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు
- ఆర్థిక ఆసరా కోసం హెచ్ఎండీఏ నిరీక్షణ - సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆరాటం సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏ కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొంది. అప్పుల ఊబి నుంచి సంస్థను బయటపడేస్తే చాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఏదోవిధంగా నిధులు సమకూర్చుకుంటామని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ని ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తమ సర్కారు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారుల్లో ఆరాటం మొదలైంది. నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏలో కొత్త ఆశలు రేకెత్తాయి. నూతన ప్రాజెక్టులకు నిధుల విషయంలో ప్రభుత్వ సాయం ఇతోధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలుత సంస్థను అప్పుల నుంచి బయటపడేయాలని అభ్యర్థిస్తున్నారు. కోకాపేటలో ప్రభుత్వ భూములు వేలం ద్వారా అమ్మిపెట్టినందుకు రూ.700కోట్లు ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి రావడం సంస్థను ఆర్థికంగా కుంగదీసింది. ఇప్పటికే రూ.280కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏ మిగతా రూ.420కోట్లు బకాయి పడింది. ఇదిలా ఉండగా నిధుల్లేక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్, ఔటర్‌పై లాజిస్టిక్ పార్కులు, నగరంలో పలు ఫ్లైఓవర్లు, రేడియల్ రోడ్లు, తదితర ప్రాజెక్టులను అధికారులు నిలిపేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటికీ 33.3కి .మీ. అసంపూర్తిగా మిగిలిపోయింది. మహా నగరాభివృద్ధిపై ఓ విజన్‌తో ఉన్న కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోకపోతే ఆ సంస్థ భవితవ్యమే ప్రశ్నార్థకం కాగలదు. పీకల్లోతు అప్పుల్లో... సొంత భూములు విక్రయించడం ద్వారా సమకూరిన నిధులతో పాటు వివిధ బ్యాంకుల నుంచి రుణ ంగా తెచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించి హెచ్ఎండీఏ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ.1100కోట్ల రుణాల తాలూకు నెలకు రూ.8కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. నెలవారీ ఆదాయం మొత్తం వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతాలకు మినహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి లేదు. స్థలాల విక్రయాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని అధికారులు ప్రయత్నించినా అది సాధ్యమయ్యేలా లేదు. జలవనరుల సంరక్షణ, అభివృద్ధికి హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అమలుకు నిధుల కరువు. రీజనల్ రింగ్‌రోడ్డు, నగరానికి నలువైపులా రైల్ టెర్మినళ్లు, అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్ల అభివృద్ధి, నగర ట్రాఫిక్‌పై అధ్యయనానికి హెచ్ఎండీఏ నడుంబిగించినా నిధుల కొరత వెనక్కి లాగుతోంది. ఫలితంగా తన అభివృద్ధి ప్రణాళికను అమలులోకి తీసుకురాలేక సతమతమవుతోంది. నగరాభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఎండీఏకు మాత్రం ఇంతవరకు సొంతభవనం లేదు. నిర్మించుకోవాలన్న ప్రయత్నమూ బెడిసికొట్టడంతో వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలను కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి ఆదుకుంటే తప్ప హెచ్ఎండీఏ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే సూచనలు కన్పించట్లేదు.