
ప్రైవేటు ఉద్యోగులకు వార్నింగ్‌లు
సంబంధిత యజమానులకు ఫోన్లు
ప్రత్యర్థికి ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నలు
విస్తుపోతున్న ఉత్తర నియోజకవర్గ వాసులు
సాక్షి, విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్‌రాజుకు ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఆయన బెదిరింపులకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తన గెలుపు కోసమే పనిచేయాలన్న భావనతో ఆయన ఉన్నారు. అలా ఎవరైనా తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిస్తే ఆయన సహించలేక పోతున్నారు. ఆయా సంస్థల యజమానులకు ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం.
‘మీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఫలానా వ్యక్తి నా ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. ఆయన ప్రత్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొనవద్దని చెప్పండి.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారని తెలిసింది. ఇలా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి యజమానికి ఫోన్ చేసి ఇలానే బెదిరింపులకు దిగడంతో సదరు యజమాని ‘మా ఆస్పత్రి పని వేళలు ముగిశాక ఆయన ఏం చేసుకున్నా ఆయన వ్యక్తిగతం.. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు..’ అని ఖరాఖండీగా చెప్పారని సమాచారం.
దీంతో చేసేది లేక విష్ణుకుమార్‌రాజు అసహనంతో ఫోన్ పెట్టేసినట్టు తెలిసింది. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తున్న మరో వ్యక్తి గురించి కూడా సంబంధిత యజమానికి ఫోన్ చేసి ఇదే తరహాలో హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఆ యజమాని కూడా గట్టిగానే సమాధానం చెప్పడంతో విష్ణుకుమార్‌రాజు మిన్నకుండి పోయినట్టు భోగట్టా. ఇలా విష్ణుకుమార్‌రాజు పలువురి పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని, తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయనతో నిత్యం ప్రచారంలో తిరిగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బతిమలాడుకునో, బుజ్జగించుకునో, కాళ్లా వేళ్లాబడో ఓట్లు వేయించుకోవడం పరిపాటి. కానీ విష్ణుకుమార్‌రాజు మాత్రం అందుకు భిన్నంగా బెదిరింపులకు పాల్పడడమేమిటని ఉత్తర నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ఓటమి భయంతోనే ఆయన ఇలా అసహనానికి గురవుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2019లో పోలైనవి 18,790 ఓట్లే..
విష్ణుకుమార్‌రాజు 2014 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. ఆ తర్వాత 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 18,790 ఓట్లే పోలై నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేకే రాజుకు 65,408 ఓట్లు, జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్‌కు 19,139 ఓట్లు లభించాయి. ఈ లెక్కన కేకే రాజుకంటే 46,618 ఓట్లు, ఉషాకిరణ్‌కంటే 349 ఓట్లు తక్కువ వచ్చాయి.
వివాదాల రాజు
విష్ణుకుమార్‌రాజుకు వివాదాస్పదుడన్న పేరు సొంత పారీ్టలోనే ఉంది. ఎప్పుడు ఎవరిని పొగడ్తలతో ముంచెత్తుతారో, ఎవరిని విమర్శిస్తారో ఆయనకే తెలియదన్న పేరు గడించారు. గతంలో ఏపీ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నానని, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్టు పెనుమత్స పేర్కొనడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. దీనిపై సీరియస్ అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెదిరింపులకు దిగడాన్ని ఆ పార్టీ శ్రేణులు సైతం తప్పు పడుతున్నారు. తన గెలుపు కోసం విష్ణుకుమార్‌రాజు ఏటికి ఎదురీదే పరిస్థితులున్నందునే ఆయన అసహనానికి కారణమని చెబుతున్నారు.