సాక్షి, విశాఖపట్నం: బాబూ.. శ్రీభరత్...! సూటిగా సుత్తిలేకుండా మాట్లాడుకుందాం...
👉విద్యా సంస్థల పేరుతో రూ.500 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని తాత కబ్జా చేసి.. నగర ప్రతిష్టను దిగజార్చినప్పుడు విశాఖపట్నం గుర్తుకు రాలేదు.
👉దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంపగా అభివర్ణిస్తూ.. విద్యల నగరం పరువును బంగాళాఖాతంలో కలిపేసినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు.
👉రాజధానిగా విశాఖ నగరం బెస్ట్ అని శివరామకృష్ణన్ కమిటీ ప్రకటించినా.. చంద్రబాబు వైజాగ్ ఎదగకూడదని భావించి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు...
👉 వీఎంఆర్‌డీఏకు చెందిన భూముల్ని దఫదఫాలుగా విక్రయించి.. రూ.1,600 కోట్ల వైజాగ్ సంపదని చంద్రబాబు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు..
👉 నిన్నటికి మొన్న.. నీ సొంత వర్సిటీలో ఫీజుల్ని అమాంతం 40 శాతం పెంచేందుకు ప్రయత్నించినప్పుడూ విశాఖలో ఉన్న విద్యార్థులు గుర్తుకు రాలేదు..
👉 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో అదీ.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో మాత్రం.. వైజాగ్ ఓ గ్రోత్ సిటీ అనీ.. రాజధానిగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని మాత్రం హఠాత్తుగా గుర్తొచ్చేసింది.
👉 దేశ, విదేశాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు వాహ్.. విశాఖ అని కొనియాడుతున్నప్పుడు గుర్తుకు రాని.. విశాఖపట్నం.. ఓటమి భయం ముంచుకొచ్చినప్పుడు మాత్రం తెగ గుర్తొచ్చేసింది..
ఏం భరత్.. ఇదేనా నీ విజ్ఞత.? ఇదేనా విశ్వసనీయత.? ఇదేనా విశాఖకు నీవిచ్చే విలువ.?
👉 2019 డిసెంబర్‌లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినప్పుడు.. శభాష్.. మంచి నిర్ణయమని మెచ్చుకోవడానికి కూడా ఇష్టపడని తమరికి.. ఇప్పుడు మాత్రం అమాంతంగా ప్రేమ ఉప్పొంగిపోతోందంటే ఆశ్చర్యమేస్తోందయ్యా..
👉 చంద్రబాబులా ఏ ఎండకాగొడుగు పడుతూ.. పూటకో అబద్ధం.. మాట మాటకో మాయా మోసం అలవాటైనట్లుగా ఉన్నాయి. నిజమే మరి.. తమరూ ఆ తాను ముక్కే కదా.. ఆ అలవాట్లు రాకుండా ఎలా ఉంటాయి.?
👉 ఏమన్నావ్.. ఏమన్నావ్.??
‘ఇవాళ అమరావతి అభివృద్ధి చేసేందుకు మన దగ్గర అంత డబ్బుల్లేవు. విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుంది. అమరావతి డెవలప్ చేయడానికి పెట్టుబడి చాలా అవసరం. అంత పెట్టుబడి పెట్టే స్థాయిలో ఏపీ ప్రభుత్వం లేదు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ హయాంలో మొత్తం అప్పులు మూడున్నర లక్షల కోట్లు. మనకి ఇవాళ వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితిలో లేము. మనం చూసేది ఏంటంటే.. మనకి గ్రోత్ ఇంజిన్ ఏంటి.? విశాఖపట్నం మన గ్రోత్ ఇంజిన్. అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాతే సాధ్యమవుతుంది.’’
👉 నిజంగానే ఈ మాటలు నీ గుండెల్లోంచే వచ్చాయా భరత్.?
ఇన్నాళ్లూ అమరావతి అందమైన రాజధాని.. అంటూ బాబుతో కలిసి భజన బృందంలో తానా అంటే తందానా అంటూ పల్లవి కలిపిన తమరు.. ఎన్నికలు రాగానే ప్లేటు ఫిరాయించడం భావ్యమేనా భరత్.? ఈ మాటలు కూడా కేవలం ఓట్లు రాల్చుకునేందుకు పలికిన చిలక పలుకులే తప్ప.. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కావన్నది మీ మాటలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. తమరి విశ్వసనీయత ఏపాటిదో.. 2019 ఎన్నికల్లోనే పసిగట్టేశాం. అందుకే ఇంటికి పరిమితం చేశాం.
👉 ఒక్క విషయం గుర్తుంచుకో భరత్...
వేల కేసులు వేసి.. విశాఖ రాజధానిని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నా బెదరలేదు.. అదరలేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేస్తాననీ.. 2024లో ఘన విజయం సాధించి.. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి.. ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని ఢంకాపథంగా చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు కదా.. అదీ మాటంటే.. మాట మనసు లోతుల్లోంచి రావాలి.
లక్షల మంది ఉన్న సమూహంలో మాట్లాడుతున్నా.. ఒక్కొక్కరినీ పలకరించినట్లు మాట్లాడుతున్నట్లుండాలి. అలా మాట్లాడాలంటే.. ప్రతి ఒక్కరి మనసు తెలిసుండాలి. వారి కష్టసుఖాలు ఎరిగి ఉండాలి. ఆ ప్రాంతంపై ఆదరాభిమానాలుండాలి. అది ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యం. అందుకే.. ఆయన విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పగానే.. కేవలం ఇక్కడికే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తం చెప్పినట్లుగా.. గుండె లోతుల్లోకి వెళ్లిపోయింది. ఇది ఫిక్స్.
ఇప్పుడు నువ్వొచ్చి.. కల్ల»ొల్లి కబుర్లు చెబితే.. నమ్మేవారెవ్వరూ లేరు భరత్..
నీ మాటలు ఒక నాటకం.. నీ విజ్ఞత ఒక బూటకం. నీవు నడుస్తున్న నీ పార్టీ ఒక మాయా ప్రపంచం. ముందు అందులోంచి బయటపడు. అప్పుడే విశాఖ అంటే ఏమిటో అర్థమవుతోంది.
ఇట్లు,
విశాఖ ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment