State capital
-
నేడు ఆషాఢ పూర్ణిమ
తెనాలి : రాష్ట్ర రాజధాని అమరావతిని బౌద్ధపర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనీ, ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఇక్కడకు వచ్చి ఆరాధనా కేంద్రాలు స్థాపించుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆషాఢ పౌర్ణమి విశిష్టతను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. బుద్ధుని తొలి ప్రవచనమైన ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని బోధించింది ఆషాడ పూర్ణమి రోజునే. ఆ క్రమంలో ఆవిర్భవించిన ఆరామాల్లో ఒకటి అమరావతి. సిద్ధార్థుడు సత్యకాముకుడై, మానవులు, ఇతర జీవరాశుల సుఖం, హితంకోసం దుఃఖ నివృత్తికై ఇంటిని వదిలి అనేకమంది ధార్మిక తాత్వికులను కలుస్తాడు. అయినా ప్రయోజనం లేకపోవటంతో తానే సత్వాన్వేషణకు పూనుకుంటాడు. ఆరేళ్ల కఠోర తపస్సుతో దుఃఖం ఉందనీ, నిరోధించవచ్చనీ, నిరోధానికీ మార్గముందనీ, ఆ మార్గమే ఆర్య అష్టాం గ మార్గం (చతుర్థ ఆర్యసూత్రాలు)గా విశ్వసించాడు. దుఃఖ నివృత్తికి ఒక చక్కటి మార్గా న్ని చూపి, మానవాళికి శాశ్వతానందాన్నిచ్చాడు. మధ్యమ మార్గాన్ని సూచించి, కార్యకారణ సంబంధాన్ని వివరించి, ఆత్మ లేదని నిరూపించాడు. బోధ్‌గయలో సంయక్సంబుద్ధత్వం ప్రాప్తించిన తర్వాత సిద్ధార్థ గౌతముడు బుద్ధుడయ్యాడు. వైశాఖ పౌర్ణమినాడు పరిపూర్ణ జ్ఞానిగా మారాడు. తాను కనుగొన్న ధర్మాన్ని మానవాళికి చేర్చాలన్న తపనతో బోధగయ నుంచి బయలుదేరి కాలినడకన సారనాధ్ (వారణాశి దగ్గర)లోని జింకల వనం చేరుకొన్నాడు. అక్కడే ఆషాఢపున్నమి రోజున అయిదుగురు భిక్షువులకు తాను కనుగొన్న ధర్మాన్ని ప్రబోధించాడు. దీన్ని ధర్మా న్ని ప్రచారం చేయటంగా, బుద్ధుని మొదటి ప్రవచనాన్ని ధర్మచక్ర ప్రవర్తన సూత్రంగా పిలిచారు. అప్పటి నుంచి సంఘం స్థాపన జరిగి, సభ్యుల సంఖ్య పెరుగుతూ పోయిం ది. బుద్ధుడు, ధర్మం, సంఘాలను త్రిరత్నాలంటారు. బుద్ధుడు నడయాడిన విహారదేశం బీహారు దేశంగా పేరొందినా, బుద్ధుని కాలంలోనే బౌద్ధధర్మం తెలుగునేలకు చేరింది. దాదాపు 250 పైగా సంఘారామాలు ఆవిర్భవించాయి. వీటిలో అమరావతి, భట్టిప్రోలు, వడ్డమాను, శాలిహొండం (శ్రీ’కాకుళం దగ్గర)లు అశోకుని కాలంలోనే ఉన్నాయని ది కల్చరల్ సెంటర్, విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చె ప్పారు. శాతవాహన కాలంలో ప్రతి ఊరు ఒక ఆరామమై త్రిచరణాలతో మారుమోగిందనీ, బుద్ధగీత ప్రతిఇంట ఆలాపించారని, వర్గ, వర్ణ, వ్యత్యాసాలు లేని సమసమాజానికి తెలుగు నేల నాంది పలికిందని వివరించారు. రాజధానికి అమరావతి పేరు పెట్టుకున్న నేపథ్యంలో శుక్రవారం ఆషాఢ పున్నమిని ప్రభుత్వపరంగా జరపటం మంచిదని బౌద్ధసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. -
కార్మికుల భద్రత గాల్లో దీపం!
పరిశ్రమల్లో కార్మికుల భద్రత గాల్లో దీపంగా మారింది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో ఎరుగరు. పరిశ్రమల యజమానులు అభాగ్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రక్షణచర్యలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు మృత్యువాతపడుతున్నారు. మరికొందరు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు. షాద్‌నగర్ : రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో, జిల్లాకు ముఖద్వారంలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, ఫరూఖ్‌నగర్ మండలాల్లో సుమారు 156 పరిశ్రమలు ఉన్నట్లు సంబంధితశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 90భారీ, 66 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, వస్త్రతయారీ, గృహోపకరణాలు, ఐరన్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 90శాతం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలే ఉన్నాయి. వీటిలో దే శంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 18వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పొట్టచేత పట్టుకుని బతుకుదెరువు కోసం జిల్లాకు వచ్చిన ఒ డిశా, చత్తీస్ఘడ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా రోజువారీగా కూ లీ రూ.150 నుంచి రూ.200 పొం దుతున్న వారే 80శాతం మంది ఉన్నారు. అయితే పరిశ్రమల్లో కార్మికులు యంత్రాల వద్ద పనిచేసే సమయం లో రక్షణ పరికరాలు ధరించాల్సి ఉంది. హెల్మెట్, హ్యాండ్‌గ్లౌస్, కం టి అద్దాలు, షూస్ పరిశ్రమల యా జమాన్యం సరఫరా చేయాలి. కానీ ఇవి మచ్చుకైనా కనిపించడం లేదని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ పరికరాలు ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం సంభవించినప్పుడు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా అందుబాటులో లేవని చెబుతుండటం చూస్తే.. పరిశ్రమల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పరిశ్రమల యజమానులు లాభర్జనే ధ్యేయంగా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని పలువురు నేతలు పెదవివిరుస్తున్నారు. మృత్యువాత పడుతున్న కార్మికులు షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో యజమానుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు మృత్యువాత పడుతున్నారు. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందచేయక పోవడంతో వారు నిత్యం మృత్యువుతో చెలగాటమాడాల్సి వస్తోంది. మూడేళ్ల కాలంలో సుమారు 38మంది కార్మికులు మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత డిసెంబర్లో కొత్తూరు మండలం తీగాపూర్ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో టైర్ల బాయిలర్ పేలి ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఇదే మండలంలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో యంత్రం మీదపడి ఓ కార్మికుడు ప్రాణాలు విడిచాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇదే పరిశ్రమలో మరుగుతున్న ఇనుపద్రవం మీదపడి మరో కార్మికుడు చనిపోయాడు. జనవరిలో వీర్లపల్లి గ్రామ శివారులో ఉన్న మహాశివశక్తి పరిశ్రమలో యంత్రం వద్ద పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఇనుపద్రవం మీదపడి మృతిచెందాడు. ఈ పరంపరలో ఈనెల 7న కొత్తూరు మండలంలోని వీర్లపల్లి గ్రామశివారులో ఉన్న స్లెడ్జ్ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు రాకేశ్‌కుమార్ శుక్లా(45) యంత్రం బెల్టులో పడి ప్రాణాలు విడిచాడు. నెలకు ఒకసారైనా పరిశ్రమలను తనిఖీచేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా విధిగా పరిశ్రమలను సందిర్శించి అటూ కార్మికులు, ఇటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఉపాధికి ‘కారిడార్’
* హైదరాబాద్- నల్లగొండ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు సీఎం హామీ * రెండో దశలో చేపడతామని అసెంబ్లీలో ప్రకటన * ఫార్మా అనుబంధ పరిశ్రమలకు ఎక్కువ అవకాశం * ఇప్పటికే 11వేల ఎకరాలను సర్వే చేసిన * జిల్లా యంత్రాంగం * అన్నీ అనుకూలిస్తే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర రాజధానికి సమీపంలోని జిల్లాకు మరో కారిడార్ మంజూరైంది. హైదరాబాద్-నల్లగొండ మధ్య ఇండ స్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వ పరిశ్రమల విధానంలో భాగంగా తెలంగాణలో కారిడార్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, అందులో హైదరాబాద్-నల్లగొండ కారిడార్‌ను రెండో దశలో చేపడతామని ఆయన వెల్లడించారు. సీఎం ప్రకటనతో జిల్లాకు చెందిన ఔత్సాహిక పారి శ్రామికవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, అన్నీ అనుకూలిస్తే ఈ కారిడార్ మూడేళ్లలో పూర్తి కావచ్చని పరిశ్రమల అధికారులంటున్నారు. ఇప్పటికే భూమి చూసేశారు.. వాస్తవానికి మన జిల్లాలో ఫార్మా, సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు పరిశ్రమలు కృష్ణానది తీరంలో, రాష్ట్ర సరిహద్దులో ఎక్కువగా ఉండగా, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పరిశ్రమల కారిడార్ సీఎం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు ఫార్మా అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఫార్మా పరిశ్రమ ఇప్పటికే ఉన్నందున దాని అనుబంధ ఉత్పత్తులకు చెందిన పరిశ్రమలతోపాటు హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఔషధ, జూట్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని జిల్లాకు చెందిన పరిశ్రమల శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఎంత భూమి అందుబాటులో ఉందన్న దానిపై రెండు నెలల క్రితం అధికారులు ఓ సర్వే నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)తో పాటు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 11వేల ఎకరాలను గుర్తించారు. అయితే, అందులో 3వేల ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఈ భూముల్లో టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అంటే రోడ్డు సౌకర్యం, కరెంటు, ఇతర మౌలిక అవసరాలను సమకూరుస్తుంది. ఆ తర్వాత పరిశ్రమల శాఖ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కులన్నింటినీ కలిపి ఇండస్ట్రియల్ కారిడార్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడేళ్లు పడుతుందని ప్రాథమిక సమాచారం. -
కలల లైన్‌కు పచ్చజెండా
కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించిన రైల్వే బోర్డు యాన్యుటీ పద్ధతిలో ఐదేళ్ల నష్టాలనూ భరించాల్సిందే సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ నుంచి సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజుమ్ పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దాదాపు 149 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల కింద కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడి మేరకు రైల్వే శాఖ ఈ లైన్ సర్వేకు సమ్మతించగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఆయన ప్రయత్నం ఫలించి పనులు ప్రారంభించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 925 కోట్లు అవసరమవుతాయని తాజా అంచనా. మనోహరాబాద్ లైన్‌తో లింకు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు ఈ రైల్వేలైన్ నిర్మించనున్నారు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రక్షణ శాఖ భూములుండటంతో... ఈ లైన్‌ను నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌తో అనుసంధానం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు మనోహరాబాద్ వద్ద అనుసంధానిస్తారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాటిన తరువాత మనోహరాబాద్ వస్తుంది. అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లికి ఈ రైల్వేలైన్ చేరుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నేరుగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. మూడు షరతులకు ఓకే అన్నాకే.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అంత సులభంగా అంగీకరించలేదు. నష్టాలను బూచిగా చూపి షరతుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. వాటి ప్రకారం.. నిర్మాణ వ్యయంలో మూడోవంతు (33 శాతం) భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత లెక్కన దాదాపు రూ. 308 కోట్లను రాష్ట్రం భరించాలి. ఇక భూసేకరణ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనికితోడు ఐదేళ్లదాకా ఏవైనా నష్టాలు వస్తే.. వాటిని రాష్ట్రప్రభుత్వమే భరించాలనే (యాన్యుటీ విధానం) షరతు కూడా ఉంది. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో... రైల్వే లైన్‌కు ఆమోదం వచ్చింది. కేసీఆర్ ప్రతిపాదన ఇదీ... ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు ఇదని, 2004లో ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ప్రతిపాదన చేశారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రాంచంద్రు, ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం వెల్లడించారు. 2006-07 బడ్జెట్లోనే సర్వేకోసం దీన్ని పొందుపరిచారని, దక్షిణ మధ్య రైల్వే సమగ్ర అంచనా నివేదికను తయారు చేసి రైల్వే బోర్డుకు ఇచ్చిందని వారు చెప్పారు. ‘‘సాధారణంగా రేట్ ఆఫ్ రిటర్న్ (ఆర్ఓఆర్) 14 శాతం ఉంటే గానీ కొత్త రైల్వేలైన్ మంజూరు చేయరు. ఈ లైన్ ఆర్ఓఆర్ 2.64 శాతం మాత్రమే ఉండడంతో.. కేంద్రం పలు షరతులు పెట్టింది. టీఆర్ఎస్ 2006లో యూపీఏ నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. మేం ముగ్గురం తరచుగా రైల్వే బోర్డు అధికారులను కలసి ఒత్తిడి తెచ్చాం. దాంతో పాటు షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వెనకబడిన ప్రాంతంలో కొత్త రైల్వే లైను రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైలు మార్గం ద్వారా భవిష్యత్‌లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఢిల్లీకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశముంది.’’ అని వారు పేర్కొన్నారు. -
రాజధానికి నీరెలా?
-
రాజధానికి నీరెలా?
బ్లూప్రింట్ తయారీకి నీటి పారుదల శాఖకు ఆదేశం ఢిల్లీ, నయా రాయ్‌పూర్, గాంధీనగర్‌లలో అధ్యయనానికి అధికారుల యోచన నీటి నిల్వల ప్రదేశాలు, సరఫరా అంశాలపై సర్వే షురూ: ఎస్ఈ కృష్ణా నదిపై పులిచింతలలో 45 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యం ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3 టీఎంసీలకు అవకాశం ప్రకాశం బ్యారేజీకి ఎగువన నదిలో పూడిక తీస్తే మరో 4 టీఎంసీల నిల్వకు చాన్స్ ఐదేళ్లలో పులిచింతల నుంచి పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసేలా ప్రణాళిక సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్‌గా సర్కారు ప్రకటించిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిలో ప్రస్తుత, భవిష్యత్తు జనావాసాలకు తాగునీరు, వాణిజ్య, భవన నిర్మాణ అవసరాలకు నీటిని ఏ విధంగా సరఫరా చేయాలనేది అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో.. రాజధాని జోన్లో తాగునీటి సరఫరాను నివాస, వాణిజ్య విభాగాలుగా విభజించి ఐదేళ్ల తర్వాత నుంచి ఎంత మేరకు నీరు అవసరమవుతుంది? దీన్ని ఎలా సరఫరా చేయాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు. త్వరలోనే న్యూఢిల్లీ, నయారాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), గాంధీనగర్ (గుజరాత్)లతో పాటు అవవసరమైతే సింగపూర్‌లోనూ పర్యటించి అక్కడి నీటి సరఫరా విధానాన్ని కూడా అధ్యయనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన 40 వేల ఎకరాలకు పైగా భూములను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలి విడతగా 30 వేల ఎకరాల వ్యవసాయ భూముల సమీకరణకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే రాజధాని జోన్లో ఏర్పడబోయే సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఇప్పటికే ఉన్న గ్రామాలు, కొత్తగా ఏర్పడబోయే ఆవాస ప్రాంతాలకు నీటిని ఎలా సరఫరా చేయొచ్చో ప్రాథమిక ప్రణాళిక తయారుచేయాలని ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించింది. కృష్ణాలో 50టీఎంసీల నిల్వకు అవకాశం పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ అప్పర్ స్ట్రీమ్‌లో (ఎగువ భాగాన) కృష్ణా నదికి రెండు వైపులా 20 కిలోమీటర్ల దూరం దాకా రివిట్మెంట్ వాల్ పటిష్టంగా నిర్మించి నదిలో 30 అడుగుల మేర పూడిక తొలగిస్తే అదనంగా మరో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సుమారు 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని లెక్క కడుతున్నారు. ప్రకాశం ఎగువున మరో బ్యారేజీ కృష్ణా నది మీద మరో రెండు బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించి 6 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దిశగా ఇంజనీరింగ్ నిపుణులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం - తాళ్లాయపాలెం మధ్యలో నది మీద బ్రిడ్జి నిర్మించడం ద్వారా 9వ నంబరు జాతీయ రహదారి, 5వ నంబరు జాతీయ రహదారిని అనుసంధానం చేసే ప్రణాళిక తయారు చేశారు. దీన్ని బ్రిడ్జి కం బ్యారేజీగా నిర్మిస్తే ఇక్కడ 3 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చనే దిశగా కూడా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ‘పులిచింతల’ పునరావాసం పూర్తి చేస్తేనే... పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాలోని నాలుగు ముంపు గ్రామాలకు పునరావాస కార్యక్రమం పూర్తి చేస్తేనే ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలు కలుగుతుంది. ఈ పని పూర్తి చేయకపోతే ఆ గ్రామాలు మునిగిపోయి పొరుగు రాష్ట్రం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవల పులిచింతల నీటి నిల్వల సందర్భంగా ఎదురైన అనుభవంతో పునరావాస పనులు యుద్ధప్రాతిపదిక పూర్తిచేయడం మంచిదని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంలో నీరు నిల్వ చేస్తే ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా రాజధాని జోన్లో నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలకు నీటి సరఫరా చేయొచ్చని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఒక రూపానికి వ చ్చేప్పటికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందనే అంచనాతో అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా జరిపేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య శాఖలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. నీటి నిల్వ, సరఫరాలపై సర్వే చేస్తున్నాం: ఎస్ఈ ‘‘రాజధాని జోన్‌కు అవసరమయ్యే నీటిని ఎక్కడెక్కడ ఏ మేరకు నిల్వ చేయవచ్చు, వాటిని ఏ విధంగా సరఫరా చేయొచ్చు అనే విషయం మీద సర్వే జరుపుతున్నాం. నిపుణుల కమిటీ ఆదేశం మేరకు ఈ పని ప్రారంభించాం. త్వరలోనే ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం’’ అని నీటి పారుదల శాఖ కృష్ణా డెల్టా ఎస్ఈ కె.శ్రీనివాస్ తెలిపారు. -
‘బీ-ట్రాక్’..ప్రమాదాలకు చెక్!
బెంగళూరు ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం 2006లోనే రూ.350 కోట్లతో శ్రీకారం ఏటా తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు సాక్షి,హైదరాబాద్: ఉద్యాననగరిగా పేరొం దిన బెంగళూరు మహానగరం ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యేది. ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలు తగ్గించే పని ట్రాఫిక్ పోలీసులది. అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ సమస్య పరిష్కారానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (బీ-ట్రాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2006-07లో దీనిని అమలులోకి తెచ్చింది. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. బెంగళూరు నగరానికి..హైదరాబాద్ నగరానికి ఎన్నో సారూపత్యలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ‘బీ-ట్రాక్’ పథకం అమలే పరిష్కార మార్గం. ఎన్నో సారూప్యతలు... కర్ణాటక రాజధాని బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ కూడా ఎంతో పాత నగరం. దీంతో అనేక రహదారులు చిన్నవిగా, బాటిల్‌నెక్స్‌తో నిండి ఉంటాయి. వినియోగంలో ఉన్న వాహనాల్లో అత్యధిక శాతం ద్విచక్ర వాహనాలే. పీక్ అవర్స్‌లో రోడ్లపై అడుగుపెట్టాలంటే నరకమే. వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉండవు. ఇక్కడ మాదిరిగానే సాఫ్ట్వేర్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతూనే ఉండేది. ఈ కారణాల నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ నరకాన్ని చవిచూడటంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు. క్షతగాత్రులు, మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటేది. చిన్న చిన్న మౌలికవసతుల కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ మీద ఆధారపడినట్లే అక్కడి అధికారులు బీఎంసీ అనుమతికి ఎదురుచూడాల్సి వచ్చేది. ‘బీ-ట్రాక్’తో మారిన పరిస్థితులు బీఎంసీ నుంచి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిందే బీ-ట్రాక్ పథకం. సాధారణ మౌలికవసతుల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనల ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలు. 2006-07లో రూ.350 కోట్లు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం నాలుగేళ్లల్లో ఈ నిధులను వినియోగించుకోవాలని నిబంధన పెట్టింది. అక్కడి ట్రాఫిక్ పోలీసుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కాలపరిమితిని ఎత్తివేసింది. ఏటా ట్రాఫిక్ పోలీసులు సమర్పించే యాక్షన్ ప్లాన్ ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. 2013-14 నాటికి రూ.139 కోట్లు కేటాయించింది. పరిజ్ఞానం, మౌలికవసతులకు వినియోగం... బీ-ట్రాక్ నిధులను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు మౌలికవసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కోసం 179 ప్రాంతాల్లో సర్వైలెన్స్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చే ఫీడ్‌ను అధ్యయనం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాంతాల వారీగా ఏరియా ట్రాఫిక్ సెంటర్లతో పాటు ఇన్ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ హెడ్-క్వార్టర్స్‌లో భారీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్‌ను (టీఎంసీ) ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉల్లంఘనులకు కౌన్సెలింగ్ కోసం అత్యాధునిక వసతులతో ట్రాఫిక్ ట్రైనింగ్ అండ్ రోడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఏడేళ్లల్లో సమకూరినవి.. బీ-ట్రాక్ నిధుల్ని వినియోగించి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏడేళ్లల్లో సమకూర్చుకున్నవి, అభివృద్ధి చేసిన జాబితా ఇది. 179 సర్వైలెన్స్, 5 ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలు, 9 ఇంటర్సెప్ట్ వాహనాలు . నగరంలోని 340 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఉన్నవాటిని అప్-గ్రేడ్ చేయడం. బెంగళూరులోని 625 ప్రాంతాల్లో వార్నింగ్ సిగ్నల్స్, 49 చోట్ల పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు. క్షేత్రస్థాయిలో ఉల్లంఘనుల్ని నమోదు చేయడానికి సిబ్బందికి ప్రింటర్‌తో కనెక్టివిటీ ఉన్న 650 బ్లాక్‌బెర్రీ ఫోన్లు. కీలక, అవసరమైన ప్రాంతాల్లో 30 వేల రోడ్ సైనేజస్, వెయ్యి ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటు. 85 జంక్షన్లను సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేయడంతో పాటు రెండు లక్షల చదరపు మీటర్ల రోడ్ మార్కింగ్స్. మద్యం తాగి వాహనం నడిపే వారిని పట్టుకోవడం కోసం 125 బ్రీత్ అనలైజర్ల సమీకరణ. భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణ. వాణిజ్య సముదాయాలు చిన్న వర్టికల్ పార్కింగ్ ఏర్పాటు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే బెంగళూరులో అమలవుతున్న బీ-ట్రాక్ పథకం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతోనే జరుగుతోంది. ఇలాంటి స్కీమ్‌లను ఇతర నగరాల్లో అమలు చేయాలంటే రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ట్రాఫిక్ పోలీసు లు ఏటా వసూలు చేసి ఇస్తున్న నిధుల్లో కొంత మొత్తం తిరిగి వారికే కేటాయిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ వల్ల బెంగళూరులో రోడ్డు ప్రమాదాలతో పాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. - బి.సదానంద, ట్రాఫిక్ చీఫ్, బెంగళూరు ప్రమాదాలు తగ్గాయి బెంగళూరులో ఒకప్పుడు రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా లేక జరిమానాల విధింపు, వసూళ్లు తక్కువగా ఉండేవి. ‘బీ-ట్రాక్’తో సమకూరిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నాం. తద్వారా వసూలైన జరిమానాలు పెరగడమే కాదు... ప్రమాదాలు సంఖ్య తగ్గుతూ వచ్చింది. - వసంత్, టీఎంసీ సబ్-ఇన్స్పెక్టర్, బెంగళూరు ట్రాఫిక్. ప్రమాదాలు తగ్గడమే సక్సెస్ బెంగళూరులో ‘బీ-ట్రాక్’ నిధులతో రూపొందించిన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటుతో చలాన్ల వసూలు భారీ స్థాయిలో పెరిగింది. అయితే ఇది సక్సెస్‌కు ఏమాత్రం సూచిక కాదు. కేవలం ప్రమాదాల సంఖ్య తగ్గడాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. ఆ కోణంలోనే ముందుకు వెళ్లాల్సిందిగా స్పష్టం చేస్తున్నాం - ప్రవీణ్ సూద్, హోం శాఖ కార్యదర్శి, కర్ణాటక. -
ఇది టూరిజం గవర్నమెంట్
ఒంగోలు టౌన్ : ‘రాష్ట్ర రాజధాని కోసం నాలుగు నుంచి ఐదువేల ఎకరాలుంటే సరిపోతుంది. అందుకు విరుద్ధంగా లక్ష ఎకరాలు కావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం వివిధ దేశాల్లో చక్కర్లు కొడుతోంది. చివరకు ఇది టూరిజం గవర్నమెంట్‌గా మారిందని’ సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కే నారాయణ వ్యాఖ్యానించారు. మొదట్లో స్విట్జర్లాండ్ చుట్టూ తిరిగిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సింగపూర్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. సింగపూర్‌లో బహుళ అంతస్తులు ఉన్నాయని, వాటిలాగా నిర్మాణాలు చేపట్టాలంటే లక్ష ఎకరాలు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన ఫైర్ అయ్యారు. సీపీఐ జిల్లా శాఖ నూతన భవనాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర రాజధాని కోసం విదేశాలకు వెళుతున్నారంటే పాలకుల దృష్టిలో భారతదేశం అంత పనికిమాలినదా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి ఒంగోలులో నిర్మించిన సీపీఐ భవనాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని చంద్రబాబుకు నారాయణ హితవు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరైనా హామీలిస్తారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు ప్రయత్నిస్తారని, చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో హామీల వర్షం కురిపిస్తున్నారని, ప్రకాశం జిల్లాను మాత్రం మొదటి నుండి చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చే హామీల్లో సగం నెరవేర్చినా ఇక సమస్యలు ఉండవని ఉప ముఖ్యమంత్రి నారాయణ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఉపన్యాసాల గారడీలతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నా వాటి గురించి ప్రస్తావించడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు మూడులక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టినా, పదిలక్షల కోట్లు బొగ్గు కుంభకోణం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వామపక్షపార్టీలు మినహా మిగిలినవన్నీ బూర్జువా విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. ఎర్ర జెండాలు ఏకమై పోరాడితే తప్ప సమాజానికి విముక్తి ఉండదన్నారు. సీఎం బ్లాక్‌కు రూ.25 కోట్లు అవసరమా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లోటు బడ్జెట్‌తో రాష్ట్రం దివాళా తీసిందని శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాత్కాలిక బ్లాక్‌కు రూ.25 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం రూ.52 వేల కోట్లు, ఖర్చులు రూ.62 వేల కోట్ల కింద చూపించి, రూ.10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షా 11 వేల 824 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలుంటే 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు నిర్మిస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే 8 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. చంద్రబాబు మార్కెట్లో పూలుకొని ప్రజల చెవుల్లో పెడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల చేతనే పూలుకొనిచ్చి వారి చెవుల్లోనే పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన బతుకమ్మ పండుగ కవితమ్మ పండుగగా మారిందన్నారు. ఈ పండుగకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందన్నారు. రాష్ట్రంలోని 10 వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబుపై యుద్ధం ప్రకటించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గసభ్యులు పీజే చంద్రశేఖరరావు, రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రవీంద్రనాధ్, సినీనటుడు మాదాల రవి, సినీ సంగీత దర్శకుల సంఘం కార్యదర్శి మద్దినేని రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్యతోపాటు వివిధ జిల్లాలకు చెందిన సీపీఐ కార్యదర్శులు పాల్గొన్నారు. అలరించిన వందేమాతరం పాటలు: సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు అలరించాయి. ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో అంటూ ఆలపించిన గీతాలు హోరెత్తించాయి. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు, సభకు ముందు నిర్వహించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడుకు చెందిన కడియాల రంగయ్య లెనిన్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలుత పార్టీ కార్యాలయం వద్ద జెండాను సీపీఐ రాష్ట్ర నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నూతన భవనాన్ని నారాయణ, ప్రజాసంఘాల సముదాయాన్ని మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి, నల్లూరి అంజయ్య హాలును రామకృష్ణ ప్రారంభించారు. -
డీసీసీబీలో ఇష్టారాజ్యం
వివాదాస్పదమైన రూ.కోటి విరాళం వినాయక ఆలయ నిర్మాణంపైన కోటి విమర్శలు చిత్తూరు(అగ్రికల్చర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లోని అధికారు లు, పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వ డం, డీసీసీబీ ఆవరణలో వినాయకస్వామి ఆలయ నిర్మాణం తదితర కీలక నిర్ణయాలు ముందస్తు అనుమతి లేకుండానే జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో పాలకవర్గంలోని ప్రముఖ వ్యక్తి కీలకపాత్ర పోషించారు. సాధారణంగా సహకార శాఖలో ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా, ఇందుకు సంబంధించి పైసా నిధులు విడుదల చేయాలన్నా పాలకవర్గ సభ్యుల అనుమతి తప్పని సరి. అయితే డీసీసీబీలో మాత్రం ఇలాంటివి ఏమీ అమలుకావడం లేదు. పాలకవర్గంలోని ఓ ప్ర ముఖ వ్యక్తి కనుసన్నల్లోనే అన్ని పనులు జరుగుతా యి. ఈ విషయంగా పాలకవర్గంలోని పలువురు స భ్యులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నా రు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ సహకారంతో డీసీసీబీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వ్యక్తికి, ఆ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో చైర్మన్ వ్యవహారాన్ని ప్రశ్నించలేక సభ్యులు లోలోన కుమిలిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివాదాస్పదమైన రూ.కోటి విరాళం పాలక వర్గ చైర్మన్ గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి రాజధాని నిర్మాణం కోసం రూ. కోటి చెక్కును విరాళంగా ఇచ్చారు. ఇంత మొత్తం పాలకవర్గ తీర్మా నం ఆమోదించకనే విరాళంగా ఇవ్వడాన్ని సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కేవలం తాను చైర్మన్ అయ్యేందుకు గతంలో సహకరించారని, అందుకు ప్రతిఫలంగానే రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చారని పాలవవర్గంలోని ఓ సభ్యుడు ‘సాక్షి’తో వాపోయారు. రెండు రోజుల క్రితం డీసీసీబీ పాలకమండలి సమావేశంలో ఈ విషయమై పాలకమండలి ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ నిర్మాణంలో... డీసీసీబీ ఆవరణలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వినాయక స్వామి దేవాలయంపై కూడా విమర్శలు గుప్పుమంటున్నాయి. కార్యాలయానికి వాస్తు దోష నివారణకు వినాయకస్వామి దేవాలయాన్ని నిర్మించారు. దీనిపై కూడా పాలకవర్గ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. వీధిపోటుకు చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే సరిపోయేది కదా, ఏకంగా లక్షలాది రూపాయలు వెచ్చించి గుడి నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలావుండగా ఆలయ నిర్మాణానికి సింగిల్‌విండోల నుంచి అనధికారికంగా పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించడంపై కూడా సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. నూతన భవన నిర్మాణంలోనూ... ప్రస్తుతం డీసీసీబీ ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు సరిపడా భవన సదుపాయం ఉన్నప్పటికీ, రూ.కోటి నిధులు వెచ్చించి నూతనంగా మరో భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం నిర్మాణానికి ఆప్కాబ్ నుంచి కొంత మేరకు సబ్సిడీ కింద నిధులు వచ్చాయని, అందుకు సంబంధించిన లెక్కలు తెలపడంలేదని సభ్యులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సివుంది. చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే... రాజధాని నిర్మాణానికి రూ.కోటి ఇవ్వడంపై పాలకమండలి సభ్యులతో ముందే సంప్రదించాను. అయితే విరాళం చెక్కు ఇచ్చిన తరువాత సభ్యుల నుంచి ఆమోదం తీసుకున్నాను. వినాయకస్వామి ఆలయం నిర్మాణానికి నా సొంత నిధులు, కొందరు ఉద్యోగుల విరాళాలతో నిర్మించాం. కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి 8 నెలల క్రితమే సభ్యుల ఆమోదం పొంది టెండర్లు నిర్వహించాం. -
కర్నూలును మోసగించిన సీఎం
కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్షంగా వ్యవహరించారని, కర్నూలు ప్రజల డిమాండ్‌ను పెడచెవిన పెట్టి మోసగించారని కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు శాసనసభ్యులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూకంపాలు, వరదలకు అవకాశమున్న విజయవాడ రాజధానికి అనువైన ప్రాంతం కాదని సర్వేలు స్పష్టం చేసినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను కాదని విజయవాడను రాజధానిగా ప్రకటించడంలో అర్థం లేదన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాకు ఇచ్చిన హామీల్లో సగం కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదన్నారు. పదేళ్ల వైఎస్ పాలన అంటూ విమర్శలు గుప్పించడంతోనే సరిపెట్టారని.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలించింది ఐదేళ్లు మాత్రమేనన్న విషయం కూడా చంద్రబాబుకు తెలియకపోవడం శోచనీయమన్నారు. హంద్రీనీవాకు చంద్రబాబునాయుడు తన హయాంలో రూ.13 కోట్లు కేటాయిస్తే.. వైఎస్ రూ.3,398 కోట్లు కేటాయించారన్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు బాబు రూ.3కోట్లిస్తే.. వైఎస్ఆర్ రూ.148 కోట్లు కేటాయించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. బడ్జెట్లో గుండ్రేవుల ప్రాజెక్టు విషయమే ప్రస్తావించలేదన్నారు. నంద్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి బదులు విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామంటున్నారని, ఇప్పటికే అక్కడ విత్తనోత్పత్తి కేంద్రం అభివృద్ధి చెందిన విషయం తెలుసుకోవాలన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కడపకు తరలించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కడపవాసులు వ్యతిరేకించిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామనం సమంజసం కాదన్నారు. స్పీకర్‌గా ఎంపికైన వ్యక్తి పార్టీకి రాజీనామా చేస్తారని, ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రెడ్డి మాత్రం టీడీపీ నేతలానే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీకి రూ.5వేల కోట్లను కేటాయించడం, దాని అమలుపై స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగుల భృతి ఊసే కరువైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగడుగునా అడ్డుపడ్డారన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటులో ఆంధ్ర ప్రాంతానికే అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. వైఎస్ హయాంలో యేటా రూ.కోటి చొప్పున ప్రతి ఎమ్మెల్యేకు ఏసీడీపీ నిధులు ఇచ్చారని.. ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినా పట్టించుకోలేదన్నారు. అమలుకాని హామీలతో కర్నూలు ప్రజలను చంద్రబాబు మోసగిస్తున్నారన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అసెంబ్లీ సమయమంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలను విమర్శించేందుకే సరిపోయిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ తరహాలోనే శివరామకృష్ణన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టి రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేయడం చంద్రబాబు నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు తన హామీలను ఏవిధంగా అమలు చేస్తారో స్పష్టం చేయాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసిన గుండ్రేవుల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కి అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయమై మాట్లాడే ప్రయత్నం చేస్తే మైకులు విరగ్గొట్టారనే ఆపవాదును అంటగట్టారన్నారు. అసెంబ్లీలో మైకులు, కుర్చీలు పట్టుకుంటే ఊడిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. కేవలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీకి పెట్టిన ఖర్చుతో ఓ జిల్లాను అభివృద్ధి చేయవచ్చన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటకృష్ణారెడ్డి, పి.జి.నరసింహులు యాదవ్, ఎస్సీ సెల్ నాయకులు కిషన్, మైనార్టీ నాయకులు సలీం, షరీఫ్, రాజధార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కదలిక!
రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మిగతా జిల్లాల ప్రజలకు ఊరట కలిగించేందుకు ఎన్నో వరాలు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో టెక్స్టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇదే జరిగితే జిల్లాలోని పత్తి రైతులకు లబ్ధి చేకూరటంతోపాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు రెవెన్యూ పరిధి బోయపాలెంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 126 ఎకరాల భూమిని కేటాయించింది. పార్క్ పనులకు 2010 అక్టోబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య శంకుస్థాపన చేశారు. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పార్క్ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు తాజా ప్రకటన మేరకు పార్కు పనులు వేగవంతం కానున్నారుు. ఇదీ ప్రస్తుత పరిస్థితి.. పార్కు ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన (ఏపీఐఐసీ) సంస్థ ముందుకు వచ్చింది. పార్క్‌కు 148 ఎకరాలు అవసరమని గుర్తించగా తొలిదశలో 126 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. 22 ఎకరాలు కోర్టు వివాదంలో ఉండగా మిగిలిన 108 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. ఎకరాకు రూ.2 లక్షల నామమాత్రపు ధరకే భూములను ఇచ్చింది. పార్కు నిర్మాణం కోసం సంస్థ ప్రాంతీయ అధికారులు ప్రతిపాదించిన ప్రణాళికలను అప్పటి ఎండీ తిరస్కరించారు. తర్వాత కొత్త ప్రణాళికలను రూపొందించలేదు. పార్కు భూములకు సరిహద్దు రాళ్లు వేయడం మినహా ఇంకే అభివృద్ధి పనులు చేపట్టలేదు. పార్కులో వీవింగ్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ముందుకొచ్చినా వారికి భూములను కేటాయించలేదు. పారిశ్రామిక హబ్‌గా బోయపాలెం గుంటూరు జిల్లా పత్తి పంట సాగుకు ప్రసిద్ధి. ఏటా 1.80 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో జిన్నింగ్ మిల్లులు, 80కి పైగా స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటయ్యూయి. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించవచ్చు. వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. తద్వారా జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. బోయపాలెం పరిధిలో స్పైసెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రకటించారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైతే జిన్నింగ్, స్పిన్నింగ్ యూనిట్లతోపాటు వీవింగ్, డరుుంగ్, నిట్టింగ్ పరిశ్రమలు వస్తారుు. దీంతో బోయపాలెం పారిశ్రామిక హబ్‌గా ఎదుగుతుంది. ఫలితంగా పత్తి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వస్త్ర ఎగుమతుల ద్వారా విదేశీమారక ద్రవ్యం సమకూరుతుంది. పరిశ్రమలకు ఎన్నెన్నో రాయితీలు.. పార్కులో నెలకొల్పే వస్త్ర పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తాయి. సమీకృత జౌళి పార్కుల పథకం (స్కీం ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్-ఎస్ఐటీపీ) ఔత్సాహికులకు వరం. ఈ పథకం కింద జౌళి పరిశ్రమల శాఖ నుంచి గరిష్టంగా రూ.40 కోట్ల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. ఎస్ఐటీపీలో యూనిట్లు పెట్టేవారికి టఫ్స్(టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్) కింద భారీ రాయితీలు లభిస్తాయి. పవర్, వ్యాట్ ట్యాక్స్ నుంచి మినహాయింపులు లభిస్తాయి. రూ..600 కోట్ల పెట్టుబడులు రావచ్చు.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైతే రూ.600 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పె ర గవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు చేకూరుతుంది. అన్ని విభాగాలకు చెందిన పరిశ్రమలు ఒకేచోట ఏర్పాటవటం వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుంది. - దాసరి చంద్రశేఖర్‌రావు, ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోషియేషన్ మాజీ కార్యదర్శి -
కంచే చేను మేసె!
* మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ఉన్నతాధికారుల భూ దందా * వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల స్వాహా * ఐఏఎస్ అధికారి పాత్రపైనే అనుమానాలు * బినామీ పేర్లతో 30 ఎకరాలు స్వాధీనం * తక్షణ నివేదికకు నెల కిందటే ఆదేశించిన సీఎం * జిల్లా యంత్రాంగం బేఖాతర్.. సర్కారు ఆగ్రహం * పటాన్చెరు, జిన్నారం మండలాల్లోనూ స్కాం * భూములను ఆక్రమించుకున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం * రాష్ర్ట ప్రభుత్వం వద్ద ఆధారాలు, దృష్టి సారించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది! సర్కారు భూములను కాపాడాల్సిన అధికారులే వాటిని మింగేశారు. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలోని ఎకరాలకొద్దీ భూములు అన్యాక్రాంతమైనట్లు రాష్ర్ట ప్రభుత్వానికి ఇటీవలే నిర్దిష్ట సమాచారం అందినట్లు సమాచారం. అసైన్డ్ భూములతో పాటు ఇతర అవసరాల కోసం కేటాయించిన భూములను కూడా ఉన్నతాధికారులే స్వాహా చేసినట్టు సర్కారు ప్రాథమికంగా గుర్తించింది. మెదక్ జిల్లా పరిధిలోని రామచంద్రాపురం, పటాన్చెరు, జిన్నారం మండలాల్లో జరిగిన ఈ కుంభకోణంలో జిల్లా స్థాయిలో భూముల వ్యవహారాలపై పూర్తి అధికారాలున్న ఓ ఐఏఎస్ అధికారి కీలకపాత్ర పోషించినట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై విచారణ జరిపి, తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ నెల రోజుల కిందటే మెదక్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు ఐదో తేదీనే తక్షణ నివేదిక కోరినప్పటికీ జిల్లా యంత్రాంగం ఇప్పటికీ పట్టించుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉన్నతాధికారిదే కీలక పాత్ర! హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు పరిధిలోని 106, 191, 203, 297 సర్వే నంబర్లలోని భూములను వేర్వేరు అవసరాల కోసం ప్రభుత్వం గతంలో చాలా మందికి అసైన్డ్ చేసింది. ఇలా చేయగా కూడా మరికొన్ని ఎకరాల భూమి ఇక్కడ మిగిలే ఉంది. అయితే ఈ భూములను గతంలో పేర్కొన్న అవసరాలకు కాకుండా ఇతరత్రాలకు వినియోగించడం, అసైన్డ్ భూములపై క్రయవిక్రయాలు జరపడం, ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడం వంటి అక్రమాలు జరిగినట్లు తాజాగా రాష్ర్ట ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన వ్యవహారాల్లో ఆ జిల్లాలోని ఓ ఐఏఎస్ అధికారి ముఖ్య పాత్ర పోషించినట్లు భావిస్తోంది. ఇక్కడి భూముల్లో దాదాపు 30 ఎకరాలను ఆయన బినామీ పేర్లతో ఆక్రమించినట్టు అనుమానిస్తోంది. ఇక్కడ ఎకరానికి సుమారు రూ. 3 నుండి రూ. 6 కోట్లదాకా ధర ఉంది. దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ జరపాలని... సూత్రధారులను, పాత్రధారులను గుర్తించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి వెంటనే నివేదిక ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్‌కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా ఆదేశాలు పంపారు. ఈ మేరకు గత నెల ఐదో తేదీన 3062 మెమో ద్వారా ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఇప్పటికి నెల రోజులవుతున్నా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో ఇప్పటి దాకా జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారి పాత్రపై వచ్చిన అనుమానాలు మరింత బలపడ్డాయి. సీఎం కేసీఆర్ కూడా ఈ అంశాన్ని మరోసారి గుర్తుచేయడంతో రెవెన్యూ శాఖ తన ఉత్తర్వులను కలెక్టర్‌కు మరోసారి రిమైండర్‌గా పంపడానికి సిద్ధమైంది. మరో 2 మండలాల్లోనూ అదే జిల్లా పటాన్చెరు(అమీన్పూర్), జిన్నారం మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వం భూమి అన్యాక్రాంతమైనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మండలాల్లో అసైన్డ్, శిఖం, లావణి పట్టాలు జారీ అయిన వందల ఎకరాల భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లడంలో జిల్లాకు చెందిన వివిధ స్థాయిల్లోని రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 22(ఎ) కింద ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్, నోటిఫై, డీనోటిఫై చేయడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ భూ దందాకు దిగినట్టు అనుమానిస్తున్నారు. మండల, డివిజన్ స్థాయి ఉన్నతాధికారులను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వ భూముల బదలాయింపును రద్దుచేస్తున్నట్టుగా జిల్లా అధికారులు నోటిఫై చేస్తారు. దీంతో ఆ భూములను కొనడానికి ఎవరూ ముందుకురాక ధర తగ్గిపోతుంది. వాటిని తక్కువ ధరకు రెవెన్యూ అధికారులే బినామీ పేరిట కొంటారు. ఆ తర్వాత డీనోటిఫై చేసుకుని, అవే భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని వ్యాపారం చేసుకుంటారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు. -
బకాయిలొద్దు.. భూములివ్వండి
ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు రాజధాని ప్రకటనతో భూ సేకరణకు ఉడా కసరత్తు సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించి రాష్ట్రంలోనే అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థగా పేరున్న వీజీటీఎం ఉడాను మొదటి నుంచి భూ సమస్య వేధిస్తోంది. ఆదాయం ఉన్నప్పటికీ భూమి లేకపోవడంతో ఉడా ప్రణాళికలు సిద్ధం చేసిన పెద్దపెద్ద ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో భూ సమస్యను అధిగమించేందుకు ఉడా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉడాకు బకాయిలు ఉన్న పలు ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల నుంచి నిధులకు బదులుగా భూమి ఇవ్వాలని కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కువగా బకాయిలున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉడా అధికారులు లేఖ రాశారు. ఉడా ఆశించిన రీతిలో బకాయిలకు బదులు భూములు ఇస్తే తక్షణమే 100 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. మరోవైపు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు సహకరించాలని రెండు జిల్లాల కలెక్టర్లు, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్లకు ఉడా అధికారులు విన్నవించారు. ఉడా భూములు, అప్పులు ఇవే.. రెండు నగరపాలక సంస్థలు, ఎనిమిది మున్సిపాలిటీలు, 1,400కు పైగా గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడాకు తాడేపల్లి మండలంలోని అమరావతి టౌన్షిప్లో 45 ఎకరాల భూమి ఉంది. గన్నవరం ఐటీ పార్కు సమీపంలో 7.23 ఎకరాల భూమి ఉంది. ఈ రెండు మినహా ఉడాకు ఎక్కడా భూములు లేవు. ఉడాకు రూ.160 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రూ.25 కోట్ల డెవలప్మెంట్ చార్జీలు, పెనాల్టీ రుసుము రూపంలో రూ.5కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. మరో రూ.80 వరకు పాత బకాయిలు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి రూ.70 కోట్ల వరకు రావాల్సి ఉంది. నగరపాలక సంస్థ 1992 నుంచి ఉడాకు బకాయిలు చెల్లించటం లేదు. బకాయిలు చెల్లించాలని పది సార్లకు పైగా నగరపాలక సంస్థకు లేఖలు రాశారు. ఫలితం లేకపోవటంతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుడివాడ, నూజివీడు మున్సిపాలిటీ లు కూడా ఉడాకు పెద్ద మొత్తంలోనే బకాయిలు ఉన్నాయి. భూమి కోరుతూ విజయవాడ కమిషనర్‌కు లేఖ బకాయిలకు బదులు భూమి కేటాయించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఉడా అధికారులు లేఖ రాశారు. గతంలో ఏర్పాటు చేసిన జక్కంపూడి హౌసింగ్ లే అవుట్‌కు సంబంధించి ఉడాకు నగరపాలక సంస్థ కోటి రూపాయలు బకాయి పడింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలు చెల్లించే అవకాశం లేదు. ఈ క్రమంలో జక్కంపూడి హౌసింగ్ లే అవుట్ బకాయికి బదులుగా కోటి రూపాయల విలువ చేసే నగరపాలక సంస్థ భూమిని కేటాయించాలని లేఖ రాశారు. ఇదే పద్ధతిలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భూమిని సేకరించాలని ఉడా అధికారులు భావిస్తున్నారు. 1,500 ఎకరాల భూమి అవసరం ప్రస్తుతం ఉడా అధికారులు రూ.1,400 కోట్లతో పలు అభివృద్ధి పనులు, మెగా ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆమోద ముద్ర కోసం ప్రభుత్వానికి పంపారు. అయితే ఆయా ప్రాజెక్టులకు కనీసం 1,500 ఎకరాల భూమి అవసరం. ప్రభుత్వం కొంత భూమి కేటాయించినా, వివిధ మార్గాల్లో సొంతగా మిగిలిన భూమిని సమకూర్చుకునేందుకు ఉడా ప్రయత్నిస్తోంది. అలోచిస్తున్నాం : ఉడా వీసీ అన్ని శాఖలు, మున్సిపాలిటీల నుంచి బకాయిలకు బదులు భూములు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నామని వీజీటీఎం ఉడా వీసీ పి.ఉషాకుమారి ‘సాక్షి’కి తెలిపారు. జక్కంపూడి లే అవుట్‌కు సంబంధించి తమకు రావల్సిన రూ.కోటి బదులు భూమిని కోరామని చెప్పారు. ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు అనుగుణంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. -
‘పరిసరాల్లో’ అంటే ఎటు?
రాష్ట్ర రాజధానిపై వీడని ఉత్కంఠ విజయవాడ పరిసరాల్లో అన్నారు కానీ.. నిర్దిష్టంగా ఫలానా చోటని ప్రకటించని సీఎం గుంటూరు జిల్లాలో అయితే మంగళగిరి, అమరావతి.. కృష్ణాలో హనుమాన్ జంక్షన్, నూజివీడు, నందిగామ ప్రాంతాల్లో రాజధాని రావచ్చని టీడీపీ నేతల్లో చర్చ సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని ప్రాంతంపై మూడు నెలలుగా సాగిన ఊహాగానాలు, సందిగ్ధతలకు సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో చేసిన ప్రకటన పూర్తిస్థాయిలో తెరదించకపోగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల్లో మరింత ఉత్కంఠ రేపింది. దీన్ని అవకాశంగా తీసుకుని బెజవాడకు నలువైపుల ఉన్న రియల్టర్లు గురువారమే భూముల ధరలను లక్షల్లో పెంచేశారు. ‘రాజధాని ఇక్కడే’ అంటూ ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెప్పుకుంటూ ‘రియల్ బూమ్’ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఎంతెంత భూ ములు ఉన్నాయనే దానిపై టీడీపీ నేతల అంచనాలు వాదనలు ఇలా వున్నాయి... తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో రిజర్వ్ ఫా రెస్ట్ భూములు 1,800 ఎకరాల వరకూ ఖాళీగా ఉన్నాయి. ఆరో ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెం దిన 143 ఎకరాల్లో 43 ఎకరాలను డీజీపీ కార్యాలయానికి కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈ భూ ముల్లో సర్వే పూర్తయింది. తాడేపల్లి, కొలనుకొండ, ఉండవల్లి కొండల్లో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు మంగళగిరి రూరల్, తుళ్లూరు, తాడేపల్లి, అమరావతి మండలాల్లోని ప్రైవేటు భూములను సేకరించి అభివృద్ధి ప్రాతిపదికన 60:40 నిష్పత్తి ప్రకారం ఆయా రైతులకు నష్టం లేకుండా చూడాల్సి ఉంది. మంగ ళగిరి నుంచి తెనాలి వైపు పోతే అధిక మొత్తంలో వ్యవసాయ భూములను సేకరించాల్సి ఉంటుంది. వీజీటీఎం ఉడా పరిధిలో ప్రస్తుతం మొత్తం 1,200 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇక నూజివీడు సమీపంలో దేవాదాయ శాఖ భూములు 3,600 ఎకరాలున్నాయి. నూజివీడు కు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే కాట్రేనిపాడులో 6,000 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటి తో పాటు నూజివీడు నుంచి బాపులపాడు, వీరులపాడు వైపు కూడా అటవీ భూములున్నా యి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లోనూ 600 ఎకరాల ఫా రెస్టు భూములున్నాయి. ఇక గన్నవరం, హనుమాన్ జంక్షన్ల ప్రాంతం ఐదో నంబరు జాతీ య రహదారి, ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఉంది. మేథ టవర్స్‌లో 24 ప్రభుత్వ కార్యాలయాలకు సౌలభ్యం ఉంది. వెటర్నరీ కళాశాలలోనూ 120 ఎకరాల భూములున్నాయి. గుంటూరు జిల్లా అమరావతీ తెరమీదకు రావడంతో ఇక్కడున్న అటవీ భూముల విష యం బయటకు వచ్చింది. ఒకప్పుడు అమరావతి, దాని పక్కనే ఉన్న ధరణికోట ప్రాంతాలు భౌద్ధారామాలుగా విలసిల్లాయనీ, అప్పట్లో రాజ ధానిగా వెలుగువెలిగిన ధరణికోట ప్రాంతం శాస్త్రబద్ధంగా నూతన రాజధానికి అనుకూల మన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడకు 8 కి.మీ. దూరంలో ఉన్న నిడుముక్కల, మోతడకకొండ ప్రాం తాల్లో సుమారు 2వేల ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. అమరావతికి సమీపంలోని అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 6,000 ఎకరాల అటవీ, ప్రభుత్వ భూముల వివరాల నూ ప్రభుత్వం తెప్పించుకుంది. ఇక్కడ రాజ ధాని ఏర్పాటు చేయాలనుకుంటే కృష్ణా నదికి రెండు వైపులా గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దులను కలుపుతూ రివర్వ్యూ రాజధాని నిర్మించే యోచనకూడా సీఎంకు ఉందని టీడీపీ శాసనసభ్యులు చెప్తున్నారు. కృష్ణానది మీద ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కిలోమీటరు పొడవు బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతుందనే భావనా ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్లు ప్రచారంలో వుంది. నూతన రాజధానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న 20 టీఎంసీల నీటిని ఈ ప్రాం తంలో అయితే సులువుగా నిల్వచేసుకోవడంతో పాటు, అవసరమైన చోటుకు సులువుగా తరలిం చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇ క్కడి నుంచి 9వ నంబరు ఎన్హెచ్ని అనుసంధానం చేసే అవకాశాలూ మెండుగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీజీటీఎం ఉడా పరిధిలోని విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి ప్రాంతాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాక నూతన రాజధాని నగరానికి మంగళగిరి ప్రాంతమే మంగళకరమని చంద్రబాబు సర్కారు విశ్వసిస్తోన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. -
ఆశల పల్లకిలో...
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ‘పశ్చిమ’ ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు రేకెత్తించారు. రాష్ట్ర రాజధాని ప్రకటనలో భాగంగా గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ నరసాపురం తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, కొల్లేరులో పర్యాటక అభివృద్ధి, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం పునరుద్ధరణ, పేరుపాలెం బీచ్ అభివృద్ధి, వివిధ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నీ ఎంతవరకు సాకారమవుతాయో వేచి చూడాల్సిందే. గూడెం నుంచి గగన విహారానికి గ్రీన్ సిగ్నల్ తాడేపల్లిగూడెం : జిల్లా వాసుల గగన విహారం కల త్వరలోనే సాకారం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని ప్రకటించారు. జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. చంద్రబాబు హామీ నెరవేరితే త్వరలోనే జిల్లా వాసులు గగన విహారం చేసేందుకు అవకాశం కలుగుతుంది. విమానంలో ఎగిరే చాన్స్ లభిస్తుంది. స్థానిక ఎయిర్‌స్ట్రిప్‌ను విమానాశ్రయంగా మార్చనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలిస్తామని స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. విమానాశ్రయ భూములను పట్టాలిచ్చేందుకు సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని, ఫైల్ ఆయన వద్ద ఉందని కొంతకాలం క్రితం మంత్రి ప్రకటించారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తారా, పేదల ఇళ్లకు పట్టాలిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మాణం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అత్యవసర కార్యకలాపాల కోసం గూడెంలో బ్రిటిష్ వారు ఎయిర్‌స్ట్రిప్ నిర్మించారు. అప్పట్లో 650 ఎకరాలు భూమిని సేకరించారు. యుద్ధం ముగిశాక ఈ ప్రాంతం మొత్తం రక్షణ శాఖ ఆధీనంలో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు కోటి రూపాయలు చెల్లించడంతో ఈ భూములు ప్రభుత్వానికి బదలాయించారు. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉన్నాయి. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గూడెంలో విమానాశ్రయం అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సర్వే నిర్వహించి టెండర్లు పిలవగా సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థ మైటాస్ కంపెనీకి ఖరారయ్యింది. అనంతరం సత్యంలో తలెత్తిన సంక్షోభం, వైఎస్ అకాలమరణంతో విమానాశ్రయం ఏర్పాటు అటకెక్కింది. 1.90 కిలోమీటర్ల రన్‌వే విమానాశ్రయానికి గూడెం ప్రాంతం చాలా అనుకూలం. ఇప్పటికే విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని విమానయాన వాతావరణ కేంద్రం ఇచ్చింది. ఇక్కడ రన్‌వే 1.90 కిలోమీటర్ల పొడవు ఉంది. విమానాలు దిగడానికి కిలోమీటరున్నర పొడవైన రన్‌వే ఉంటే చాలు. దానికంటే 40 మీటర్లు పొడవైన చెక్కు చెదరని రన్‌వే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ భూమి 280 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇంకాస్త భూమి సేకరిస్తే చాలు. ఏలూరు వాసులు ట్రాఫిక్ వలయాన్ని దాటుకొని గన్నవరం విమానాశ్రయం వెళ్లే కంటే నలభై నిమిషాల్లో గూడెం చేరుకోవచ్చు. జిల్లాకు గూడెం బౌగోళికంగా మధ్యలో ఉండడం అనుకూలం. జిల్లా వాసులతో పాటు రావులపాలెం ప్రాంత ప్రజలు కూడా హైవే ద్వారా త్వరగా చేరుకోవచ్చు. కార్గో సౌకర్యం కూడా ఏర్పడితే ఉల్లిపాయలు, రొయ్యలు, చేపలు, బియ్యం వంటి వాటిని ఇతర ప్రాంతాలకు త్వరగా చేర్చవచ్చు. మారనున్న‘గూడెం’ ముఖచిత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేరితే తాడేపల్లిగూడెం ముఖచిత్రం మారనుంది. జలరవాణా పునరుద్ధరణ, మరో పక్క విమానాశ్రయం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యాన పరిశోధనాస్థానాల రాకతో పట్టణానికి మహర్దశ పట్టే అవకాశం ఉంది. బకింగ్ హామ్ కెనాల్ రవాణా సాగే సమయంలో గూడెం పట్టణం ప్రముఖ జలరవాణా కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. మళ్లీ జల రవాణా ప్రారంభమైతే మరింత అభివృద్ధి సాధించనుంది. దీనికితోడు గూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వెంకట్రామన్నగూడెంలో ఉన్న కేంద్ర అటవీపర్యావరణ భూముల్లో ఏర్పాటు కావచ్చని అంచనా. మరోవైపు ఉద్యానవర్సిటీ వద్ద పుష్ప పరిశోధనా స్థానం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏర్పాటు కావాలంటే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా లాబీయింగ్ చేయాల్సి ఉంది. తీరంపై కనికరం నరసాపురం (రాయపేట) : జిల్లాలోని తీరప్రాంతంపై ప్రభుత్వం ఎట్టకేలకు కనికరం చూపించింది. నరసాపురం తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రకటన తీరప్రాంత వాసుల్లో కొత్త ఆశలను చిగురింపచేశాయి. నరసాపురం తీరప్రాంతం దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కాకినాడ, విశాఖపట్టణం, నెల్లూరు తీరప్రాంతాల అభివృద్ధికే పాలకులు ఇప్పటి వరకు మొగ్గుచూపారు. దీంతో మన జిల్లాలోని తీరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్ నిర్మాణం, మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు లేసు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చేతివృత్తుల కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎంతమేరకు సాకారమవుతాయో వేచి చూడాల్సి ఉంది. 19 కిలోమీటర్ల తీర ప్రాంతం నరసాపురం తీరప్రాంతం సుమారు 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దశాబ్దకాలంగా తీరప్రాంత వాసులను ఊరిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం నేటికీ నోచుకోలేదు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా నరసాపురం మండలం బియ్యపుతిప్పవద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే తీరప్రాంత గ్రామాలైన బియ్యపుతిప్ప, వేములదీవి తూర్పు, వేములదీవి పడమర, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు తదితర గ్రామాల రూపురేఖలు మారినట్టే. పర్యాటక కేంద్రంగా పేరుపాలెం బీచ్ మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు పేరుపాలెం బీచ్‌లో పర్యటిస్తుంటారు. పర్యాటకులకు అనుగుణంగా ఇక్కడ రీసార్ట్స్ ఏర్పాటు చేస్తే టూరిజం ప్రాంతంగా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లేసు అల్లికల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కేంద్రం బడ్జెట్లో లేసు పరిశ్రమను మెగా క్లష్టర్‌గా అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లకు పైగా ప్రత్యేక నిధులు వెచ్చించిన విషయం విధితమే. ఈ పరిశ్రమకు మరింత చేయూతనిచ్చి దీనిపై ఆధారపడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చించి చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ‘స్మార్ట్’ కాదట ఏలూరు సెంట్రల్ : ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీల్లో ఒకదానిగా చేరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ మాగంటి బాబు హామీలు నెరవేరలేదు. ముఖ్యమంత్రి గురువారం ప్రకటించిన స్మార్ట్ సిటీలో జాబితాలో ఏలూరుకు స్థానం దక్కలేదు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థ మొదటి సమావేశంలో టీడీపీకి చెందిన కార్పొరేటర్ నాయుడు పోతురాజు ఏలూరును స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే విషయాన్ని కౌన్సిల్లో లేవనెత్తారు. దీనిపై ఎంపీ బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా ఏలూరును స్మార్ట్ సిటీ చేస్తామన్న చంద్రబాబు దాన్ని పూర్తిగా విస్మరించారు. ఏలూరుకు ఏ ఒక్క వరాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర నూతన రాజధానిగా ప్రకటించిన విజయవాడకు సమీపంలో ఉన్న ఏలూరును అభివృద్ధి చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నగర ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. దీనిపై ఎంపీ బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. నగరంపై చిన్నచూపు తగదు ఏలూరుపై చిన్న చూపు తగదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదు. స్వయంగా ఆయనే స్మార్ట్ సిటీ చేస్తామని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. అసెంబ్లీ వేదికగా బాబు చేసిన ప్రకటనతో ఆయనవన్నీ బడాయి మాటలన్న సంగతి ఏలూరు ప్రజలందరికీ తెలిసింది. - గుడిదేశి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వరం దక్కని భీమవరం భీమవరం : ఆక్వా కేంద్రంగా, జిల్లా ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న భీమవరానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం శాసనసభలో రాజధానితో పాటు వివిధ ప్రాజెక్టులను ప్రకటించిన చంద్రబాబు భీమవరానికి ఒక్క వరం కూడా ప్రకటించకపోవడంపై పట్టణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం కోట్ల రూపాయల ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న భీమవరం ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం ప్రాంతానికి నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, యూనివర్సిటీ, ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులాంటివి ఏదో ఒకటి వస్తుందని ప్రజలు ఆశిస్తూ వచ్చారు. సీఎం తీరుపై తెలుగు తమ్ముళ్లు సైతం పెదవి విరుస్తున్నారు. -
చెత్తబుట్టలో వేయడం... ఫ్యాషనైపోయింది
ప్రజల నుంచి ఆందోళనలు ఎదురైనా... తనకు ఏ సమస్య వచ్చిన ప్రభుత్వానికి వెంటనే గుర్తుకు వచ్చేది 'కమిటీ' ... అది ఏ సమస్య అయినా... రాష్ట్ర విభజన, రాష్ట్ర రాజధాని ఎంపిక, మహిళలపై అత్యాచారాలు.... అన్నింటీకి ఒకటే మందు కమిటీ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ప్రజలు పోరాటం చేస్తుంటే వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడంతో పాటు ఆ సమస్య నుంచి బయటపడటానికి 'కమిటీ' కల్లోలంలో ఉన్న ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే ఓ చుక్కాని . అలా వచ్చినవే రాష్ట్ర విజభనపై ఏర్పాటైన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, ఏపీ నూతన రాజధాని ఎంపికపై ఏర్పాటైన ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ. విభజన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాంతో ఉగిపోతుంటే... ఆ సమస్య నుంచి గట్టేక్కడానికి కేంద్రం ప్రొ.శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితిని విధిస్తుంది... ఎందుకంటే ఆ కాలపరిమితి వరకు ప్రజలు శాంతంగా ఉంటారని. నిర్ణీత కాలవ్యవధిలో ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వం అందజేస్తుంది. కానీ ఆ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తుంది. గతంలో ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే... ఏపీ నూతన రాజధాని ఎంపిక చేసి ఆగస్టు 31నాటికి నివేదిక అందజేయాలని ప్రొ.శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు నిర్దేశిస్తూ ఆ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేసింది. ఆ కమిటీలోని ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా... రాజధాని ఎంపిక తమ ఇష్టం వచ్చిన చోట నిర్ణయిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం వ్యవహారిస్తుంది. కమిటీలను ఏర్పాటు చేయడం... ఆ కమిటీ నివేదికలను పట్టించుకోకుండా... తాము అనుకున్నదే జరగాలి అని తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహారిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తుంటే ఆ కమిటీల పేరుతో ప్రజలను వంచించి.. వారి సొమ్మును దుర్వినియోగం చేయడం ఎంత వరకు సబబు అని ప్రజలు అడుగుతున్నారు. వివిధ సమస్యలపేరుతో కమిటీలు ఏర్పాటు చేసి... ఆ నివేదికలు అందిన వెంటనే బుట్టలో పడేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్యాషనైపోయిందని వారు విమర్శిస్తున్నారు. -
రియల్ రూటెటు?
- అయోమయంలో క్రయవిక్రయదారులు - కొనసాగుతున్న వ్యాపారుల మాయజాలం - అప్పుడు గుంటూరు.. ఇప్పుడు మార్టూరు! - రెండింటి నడుమన చిలకలూరిపేట చిలకలూరిపేట: రాష్ట్ర రాజధాని విషయంలో రోజుకో విధంగా వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం చిలకలూరిపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం రూటును మార్చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనలు.. తాజాగా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాల కారణంగా భూములు, స్థలాల క్రయవిక్రయదారులు తీవ్ర అయోమయూనికి గురవుతున్నారు. ఈ సందిగ్ధ స్థితిని సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు యత్నిస్తున్నారు. గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లో ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మించటం సరికాదని, దీనికి మార్టూరు-వినుకొండ-దోనకొండ ప్రాంతం సానుకూలంగా ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొనటంతో అందరి దృష్టి చిలకలూరిపేట ప్రాంతంపై పడింది. ప్రకాశం జిల్లాలోని మార్టురు చిలకలూరిపేట పట్టణం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నియోజవర్గానికి సరిహద్దు ప్రాంతం కూడా, మార్టూరు ప్రాంతానికి చెందిన అత్యధిక మందికి చిలకలూరిపేటతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నారుు. విద్య, వైద్యం తదితర అవసరాల కోసం చిలకలూరిపేటనే ఆశ్రయిస్తుంటారు. దీంతో మార్టూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటయితే చిలకలూరిపేట నియోజకవర్గం భారీఎత్తున అభివృద్ధి చెందుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం ప్రారంభించారు. దీంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం క్రయవిక్రయూలు పెద్దగా లేకపోయినా రాజధాని పేరిట రేట్ల దూకుడుపై ప్రచారం మాత్రం పెద్దఎత్తున కొనసాగుతోంది. - గతంలో కొండవీడు అభివృద్ధి, టైక్స్‌టైల్ పార్కు, స్పైసెస్ పార్కుల ఏర్పాటు, బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి దోహదపడ్డాయి. తర్వాత అవి అటకెక్కటంతో క్రయవిక్రయూలు పడకేశాయి. ప్రస్తుతం రాజధాని ప్రచారంతో జిల్లాకు సంబంధించిన వారే కాక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిలకలూరిపేటవైపు దృష్టి సారించటంతో భూములు, స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. - చిలకలూరిపేట పట్టణానికి సమీపంలోని భూములతోపాటు యడ్లపాడు, నాదెండ్ల ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ. 85 లక్షల నుంచి కోటీ 10 లక్షల రూపాయల వరకు చేరింది. 16వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న భూములకు మరింత ఎక్కువ ధర పలుకుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు ఎకరాలకు ఎకరాల భూములను గుంటూరు-చిలకలూరిపేటల మధ్య కొనుగోలు చేశారని సమాచారం. - ఈ ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రులు తమ బంధువుల ద్వారా భూముల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తాము కొనుగోలు చేసిన భూములను లేఅవుట్లుగా మార్చి ప్లాట్లు విక్రరుుంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గుంటూరు వైపు ఉన్న భూముల క్రయవిక్రయూలు జోరుగా జరగ్గా.. ప్రస్తుతం మార్టూరు వైపు ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతోంది. -
వలస ప్రజలను ఆదరించే నగరమే రాజధాని...
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన విశాఖపట్నం ఎప్పటినుంచో కాస్మోపాలిటన్ సిటీగా విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కలిగి ఉన్న ప్రశాంత నగరం. రాష్ట్రానికి రాజధాని కాదగిన అనుకూలతలు దీనికి చాలానే ఉన్నాయి. రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేసే నగరం జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రాముఖ్యత కలిగిన నగరమై ఉండాలి. తద్వారా బహుళజాతి సంస్థలను సులభంగా ఆకర్షించడం సా ధ్యపడుతుంది. ప్రశాంతతకు చిహ్నంగా, నేర రహితంగా, కాస్మోపాలిటన్ కల్చర్ కలిగి, ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం ప్రగతికి ఎంతగానో దోహదకారిగా మారుతుంది. ఏ రాష్ట్ర రాజధాని అయినప్పటికీ అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండాలనేది ఒక సాధారణ అభిప్రాయం. దీంతోపాటు పరిపాలనా విభాగానికి కేంద్రంగా నిలుస్తూ, అ న్ని ప్రాంతాలను అనుసంధానించాలి, లేని పక్షంలో ఆయా ప్రాంతాలు నిస్తేజమైపోతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో రాజధానికి కనెక్టివిటీ, యాక్టివిటీ అనేది ఉండాలి. అసమతుల్యత ఏర్పడితే సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కాదు. రాజధాని నిర్మాణం జరిపే సమయంలో అనువైన ప్రాంత ఎంపికలో కొన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలి. భౌతిక అనుసంధానం, ఈ-అనుసంధానం కలిగి ఉండాలి. భౌతిక అనుసంధానంలో రోడ్డు, వాయు, నీటి, రైలు ద్వారా రాజధానికి సులభంగా చేరుకోగలగాలి. ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో ఏ ప్రాంతంతో అయినా సులభంగా సంప్రదించే విధంగా సాంకేతికంగా అనుసంధానం కలిగి ఉండాలి. లొకేషన్ బ్రాండ్... రాష్ట్ర గుర్తింపును తీసుకువచ్చేది కేవలం రాజధాని మాత్రమే. లొకేషన్ పరంగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ప్రాంతాలలో మాత్ర మే రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనుకూలంగా ఉం టుంది. తద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత సాధించడం సాధ్యపడుతుంది. నగరం కాస్మోపాలిటన్ సిటీగా ఉంటూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వారిని స్వీకరించే మనస్తత్వం కలిగి ఉం డాలి. పరిశ్రమలు, పర్యాటకం, వ్యాపారం విస్తరణకు అనువైనదిగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు సౌకర్యవంతంగా జీవనం సాగించే విధంగా రాజధాని నిర్మితం కావాలి. రాజధాని నగరానికి నేర, ఉగ్రవాద చరిత్ర ఉండరాదు. బల మైన సాంప్రదాయ పునాదులపై నిర్మితమైనది కాకుండా అన్ని వర్గాలను ఆహ్వానించేదిగా ఉండాలి. భౌగోళికంగా ప్రజల విద్యా, వైద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల అవసరాలు తీర్చగలిగే భూభాగం కలిగి ఉండాలి. విశాలమైన రోడ్డు, పారిశుధ్య వ్యవస్థ, పాలనా వ్యవస్థ, వ్యాపారం, పరిశ్రమలు ఏర్పాటు కావాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, తగినంత నీటి వనరులు ఉండాలి. కనీసం రానున్న 50 సంవత్సరాల అభివృద్ధికి సరిపోయేటంతగా ఇవి ఉండాలి. ప్రస్తుతం భౌగోళికంగా రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న విజయవాడ నగరం కాస్మోపాలిటన్ సిటీకాదు. ఇది నేర చరిత్ర కలిగి, బలమైన సాంప్రదాయ మూలాలు కలిగిన ప్రజలు నివసించే నగరం. అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు లేవు. ప్రధానంగా తగినంత భూములు, పుష్కలంగా నీటి వనరులు కలిగి ఉన్న నగరంగా మాత్రమే ఇది ప్రాచుర్యం కలిగి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్థానం అంతంత మాత్రమే. విజయవాడతో పోలిస్తే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెంది న విశాఖ ఎప్పటినుంచో కాస్మోపాలిటన్ సిటీగా ఇతర రాష్ట్రా ల ప్రజలనే కాకుండా, విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. పారిశ్రామిక, వ్యాపార, విద్యా రంగాలకు ఎంతో పేరు గాంచింది. ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కలి గి ఉన్న ప్రశాంత నగరం. అయితే ఇక్కడ భవిష్యత్ అవసరాలకు సరిపడినన్ని నీటి వనరుల లభ్యత అనేది ప్రశ్నార్థకం. రాష్ట్రానికి మరో మూలన ఉన్న కర్నూలు ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకోలేకపోయింది. శాంతిభద్రతలు, కనెక్టివిటీ లేవు. ఇక్కడి ప్రతి రంగాన్ని నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. నీటి వనరుల లభ్యత చాలా కష్టతరం. రాష్ట్ర రాజధానిలో కేవలం పరిపాలనా వ్యవస్థ, రెవెన్యూ, శాంతి భద్రతలు, పన్నులు, శాసనసభ, మండలి, సాధారణంగా నిరంతరం పర్యవేక్షించాల్సిన ప్రధాన అంగాలు ఉం డాలి. వ్యవసాయ, విద్య, పారిశ్రామిక, గనుల శాఖ, న్యాయస్థానాలు, సముద్ర, మత్స్య పరిశ్రమలు తదితర అంగాలను ఆయా ప్రాంతాల భౌగోళిక వసతులు, వనరుల లభ్యత తదితర అంశాల ఆధారంగా విభజించి సమ ప్రాధాన్యం అందిస్తూ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల మధ్య సమతూకం, అభివృద్ధి సిద్ధిస్తుంది. సహజ వనరుల లభ్యత ఆధారంగా వీటిని కేటాయించడం ఎంతో మేలుచేస్తుంది. (వ్యాసకర్త ఆంధ్ర విశ్వవిద్యాలయం వాణిజ్య నిర్వహణ శాస్త్ర విభాగం ఆచార్యులు) -
కర్నూలును రాజధానిగా ప్రకటించాలి
జాతీయ రహదారి దిగ్బంధం కర్నూలు(రూరల్): కర్నూలును రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య.. రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్.. రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహ మాట్లాడుతూ గతంలో జిల్లా ప్రజలు రాజధానిని త్యాగం చేశారని.. ఆ నష్టం ఇప్పటికీ పూడ్చుకోలేకపోతున్నారన్నారు. శ్రీభాగ్ ఒప్పందంలో రాయలసీమ వాసులు ఎలాంటి ప్రతిపాదన చేసినా ఆమోదించాలని పేర్కొన్నా పాలకులు పెడచెవిన పెట్టారన్నారు. ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు విలువైన ఖనిజ సంపదను దోచుకున్నారన్నారు. విభజన సమయంలో అవలంబించిన విధానాలపై దుమ్మెత్తిపోసిన రాజకీయ పార్టీలు రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తే అయినా రాజధాని విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. కర్నూలును రాజధాని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబుకు కోస్తా ప్రజలు మాత్రమే ఓట్లేశారన్నట్లుగా రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఏర్పాటు చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. రాజధాని సలహా కమిటీలో సీమ నేతలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదో సమాధానం చెప్పాలన్నారు. నగర శివారులోని సంతోష్‌నగర్ వద్ద చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధంతో ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో నాల్గో పట్టణ పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్, రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ నాయకుడు చంద్రశేఖర్, బీసీ కులాల ఐక్యవేదిక నాయకుడు శేషఫణి, రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి విభాగం నాయకుడు శ్రీరాములు, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర సర్కారే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే .....
ఏపీ రాజధాని వ్యవహారం ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ గా మారింది. కమిటీలు, నిపుణులు జాన్తా నై... మా ప్రయోజనాలు సిద్ధించే చోటే మా రాజధాని అన్నట్టు తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారు. నేలవిడిచి సాము చేస్తున్నట్టు వేలాది ఎకరాలు కావాలని చెబుతూ భూముల ధరలకు బూమ్ కల్పించే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ, గుంటూరుల మధ్య దూరం ముప్ఫై కిలోమీటర్లు. ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలమని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా సెలవిస్తున్నారు. ఇక్కడ 30000 ఎకరాలు కావాలని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అదే సమయంలో చుక్కలనంటిన భూముల ధరలను సేకరించడం సులభం కాదనే విషయాన్ని ఆయనే అంగీకరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో అనవసరంగా భూముల ధరలకు రెక్కలు వచ్చి, సామాన్యులు గజం భూమి కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. నిజానికి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలు నిర్మించడానికి గట్టిగా 200 ఎకరాలు సరిపోతుందని శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడైతే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుందో ఆ ప్రాంతానికి దాదాపు నలభై, యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలోని చుట్టుపక్కల ప్రాంతాలు సమీప భవిష్యత్ లో అభివృద్ధి జరగడం ఖాయం. ఆ అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం పూనుకోనవసరం లేదు. అవసరమైన ప్రణాళికలేంటనే విషయాల పట్ల ప్రభుత్వం చొరవ తీసుకుంటే సరిపోతుంది. ఒక కొత్త మహా నగరాన్ని సృష్టించాలనే ఆలోచన కంటే... ఉన్న భూముల్లో పరిపాలనా వ్యవహారాలకు అవసరమైన నిర్మాణాలు చేసి.. ఆ తర్వాత వచ్చే భారీ ప్రాజెక్టులకు ఎక్కడ భూములు కేటాయించాలనే విషయాలపై దృష్టిపెట్టడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ క్యాపిటలిస్టులా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు నానాటికీ జోరందుకుంటున్నాయి. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలనో కాపాడేందుకు నడుం కట్టనవసరం లేదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిదని ప్రజలు అంటున్నారు. -
ఈవైపు చూడరే..
►రాజధాని కమిటీ పరిశీలనే చేయలేదు ►ఒక్క జాతీయ సంస్థకూ నోచుకోలేదు ►దొనకొండ ప్రతిపాదన బుట్టదాఖలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి రావడంతో ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట రాజధాని గుర్తింపు, అభివృద్ధి ప్రతిపాదనల దశలోనే ప్రకాశం జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అన్ని అవకాశాలు ఉన్న దొనకొండ ప్రాంతాన్ని కనీసం రాష్ట్ర రాజధాని కోసం వేసిన శివరామకృష్ణ కమిటీ పరిశీలించకపోవడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు హామీలిస్తున్నప్పటికీ అవి అమలులోకి తేవడంలో వైఫల్యం చెందుతున్నారు. - రాజధాని ఎక్కడన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు బిల్లులో పేర్కొన్నట్లు రాష్ట్రానికి ఇచ్చిన 11 జాతీయ సంస్థలు ఎక్కడెక్కడ అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం కమిటీకి వివరించింది. ఆ 11 సంస్థల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లాకు కేటాయించకపోవడం దారుణమని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ, కాకినాడలో పెట్రోలియం యూనివర్శిటీ, విశాఖపట్నంలో ఐఐఎం, గుంటూరులో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీ, అనంతపురం - కర్నూలు మధ్య ఐఐఐటీ, కర్నూలులో ఎన్ఐటీ, విజయవాడలో సెంట్రల్ యూనివర్శిటీ, పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి స్పష్టం చేసింది. ఇందులో ప్రకాశం జిల్లాకు చోటు దక్కలేదు. - ఒంగోలు జాతి పశువులకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో కనీసం వెటర్నటీ యూనివర్శిటీ అయినా కేటాయిస్తారని చూసిన ఈ ప్రాంత వాసులకు నిరాశే మిగిలింది. - కృష్ణా - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని చెప్పిన కమిటీ భూసేకరణ ఎలా చేస్తారో వివరించలేదు. కనీసం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎన్ని అందుబాటులో ఉన్నాయి. ఎంత భూమిని ప్రైవేటు వ్యక్తులు, రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. - ప్రకాశం జిల్లాలోని దొనకొండ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 54 వేల 483 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు లెక్కలు తీశారు. ఇందులో 34 వేల ఎకరాలు యధాతథంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 వేల ఎకరాలు అటవీ భూమి. దీన్ని డీ-నోటిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ పురాతన విమానాశ్రయంతో పాటు అతి సమీపంలో జాతీయ రహదారి ఉంది. అయినా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా... పదేపదే గుంటూరు, విజయవాడ అంటూ ప్రచారం చేయడంలో ఆంతర్యమేంటనే అనుమానం కలుగుతోంది. - ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే. దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - ఈ ప్రాంతం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో ఉన్నా ఆయన స్పందించలేదు. ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఒంగోలు - నెల్లూరు మధ్య విమానాశ్రయం, జాతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని జిల్లా మంత్రి ప్రకటిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
దొనకొండను చూడరేం?
ప్రయాణ సౌకర్యాలను బట్టి దొనకొండ ఎంతో అనువైనది. అక్కడ ప్రభుత్వ భూమే మొత్తం 54,483 ఎకరాలతో అనువుగా ఉంది. అటవీభూమి 20,248 ఎకరాలుంది. బీడుగా పడివున్న 10,037 ఎకరాలున్నాయి. ప్రకృతి రమణీయతతో కొండలు! రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు దొనకొండకు మధ్య దూరం ఎక్కువేమీ లేదు. విశాఖ, విజయవాడ, గుంతకల్లు, మద్రాసు, బెంగళూరులకు ఇక్కడ నుంచి రైలు సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం నంద్యాల-విజయవాడ మధ్య రైల్వే మార్గం ఉంది. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు నిర్మిస్తున్న రైలుమార్గం మరో 30 కిలోమీటర్లు నిర్మిస్తే ఈ పథకం పూర్తయినట్టే. ఆ పనులు పూర్తయితే హైదరాబాద్ - బెంగళూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ‘ఈ విశ్వ ప్రపంచంలో చరిత్రలేని వస్తువేమున్నది? చరిత్ర రాయికున్నది, రప్పకున్నది. మనుషులకు ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? (అందుకే)రాతికి సంబంధించిన చరిత్ర భూగర్భశాస్త్రంగా పరిణమించింది. రప్పకున్న చరిత్ర వృక్షశాస్త్రంగా వికసించింద’ని మన సుప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు మల్లంపల్లివారు చెప్పారు. అలాగే శాసనాధారాలు లేని ప్రాంతంలేదు. పాలనకు అనువుగాని మండలాలు, గ్రామాలు, ప్రాంతాలూ ఉండవు. ఒక నాటి అశ్మక జనపదా నికి నేటి బోధన్ చిరు రాజధాని కాదా? 17-18 శతాబ్దాల్లో కర్నూలు చిన్నదైనా హైదరాబాద్ నవాబులకు రాజధానిగా పేరొందలేదా? 14వ శతాబ్దిలో నాటి విశాఖ, విజయనగరం జిల్లాలలోని వీర నారాయణం, గుడివాడ, లక్కవరపు కోట ప్రాంతాలు కలిపి ఏర్పడిన ‘జంతుర్నాడు’కు రాజ ధానిగా ఉన్న ఎలమంచలి చిన్నది కాదా? కందర రాజులకు నరసరావుపేటలోని ‘కపోత కందర పురం’గా పేరుపడిన చేజెర్ల గ్రామం రాజధానిగా లేదా? పూర్వ చాళుక్య రాజధానులుగా జననాథపురం (ద్రాక్షారామం), పెదవేగి కుగ్రామాలు లేవా? పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు విభజనానంతరం పరిశేష రాష్ట్రంలో ఆ పదవి చేపట్టడం న్యూన తగా భావిస్తున్నట్టుంది! ఆ చూపే ప్రకాశం జిల్లా దొనకొండను చూడనివ్వదు! అన్నీ ఉన్నా ‘అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా ఈ రాష్ట్రానికి రాజధాని కొరత! నేటి స్పెక్యులేటివ్ ధనస్వామ్య ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా నడుపుతున్న నాయకుల హయాంలో ఏపీ రాష్ట్ర రాజధాని సమస్య కూడా ’చట్టా వ్యాపారం’లో భాగస్వామి అయిపోయింది! ప్రపంచంలో ఏ దేశంలోగానీ, ఏ రాష్ట్రంలోగానీ భారీ జనాభా సాంద్రతతో కిక్కిరిసిపోయిన పట్టణాలే, ప్రాంతాలే లేదా ప్రదేశాలే ఆ దేశాలకు గానీ, అక్కడి రాష్ట్రాలకు గానీ రాజధానులుగా ఎంపిక కాలేదు. చిన్న పట్టణాలు, లేదా ప్రాంతాలు కూడా రాజధానులై శోభించినవే. అమెరికాలోని న్యూయార్క్ రాజధాని ఆల్బనీ ఒకనాటి చిన్న సిటీ. కాలిఫోర్నియా రాజధాని శాన్ఫ్రాన్సిస్కో పెద్ద నగరం కాదు... పిట్టంత శాక్రమెంట్! అలాగే ఆస్ట్రేలియా రాజధాని ఓ చిన్నపాటి పాలనా కేంద్రం. కానీ ఆస్ట్రేలియా ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలు సిడ్నీ, మెల్బోర్న్! అదీ పాలనాకేంద్రాల వికేంద్రీకరణ అంటే! రెండు ప్రాంతాలకు చేరువగా... ఇలా చూసినపుడు నూతన రాజధాని ఎంపికను ఆర్థిక ‘సామ్రాజ్యాలు’ సృష్టించుకున్న మోతుబరుల కార్పొరేట్ ప్రయోజనాల రీత్యా నిర్ణయించ కూడదు. ప్రైవేట్ భూముల క్రయవిక్రయాల స్పెక్యులేషన్‌కు తావివ్వరాదు. పైగా రాయలసీమవాసులు యావదాంధ్రజాతి ఐక్యత కోసం ఒకసారి కర్నూలును కోల్పోయి, రాజధాని ప్రతిపత్తిని త్యాగంచేశారు. కాబట్టి అటు రాయలసీమకు, ఇటు కోస్తాంధ్రకు అందుబాటులో ఉన్న దొనకొండ పట్టణం రాష్ట్ర రాజధానిగా పరిశీలనార్హమైనదే. ప్రకాశం జిల్లాకు తూర్పున సముద్ర తీరం, కొత్తపట్నం, చీరాల దగ్గర ఓడరేవు, నౌకా కేంద్రాలున్నాయి. పుష్కలంగా ఉన్న భూవసతి దమ్మిడీ ఖర్చు లేకుండా ప్రభుత్వభూమే మొత్తం 54,483 ఎకరాలతో అను వుగా ఉంది. అటవీభూమి 20,248 ఎకరాలుంది. బీడుగా పడివున్న 10,037 ఎకరాలున్నాయి. ప్రకృతి రమణీయతతో కొండలు! రాష్ట్రంలోని వివిధ జిల్లా లకు దొనకొండకు ఉన్న దూరం ఎక్కువేమీ లేదు. జిల్లాలోని పెద్ద పట్టణా లలో దొనకొండ ఒకటి. మైదాన ప్రాంతం. సముద్రమట్టానికి 446 అడుగుల ఎత్తులో ఉంది. వ్యవసాయం, దానిపై ఆధారపడిన అనుబంధ ఉత్పత్తులు ప్రధాన వర్తక, వాణిజ్యాలు. ప్రసిద్ధ వ్యవసాయ క్షేత్రం ఆరవల్లిపాడు దగ్గరే ఉంది. వైశాల్యంతో పోలిస్తే జన సాంద్రత తక్కువ! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన విమానాశ్రయం నిరుపయోగంగా ఉంది. వ్యూహాత్మ కంగా కీలకం కనుక ఇక్కడ ఇంధనం నింపుకునే కేంద్రంగా ఏరోడ్రోమ్‌ను నిర్మించారు. కోస్టల్ కారిడార్ ఏర్పడితే రోడ్డు మార్గం కూడా అందుబాటు లోకి వస్తుంది. అంతా రాజధానిగా భావిస్తున్న గుంటూరుకు ఇది 140 కిలో మీటర్లలోనే ఉంది. దొనకొండకు 10 కి.మీ. దూరంలో జాతీయ రహదారి ఉంది. భూకంప మండలానికి కూడా చాలా దూరంగా ఉన్న పట్టణం దొనకొండ అని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ఇక వరదలకూ అది దూరమే! అలాంటి దొనకొండ కోస్తాంధ్ర, రాయలసీమల సాంస్కృతిక బంధాలకు ఏపీ నడిబొడ్డుగా ఉంటుందని వివిధ ప్రజా సంఘాలు కూడా భావిస్తున్నాయి. రైల్వే సౌకర్యాల నిలయం విశాఖ, విజయవాడ, గుంతకల్లు, మద్రాసు, బెంగళూరులకు ఇక్కడ నుంచి రైలు సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం నంద్యాల - విజయవాడ మధ్య రైల్వే మార్గం ఉంది. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు నిర్మిస్తున్న రైలు మార్గం మరో 30 కిలోమీటర్లు నిర్మిస్తే ఈ పథకం పూర్తయినట్టే. ఆ పనులు పూర్తయితే హైదరాబాద్ - బెంగళూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. విజయవాడ నుంచి చెన్నై, విశాఖలకు కనెక్టివిటీ ఉంది. బనగానపల్లె (కర్నూలు జిల్లా) వరకూ రైలుపట్టాలు నిర్మించారు. రాయలసీమ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలను కలిపే ప్రధాన రైలుమార్గం ఉంది. దొనకొండలోనే స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ కూడా ఉంది. దొనకొండ మీదుగా వెళ్లే ప్రతి రైలుకూ స్టీమ్ లోకో మీటర్ గేజ్ ఉన్నప్పుడు అందుబాటులో ఉండేది. అప్పట్లో రైల్వే ఎస్టాబ్లిష్ మెంట్ దొనకొండ పట్టణ వ్యవస్థకు జీవనాడిగా వర్ధిల్లింది. అలాంటిది మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చడంవల్ల స్టీమ్ ఇంజిన్లకు బదులు డీజిల్ లోకోలు రావడంతో స్టీమ్ లోకో షెడ్డు మూతబడింది. రైల్వే ఉద్యోగులంతా ఇతర రైల్వే డివిజన్లకు వలసపోవడంతో దొనకొండ పట్టణం ప్రధానమైన ఒక ఆర్థిక సౌలభ్యాన్ని కోల్పోవలసివచ్చింది. ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ నిర్మానుష్యంగా ఉండిపో యాయి. రైల్వేస్టేషన్ కోడ్‌లో ఒకప్పుడు ‘డి.కె.డి’గా ప్రసిద్ధి కెక్కిన దొనకొండను అందరం కాపాడుకోవాలి. ఒక ప్రధాన కేంద్రంగా కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సాధించేందుకు ఎంపీలు కృషిచేయాలి. నీరూ సమస్య కాదు మండల కేంద్రమైన దొనకొండకు కేవలం వంద కిలోమీటర్లలోనే ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీజలాలు తేలిగ్గా చేరతాయి. సాగర్ కాలువ ప్రవహించే లక్ష్మీపురం పంచాయతీ దొనకొండ మండలంలోనిదే. అంతేగాదు రెండు సొరంగాల ద్వారా కృష్ణా జలాలను పారించడానికి ఉద్దేశించిన వెలుగొండ ప్రాజెక్టు త్వరలోనే పూర్తికావస్తోంది. అలాగే నీటి సరఫరాను గుండ్లకమ్మ నది ద్వారా కూడా పెంచుకోవచ్చు. దొనకొండకు కృష్ణా నుంచి 10 టీఎంసీల నీరు ఇప్పించడం సాధ్యమే. ఎందుకంటే, దొనకొండ పక్క నుంచే ప్రవహించే దర్శి బ్రాంచి కెనాల్ ఈ నీటిని రాజధానికి చేర్చడం చాలా సులభమని నిపుణుల అంచనా! నాయకులు పిదప ఆలోచనలు మాని కోస్తా, రాయలసీమ ప్రజాబాహుళ్యపు విశాల ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని తద్వారా మిగిలిన రాష్ట్ర గౌరవ, ప్రపత్తులనైనా నిలబెట్టగలరని ఆశిద్దాం! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
ఇప్పుడు చూపు..అమరావతి వైపు
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై రోజుకో పుకారు షికారు చేస్తుండడంతో భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొత్త రాజధాని గుంటూరు- విజయవాడ మధ్య ఏర్పాటు కానుందనే ప్రచారం నేపథ్యంలో పెదకాకాని, వెనిగండ్ల, నంబూరు, కాజ, మంగళగిరి ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెకైగసి తిరిగి కిందకు పడిపోయాయి. తాజాగా, కొత్త రాజధాని ఏర్పాటుకు అమరావతి ప్రాంతం అనుకూలమని వెలువడిన సమాచారంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు మొలిచాయి. భూములపై పెట్టుబడి పెట్టాలనే ఉత్సాహవంతుల రాకపోకలతో అమరావతి ప్రాంతం సందడిగా మారింది. అమరావతి: అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న పుకార్లతో రూ. లక్షల్లో ఉన్న భూముల ధరలు నేడు రూ.కోట్లు పలుకుతున్నాయి. మండల పరిధిలో భూముల కొనుగోలుకు నిత్యం వందలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు, రాజకీయనాయకులు ఎర్రని ఎండను సై తం లెక్కచేయకుండా పొలాలగట్ల వెంట తిరుగుతున్నారు. = నిన్న మొన్నటి వరకు మండల కేంద్రమైన అమరావతిలో గజం రెండు వేలు పలికితే గొప్పగా ఉంటే నేడు 10 నుంచి 12 వేల రూపాయల వరకు చెపుతున్నారు. దీంతో ఎకరం భూమి విలువ రూ. కోట్లకు చేరింది. = అమరావతిలో విజయవాడ రోడ్డు, గుంటూరు రోడ్డులో భూముల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండగా, సత్తెనపల్లి రోడ్డులో అడపాదడపా అమ్మకాలు సాగుతున్నాయి. = నిన్నటి వరకు విజయవాడ, గుంటూరు రోడ్డులో ఎకరం 20 నుంచి 30 లక్షల రూపాయల ధర పలికితే నేడు కోటి నుంచి రెండు కోట్ల రూపాయలకు కూడా కొనుగోలు చేయటానికి వెనుకాడటం లేదని చెపుతున్నారు. = రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూసి యజమానులు భూమిని అమ్మాలా వద్దా అని అయోమయానికి గురవుతున్నారు. = {పస్తుతం కోట్లతో కొనుగోలు చేసిన భూములకు అడ్వాన్స్‌లిచ్చి అగ్రిమెంట్లు రాసుకోవటంతో తప్ప రిజిస్ట్రేషన్లు జరిగిన దాఖలాలు లేవు. = మండల పరిధి గ్రామాల్లో కూడా రోడ్డు పక్క భూములు 30 నుంచి 50 లక్షలు, లోపల భూములు 10 లక్షల రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి. = ఇక వాగుల పరివాహక ప్రాంతంలో వర్షాకాలంలో నీట మునిగే భూములను ఎకరా 30 నుంచి 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని ? అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తున్నారని, కృష్ణానదిపై పలు చోట్ల బ్రిడ్జిల నిర్మాణం జరగనుందంటూ ఈ ప్రాంతంలో గత వారం రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు మిగులు భూములు వున్నట్టు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం ఈ పుకార్లుకు బలం చేకూరుస్తుంది. = పక్కనే ఉన్న అచ్చంపేట మండలంలో కూడా అటవీ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు ఉండటంతో రాజధాని ఏర్పాటుకు అనుకూలమని ఎవరికి వారే ఊహించుకుంటూ భూముల ధరలు పెంచేస్తున్నారు. = ఇదిలావుంటే, మూడు నెలలుగా రెవెన్యూ కార్యాలయంలో అడంగుల్ తప్ప పట్టాదారుపాస్ పుస్తకాలు ఇవ్వటం లేదు. ఒక్కసారిగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి పోవటంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా పాస్ పుస్తకాలు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు మా కార్యాలయంలో ఇంతవరకు రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండా పొలాలకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. అలాంటి వాటిని తిప్పి పంపుతున్నాం. అన్నీ నిబంధనల ప్రకారమే జరుపుతున్నాం. - సిహెచ్ బుజ్జిబాబు, అమరావతి సబ్ రిజిస్ట్రార్ -
నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్!
- నర్సరీ టూ ఆరు వరకు తరగతులు - నేటి నుంచి అడ్మిషన్లు సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజధాని నగరంలో హిందూస్తాన్ గ్రూప్ విద్యా సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. కొరియ రాయబారి క్యూంగ్సూ కిం ఈ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. విద్యారంగంలో హిందూస్తాన్ గ్రూప్ దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ గ్రూపు పరిధిలో నావిగేషన్, ఇంజినీరింగ్ తదితర విద్యాలయాలెన్నో ఉన్నాయి. ఉన్నత విద్యారంగంలో మెరుగైన సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్న ఈ గ్రూప్ అంతర్జాతీయ ప్రమాణాలతో నర్సరీ నుంచే విద్యార్థులకు విద్యనందించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. సెయింట్ థామస్ మౌంట్లోని హిందూస్థాన్ కార్యాలయ ఆవరణలో ఎకరా విస్తీర్ణంలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌ను కొరియ రాయబారి క్యూంగ్ సూ కిం ప్రారంభించారు. హిందూస్తాన్ విద్యా సంస్థల సేవల్ని గుర్తుచేస్తూ తన ప్రసంగంలో క్యూంగ్ సూ కిం ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాల్లోని విద్యావిధానం, ఉద్యోగ అవకాశాల్ని గుర్తుచేశారు. హిందూస్తాన్ గ్రూప్ చైర్పర్సన్ ఎలిజబెత్ వర్గీస్ మాట్లాడుతూ తన భర్త దివంగత కేసీజీ వర్గీస్ ఓ సామన్యుడని గుర్తుచేశారు. ఆయన నాటిన ఈ విద్యా సంస్థ నేడు మహా వృక్షంగా అవతరించిందని పేర్కొన్నారు. ఆయన పడ్డ శ్రమకు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఆయన చేసిన సేవల్ని తాము కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను చిన్న నాటి నుంచి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగానే ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు ఈ స్కూల్లో విద్యాబోధనను అందించనున్నామని, కాల క్రమేనా పదో తరగతి వరకు విస్తరణ జరుగుతుందన్నారు. శనివారం నుంచి అడ్మిషన్లు ఆరంభం కానున్నాయని ప్రకటిస్తూ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల్ని ఈ స్కూల్లో పనిచేయడానికి ఎంపికచేసినట్టు తెలిపారు. హిందూస్తాన్ గ్రూప్ డెరైక్టర్, సీఈవో ఆనంద్ జాకబ్ వర్గీస్, డెరైక్టర్ అశోక్ వర్ధన్, ఆ స్కూల్ ప్రిన్స్‌పాల్ రేనుదత్తా పాల్గొన్నారు. -
ఊహల రాజధానిలో ‘రియల్’ రెక్కలు!
పుట్టుకొస్తున్న అక్రమ లే అవుట్లు కృష్ణా పరీవాహక ప్రాంతంపై కన్ను రెట్టింపయిన ధరలు పెడన/ నందిగామ : రాష్ట్ర రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేయనున్నారనే ఊహల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లోనున్న భూముల ధరలకు సైతం రెక్కలొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ప్రకటనల మూలంగా ఒక్కసారిగా ఊపందుకుంది. కమిషన్ ఏజెంట్లు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల రేట్లను ఒక్కసారిగా చుక్కల్లో చూపుతున్నారు. గతంలో సెంటు రూ.లక్ష కూడా ఉండకపోగా నేడది ఒక్కసారిగా రూ.6,7 లక్షలు చెబుతున్నారు. ఎకరా రూ.50 లక్షల విలువ చేయని వ్యవసాయ భూమి నేడు రెండు కోట్ల రూపాయల పైనే చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ కొనకుండా పడిఉన్న వెంచర్లలో పిచ్చి కంపచెట్లు తొలగించి అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. రైతులు ఒక రోజు చెప్పిన ధర మరో రోజు చెప్పకుండా రోజురోజుకు తమ భూముల రేట్లను రూ.లక్షల్లో నుంచి రూ.కోట్లలోకి పెంచుకుంటూపోతున్నారు. కొంతమంది రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.అక్రమాలను అరికట్టాల్సిన అధికార యంత్రాగం నిద్ర నటిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. పెడనలో అక్రమ లేఅవుట్లు... పెడన-గుడివాడ, మచిలీపట్నం-పెడన, పెడన- బంటుమిల్లి రోడ్డుల్లో అక్రమ లే అవుట్లు రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్నాయి. పెడన పట్టణంలో జగపతి థియేటర్, చోడుదిక్కులు, బైపాస్ రోడ్డు, 216 జాతీయ రహదారి, బ్రహ్మాపురం, గుడివాడ రోడ్డుకు వెళ్లే బైపాస్ రోడ్డు, బంటుమిల్లి రోడ్డు, తోటమూల ఏరియా, చూజీ వెనుక, బుద్ధాలపాలెం రోడ్డు , డంఫింగ్ యార్డు సమీపంలో వందకు పైగా అక్రమ లేఅవుట్లు వెలసినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో వ్యవసాయ భూముల నుంచి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ప్లాట్లు వేసి అమ్మకాలు చేసినవే అధికంగా ఉన్నాయని తెలుస్తుంది. గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు... అక్రమ లేఅవుట్ల ద్వారా మునిసిపాలిటీకి చెల్లించాల్సిన ఆదాయం రూ.3.22 కోట్లవరకు గండి పడినట్లు మున్సిపల్ అధికారులు విజిలెన్స్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జగదీశ్వరరెడ్డికి గతంలో నివేదించారు. ఈ నివేదికపై విజిలెన్స్ ఎన్స్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు చేసి పెడన మున్సిపాల్టీలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నివేదికల ఆధారంగా రియల్టర్లకు ఎలాంటి జరిమానా వేసిన ధాఖలాలు లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రియల్టర్లుకు పాలకులు పూర్తీసహాయ సహకారాలు అందించడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. కృష్ణానది పరీవాహక ప్రాంత పొలాలకు మంచి డిమాండ్... నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉండటంతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారు నదీ తీర ప్రాంతంలో భూములు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే చందర్లపాడు, నందిగామ, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలాల్లో నదీ తీరంలో 20కి పైగా కెమికల్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు ప్రారంభం కానున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒకరు కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో రెండు పరిశ్రమల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే వందలాది ఎకరాలు కారుచౌకగా కొనుగోలు చేశారు. ఆ క్రమంలోనే కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు స్థల సేకరణకు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. పరిశ్రమలోని వ్యర్థాలను కృష్ణానదిలో వదిలేందుకు అనువుగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ‘రాాజధాని’ ఎర చూపి రియల్ మాఫియా ఇష్టారాజ్యం వ్యవహరిస్తుందనే విమర్శలొస్తున్నాయి. -
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు
- ఆర్థిక ఆసరా కోసం హెచ్ఎండీఏ నిరీక్షణ - సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆరాటం సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏ కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొంది. అప్పుల ఊబి నుంచి సంస్థను బయటపడేస్తే చాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఏదోవిధంగా నిధులు సమకూర్చుకుంటామని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ని ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తమ సర్కారు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారుల్లో ఆరాటం మొదలైంది. నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏలో కొత్త ఆశలు రేకెత్తాయి. నూతన ప్రాజెక్టులకు నిధుల విషయంలో ప్రభుత్వ సాయం ఇతోధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలుత సంస్థను అప్పుల నుంచి బయటపడేయాలని అభ్యర్థిస్తున్నారు. కోకాపేటలో ప్రభుత్వ భూములు వేలం ద్వారా అమ్మిపెట్టినందుకు రూ.700కోట్లు ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి రావడం సంస్థను ఆర్థికంగా కుంగదీసింది. ఇప్పటికే రూ.280కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏ మిగతా రూ.420కోట్లు బకాయి పడింది. ఇదిలా ఉండగా నిధుల్లేక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్, ఔటర్‌పై లాజిస్టిక్ పార్కులు, నగరంలో పలు ఫ్లైఓవర్లు, రేడియల్ రోడ్లు, తదితర ప్రాజెక్టులను అధికారులు నిలిపేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటికీ 33.3కి .మీ. అసంపూర్తిగా మిగిలిపోయింది. మహా నగరాభివృద్ధిపై ఓ విజన్‌తో ఉన్న కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోకపోతే ఆ సంస్థ భవితవ్యమే ప్రశ్నార్థకం కాగలదు. పీకల్లోతు అప్పుల్లో... సొంత భూములు విక్రయించడం ద్వారా సమకూరిన నిధులతో పాటు వివిధ బ్యాంకుల నుంచి రుణ ంగా తెచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించి హెచ్ఎండీఏ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ.1100కోట్ల రుణాల తాలూకు నెలకు రూ.8కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. నెలవారీ ఆదాయం మొత్తం వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతాలకు మినహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి లేదు. స్థలాల విక్రయాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని అధికారులు ప్రయత్నించినా అది సాధ్యమయ్యేలా లేదు. జలవనరుల సంరక్షణ, అభివృద్ధికి హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అమలుకు నిధుల కరువు. రీజనల్ రింగ్‌రోడ్డు, నగరానికి నలువైపులా రైల్ టెర్మినళ్లు, అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్ల అభివృద్ధి, నగర ట్రాఫిక్‌పై అధ్యయనానికి హెచ్ఎండీఏ నడుంబిగించినా నిధుల కొరత వెనక్కి లాగుతోంది. ఫలితంగా తన అభివృద్ధి ప్రణాళికను అమలులోకి తీసుకురాలేక సతమతమవుతోంది. నగరాభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఎండీఏకు మాత్రం ఇంతవరకు సొంతభవనం లేదు. నిర్మించుకోవాలన్న ప్రయత్నమూ బెడిసికొట్టడంతో వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలను కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి ఆదుకుంటే తప్ప హెచ్ఎండీఏ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే సూచనలు కన్పించట్లేదు. -
‘సీమ’లో రాజధాని ఏర్పాటు చేయాలి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు అవ్వారు మల్లికార్జున,సంగటి మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా విలీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించినప్పుడు రాయలసీమలో ఉన్న రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆ విధంగా రాయలసీమ వాసులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో గతంలో లాగానే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, అలా కాకుండా కృష్ణా,గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం సరికాదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో భాగమైన రాయలసీమ వాసులతో కనీసం చర్చించకుండానే కోస్తా నాయకులు రాజధాని విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రాయలసీమలో పర్యటించపోవడం దారుణమని విమర్శించారు. వెనుకబడిన ‘సీమ’లోనే రాజధాని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంపా తిరుపతి, జేవీ రమణ, బండి ప్రసాద్, ఈ.బాలవీరప్ప, బి.దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
ప్యాకేజీ డొల్ల.. రాజధాని కల్ల ! చర్చ
-
హైదరాబాద్.. హమారా! ఎలుగెత్తి చాటిన ముస్లింలు
కల్లూరు రూరల్ / కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదని, దానిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం తగదని ముస్లింలు నినదించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం శుక్రవారం కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజు తర్వాత కమిటీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మౌలానా అబ్దుల్‌మాజిద్, సయ్యద్ అల్తాఫ్ హుసేన్, కన్వీనర్ అయూబ్ఖాన్ల ఆధ్వర్యంలో ఉస్మానియా కళాశాల మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వన్‌టౌన్, పూలబజార్, పెద్దమార్కెట్, పాతబస్టాండు, కోట్లసర్కిల్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుంది. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై పార్టీలకు అతీతంగా పలువురు ముస్లిం నాయకులు ప్రసంగించారు. రాయలసీమ ప్రాంతం వెనకబాటులో ఉందంటూ 2009లో శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా నివేదించిందని, సీమకు న్యాయం చేయడం వదిలేసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తారా అంటూ జేఏసీ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్‌మాజిద్ ప్రశ్నించారు. హైదరాబాదు ముస్లింలు నిర్మించిన నగరమని, అక్కడి చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలను వదులుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరని ప్రధాన కార్యదర్శి సయ్యద్ అల్తాఫ్ హుసేన్ పేర్కొన్నారు. హైదరాబాదు మీది, మాది, మనందరిదని వ్యాఖ్యానించారు. లావుబాలీ దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఆరిఫ్‌పాషా ఖాద్రి మాట్లాడుతూ ముస్లిం జనాభా విషయంలో రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత కర్నూలుకు ప్రాధాన్యముందని, విభజన సమంజసం కాదని సూచించారు. విభజన నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం: హఫీజ్‌ఖాన్ విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా కన్వీనరు హఫీజ్ ఖాన్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాదిగా ముస్లిం ప్రజలు తరలివచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇందులో ఏ వ్యక్తి ఒక పార్టీ ప్రయోజనాల కోసం రాలేదని, అన్నిపార్టీల ముస్లింలు సమైక్యాంధ్ర కోసం ఒకే వేదికపైకి వచ్చారన్నారు. కర్నూలు రాజధానిగా కొనసాగి ఉంటే హైదరాబాదుపై కేసీఆర్ కన్ను పడేదా అని ప్రశ్నించారు. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాదుపై ఆధారపడ్డామని, దానిని కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు బి.ఎ.కే.పర్వేజ్ మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలు ఒకసారి రాజధానిని త్యాగం చేశారని, మరోసారి త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణా ఎవరి సొత్తు కాదని, 700 ఏళ్ల క్రితం ‘మగ్బూలి తెలంగాణా’ అనే నవాబు పాలించడంతో దానికి ఆ పేరు వచ్చిందని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ మొహియుద్దీన్ పేర్కొన్నారు. ఎస్డీపీఐ నేత అబ్దుల్‌వారిస్ మాట్లాడుతూ.. ఏకపక్షంగా విభజించేందుకు రాష్ట్రం సోనియా సొత్తు కాదని, రాష్ట్రంలో 60 శాతం ఆదాయాన్ని సమకూర్చే హైదరాబాదును తెలంగాణకు ఇస్తే ఒప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. ఒకే భాష మాట్లాడే ప్రజలను విభజించడం దారుణమని, తమ శక్తియుక్తులను సమైక్యాంద్ర కోసమే ధారపోస్తామని నోబుల్ సర్వీసెస్ సొసైటీ నాయకుడు అబ్దుల్జ్రాక్ పేర్కొన్నారు. మానవుని మనుగడకు నీరు, జీవనోపాధి చాలా అవసరమని, రాష్ట్ర విభజన జరిగితే ఇక్కడి ప్రజలు ఈ రెంటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందని రిటైర్డు విజిలెన్స్ అధికారి మహ్మద్ ఇలియాస్‌సేఠ్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన సభకు మౌలానా జాకిర్‌అహ్మద్ రషాదీ అధ్యక్షత వహించారు. అబ్దుల్‌గనీ ఉమ్రి, మౌలానా జుబేర్ అహ్మద్‌ఖాన్, మౌలానా అబ్దుల్ జబ్బార్, డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ హుసేన్, మౌలానా సులేమాన్ నద్వి, హాఫిజ్ అబ్దుల్లా, న్యాయవాది చాంద్‌బాష, డాక్టర్ మన్సూర్ అహ్మద్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సిద్ధమవ్వాలి: కవిత
రాష్ర్ట విభజనకు సీమాంధ్ర నా యకులు మానసికంగా సిద్ధమవ్వాలని తెలంగాణ జాగృ తి ఆధ్యక్షురాలు కె.కవిత అన్నారు. మల్లాపూర్ నోమా కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి ఏడో వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ‘తిరుపతి వెంకన్నతో మాకూ అనుబంధం ఉంది. అంతమాత్రాన ఆయన హుండీలో వాటా అడుగుతున్నామా? మరి సీమాంధ్రులు హైదరాబాద్‌లో వాటా ఎలా అడుగుతారు’ అని కవిత ప్రశ్నించారు. సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోధారి శ్రీను రచించిన ‘జయహో జాగృతి’ పాటల సీడీ, ‘గమ్యం.. గమనం’ పుస్తకం, ‘తెలంగాణ జాగృతి’ మాస పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ జాగృతి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా కవిత, చైర్మన్‌గా పానిపర్తి తిరుపతిరావు, ప్రధానకార్యదర్శిగా రాజీవ్‌సాగర్‌లను ఎన్నుకున్నారు.