రాష్ట్ర సర్కారే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే .....
రాష్ట్ర సర్కారే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే .....
Published Mon, Jul 28 2014 12:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
ఏపీ రాజధాని వ్యవహారం ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ గా మారింది. కమిటీలు, నిపుణులు జాన్తా నై... మా ప్రయోజనాలు సిద్ధించే చోటే మా రాజధాని అన్నట్టు తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారు. నేలవిడిచి సాము చేస్తున్నట్టు వేలాది ఎకరాలు కావాలని చెబుతూ భూముల ధరలకు బూమ్ కల్పించే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ, గుంటూరుల మధ్య దూరం ముప్ఫై కిలోమీటర్లు. ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలమని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా సెలవిస్తున్నారు. ఇక్కడ 30000 ఎకరాలు కావాలని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అదే సమయంలో చుక్కలనంటిన భూముల ధరలను సేకరించడం సులభం కాదనే విషయాన్ని ఆయనే అంగీకరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో అనవసరంగా భూముల ధరలకు రెక్కలు వచ్చి, సామాన్యులు గజం భూమి కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది.
నిజానికి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలు నిర్మించడానికి గట్టిగా 200 ఎకరాలు సరిపోతుందని శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడైతే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుందో ఆ ప్రాంతానికి దాదాపు నలభై, యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలోని చుట్టుపక్కల ప్రాంతాలు సమీప భవిష్యత్ లో అభివృద్ధి జరగడం ఖాయం. ఆ అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం పూనుకోనవసరం లేదు. అవసరమైన ప్రణాళికలేంటనే విషయాల పట్ల ప్రభుత్వం చొరవ తీసుకుంటే సరిపోతుంది.
ఒక కొత్త మహా నగరాన్ని సృష్టించాలనే ఆలోచన కంటే... ఉన్న భూముల్లో పరిపాలనా వ్యవహారాలకు అవసరమైన నిర్మాణాలు చేసి.. ఆ తర్వాత వచ్చే భారీ ప్రాజెక్టులకు ఎక్కడ భూములు కేటాయించాలనే విషయాలపై దృష్టిపెట్టడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ క్యాపిటలిస్టులా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు నానాటికీ జోరందుకుంటున్నాయి. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలనో కాపాడేందుకు నడుం కట్టనవసరం లేదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిదని ప్రజలు అంటున్నారు.
Advertisement
Advertisement