కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు
- ఆర్థిక ఆసరా కోసం హెచ్‌ఎండీఏ నిరీక్షణ
- సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆరాటం
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఎండీఏ కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొంది. అప్పుల ఊబి నుంచి సంస్థను బయటపడేస్తే చాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఏదోవిధంగా నిధులు సమకూర్చుకుంటామని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ని ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తమ సర్కారు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారుల్లో ఆరాటం మొదలైంది.
నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హెచ్‌ఎండీఏలో కొత్త ఆశలు రేకెత్తాయి. నూతన ప్రాజెక్టులకు నిధుల విషయంలో ప్రభుత్వ సాయం ఇతోధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలుత సంస్థను అప్పుల నుంచి బయటపడేయాలని అభ్యర్థిస్తున్నారు. కోకాపేటలో ప్రభుత్వ భూములు వేలం ద్వారా అమ్మిపెట్టినందుకు రూ.700కోట్లు ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి రావడం సంస్థను ఆర్థికంగా కుంగదీసింది. ఇప్పటికే రూ.280కోట్లు చెల్లించిన హెచ్‌ఎండీఏ మిగతా రూ.420కోట్లు బకాయి పడింది.
ఇదిలా ఉండగా నిధుల్లేక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్, ఔటర్‌పై లాజిస్టిక్ పార్కులు, నగరంలో పలు ఫ్లైఓవర్లు, రేడియల్ రోడ్లు, తదితర ప్రాజెక్టులను అధికారులు నిలిపేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటికీ 33.3కి .మీ. అసంపూర్తిగా మిగిలిపోయింది. మహా నగరాభివృద్ధిపై ఓ విజన్‌తో ఉన్న కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే హెచ్‌ఎండీఏ ఆర్థిక పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోకపోతే ఆ సంస్థ భవితవ్యమే ప్రశ్నార్థకం కాగలదు.
పీకల్లోతు అప్పుల్లో...
సొంత భూములు విక్రయించడం ద్వారా సమకూరిన నిధులతో పాటు వివిధ బ్యాంకుల నుంచి రుణ ంగా తెచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించి హెచ్‌ఎండీఏ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ.1100కోట్ల రుణాల తాలూకు నెలకు రూ.8కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. నెలవారీ ఆదాయం మొత్తం వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతాలకు మినహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి లేదు. స్థలాల విక్రయాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని అధికారులు ప్రయత్నించినా అది సాధ్యమయ్యేలా లేదు.
జలవనరుల సంరక్షణ, అభివృద్ధికి హెచ్‌ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అమలుకు నిధుల కరువు. రీజనల్ రింగ్‌రోడ్డు, నగరానికి నలువైపులా రైల్ టెర్మినళ్లు, అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్ల అభివృద్ధి, నగర ట్రాఫిక్‌పై అధ్యయనానికి హెచ్‌ఎండీఏ నడుంబిగించినా నిధుల కొరత వెనక్కి లాగుతోంది. ఫలితంగా తన అభివృద్ధి ప్రణాళికను అమలులోకి తీసుకురాలేక సతమతమవుతోంది.
నగరాభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్‌ఎండీఏకు మాత్రం ఇంతవరకు సొంతభవనం లేదు. నిర్మించుకోవాలన్న ప్రయత్నమూ బెడిసికొట్టడంతో వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలను కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి ఆదుకుంటే తప్ప హెచ్‌ఎండీఏ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే సూచనలు కన్పించట్లేదు.