పార్టీ, అభ్యర్థుల గెలుపు, ఓటములపై ఆరా
ఎక్కడ చూసినా ఇదే చర్చ
కూడికలు, తీసివేతల్లో శ్రేణుల నిమగ్నం
లెక్కలు, అంచనాల్లో తలమునకలు
హలో.. అప్పారావ్!.. నేను రాజుబాబుని మాట్లాడుతున్నాను. ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందనుకుంటున్నారు? అవతల పార్టీ అభ్యర్థికి ఎన్ని పడుంటాయ్? అయితే మన పార్టీ కేండిడేట్ గెలుపు గ్యారంటీ అన్న మాట! అది సరే.. స్టేట్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? నీకున్న సమాచారం ఓ సారి చెప్పు!’ అని అడిగే సరికి ఆ రాజుబాబు తనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్నింటిని జోడించి అక్కడ వాళ్లు గెలుస్తున్నారు.. ఇక్కడ వీళ్లు గెలుస్తున్నారంటూ టకటకా చెప్పేస్తున్నాడు. మధ్యమధ్యలో అప్పారావుకొచ్చిన డౌట్‌లను నివృత్తి చేస్తూ ఫలితాలను ముందే ప్రకటిస్తున్నాడు. ఇలాంటి అప్పారావులు, రాజుబాబుల్లాంటి వారు చాలామంది ఈ పనిమీదే ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి చర్చలే సాగిస్తున్నారు. పోలింగ్ ముగిశాక అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపైనే అందరి దృష్టి ఉంది. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ కనిపిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: అంతేకాదు.. ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం తమ స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి ఎన్నికల ఫలితాలెలా ఉంటాయన్న దానిపైనే మాట్లాడుకుంటున్నారు. సాధారణ ప్రజలకంటే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలు వీటిపైనే చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? వాటిలో గెలుపు అంశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై బేరీజు వేస్తున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువతీ యువకులు ఎవరికి వేశారోనని ఆరా తీస్తున్నారు. దానిని బట్టి ఫలానా అభ్యరి్థ/పార్టీ గెలుస్తుందని, లేదా ఓటమి పాలవుతారని అంచనాకొస్తున్నారు. ఇలా కూడికలు, తీసివేతల్లో నిమగ్నమై ఉన్నారు.
లెక్కలు, అంచనాల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు టీవీల్లోను, సోషల్ మీడియాలోను, యూట్యూబ్ ఛానల్స్‌లోనూ ఇప్పటికే అనధికారికంగా ఎగ్జిట్ పోల్స్ పేరిట ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయన్నది జోస్యం చెప్పేస్తున్నారు. ఆయా పార్టీల శ్రేణులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు వీటిని ఎక్కువగా వీక్షిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో ఈ ఎన్నికల్లో తమదే శాస్త్రీయమైన సర్వే అని చెప్పుకుంటూ తమ అభిమాన పారీ్టకి అనుకూలంగా ఫలితాలను ఇస్తున్నారు. మరికొందరైతే అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూల ఫలితాలనే కూటమికి వస్తున్నట్టు తారుమారుగా చూపిస్తున్నారు.
ఇలా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో వ(ఇ)స్తున్న అనధికార అంచనా ఫలితాలు జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో తమ నమ్మకస్తులకు ఫోన్లు చేసి సందేహ నివృత్తి చేసుకుని ఒకింత ఊరట చెందుతున్నారు. వ్యతిరేక ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిస్తే ఆందోళనకు గురవుతున్నారు. టీవీలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో వస్తున్న సొంత అంచనాల ఫలితాలతో ఇప్పటికే బెట్టింగులకు దిగిన వారు మరింత టెన్షన్ పడుతున్నారు.
బెట్టింగులపై కూటమిలో బెరుకు..
మరోవైపు పోలింగ్‌కు ముందు కూటమి అభ్యర్థులదే గెలుపంటూ పందాల కోసం హడావుడి చేసిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గారు. తొలుత 1:2,3 బెట్టింగులకు సిద్ధమన్న వారిప్పుడు 1:1కి కూడా ముందుకు రావడం లేదు. ఏదోలా తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నా.. పందాల దగ్గరకు వచ్చేసరికి పలాయనం చిత్తగిస్తున్నారు. మొత్తమ్మీద అసలు ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తేదీ వరకు ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment