భూముల అమ్మకాలు, ఔటర్ లీజు రూపంలో ప్రభుత్వానికి పది రోజుల్లో ఏకంగా రూ.14,324 కోట్ల ఆదాయం సమకూరింది. జీఓ 111 రద్దు అనంతరం రియల్ భూమ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో హెచ్‌ఎండీఏ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు పోటాపోటీగా పాల్గొన్నాయి. దీంతో హెచ్‌ఎండీఏకు భారీఎత్తున ఆదాయం లభించింది. ఈ నెల మొదటి వారంలో కోకాపేట్‌లోని నియోపోలిస్ రెండో దశ భూములకు నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో 45.33 ఎకరాలపై ఏకంగా రూ.3,319.60 కోట్ల ఆదాయం లభించింది.
అనూహ్యంగా ఎకరం రూ.100 కోట్లకుపైగా అమ్ముడు కావడం సంచనలంగా మారింది. కోకాపేట్‌లో సగటున ఎకరం రూ.73.23 కోట్ల చొప్పున విక్రయించగా, బుద్వేల్‌లో ఎకరానికి గరిష్టంగా రూ.41.25 కోట్ల చొప్పున అమ్ముడైంది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్‌లో మొత్తం 100.01 ఎకరాలపై ప్రభుత్వానికి రూ.3,625.73 కోట్లు ఆదాయం లభించింది.
► ఔటర్‌రింగ్ రోడ్డు లీజును దక్కించుకున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ తాజాగా రూ.7,380 కోట్లను ఏకమొత్తంగా హెచ్‌ఎండీఏకు చెల్లించింది. దీంతో గత పది రోజుల్లోనే సుమారు రూ.14,324 కోట్లకు పైగా ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ సమకూర్చింది. మరోవైపు మోకిల, షాబాద్‌లలో విక్రయించిన ప్లాట్‌లపైనా రియల్ ఎస్టేట్ వర్గాలు, మధ్యతరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెలలో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని మరిన్ని భూములను విక్రయించేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెల రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ‘ఐఆర్‌బీ’ ఔటర్..
► హైదరాబాద్ నగరం చుట్టూ మణిహారంలా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు ఐఆర్‌బీ ఖాతాలో చేరిపోయింది. లీజు ఒప్పందం ప్రకారం రూ.7,380 కోట్లను ఐఆర్‌బీ సంస్థ శుక్రవారం అర్ధరాత్రి హెచ్‌ఎండీఏకు చెల్లించింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) పద్ధతిలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు లీజును దక్కించుకున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ల పాటు లీజు కొనసాగనుంది. సెప్టెంబరు 24 వరకు టెండర్ మొత్తాన్ని చెల్లించేందుకు గడువు ఉన్నప్పటికీ ఆగస్టులోనే చెల్లించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని హెచ్‌జీసీఎల్ నిర్వహణలో ఉన్న ఔటర్ శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఐఆర్‌బీ అనుబంధ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహణలోకి వెళ్లినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
► ఆది నుంచీ వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు వ్యవహారంలో అధికారులు చివరి నిమిషం వరకు గోప్యతను పాటించారు. టెండర్ నిబంధనల మేరకు లీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉండడంతో లీజు సొమ్ము చేతికి అందే వరకు బయటికి రాకుండా అధికారులు జాగ్రత్తలు పాటించారు. నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో ఎంతో జాగ్రత్తగా లీజు ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఇప్పటి వరకు హెచ్‌జీసీఎల్ పక్షాన టోల్ వసూలు చేసిన ఈగిల్ ఇన్‌ఫ్రా నుంచి ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వేకు టోల్ నిర్వహణ బదిలీ అయింది.
► 158 కిలోమీటర్ల ఔటర్ మార్గంలో 121కి పైగా టోల్‌గేట్లు ఉన్నాయి. ప్రతి రోజు లక్షకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.కొంతకాలంగా ఔటర్‌పై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ప్రతి నెలా సుమారు రూ.550 కోట్ల వరకు టోల్ రూపంలో ఆదాయం వస్తోంది. ఇకనుంచి ఈ మొత్తం ఐఆర్‌బీ ఖాతాలోకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment